మధురఫలం.. మామిడి..

బంగారు రంగులో, నోరూరించే రుచితో, కమ్మటి వాసన, తినే కొద్దీ తినాలనిపించే కమ్మని అనుభూతినిచ్చే పండు మామిడి పండు. మండే ఎండల్లో దొరికే మధురఫలం. పండ్లలోనే మహత్తరమైన పండు ఇది. ఈ పండంత తియ్యటి పండు మరొకటి లేదంటే అతిశయోక్తికాదు. ఎన్నో దివ్య ఔషధ గుణాలు ఇమిడి ఉన్న మామిడి పండ్లు ఏటేటా వేసవిలోనే ఇవి లభిస్తుంటాయి. తింటే ఎంతో మధురంగా ఉంటాయి. పండ్లు తింటే వేసవిలో వచ్చే వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో జీర్ణశక్తి మెరుగవుతుంది. వంట్లో ఉండే చెడు దోషాలు పోతాయి. ఆరోగ్యానికి దోహదపడే గుణాలెన్నో మామిడిలో ఉన్నాయి. వాటి రంగు, రూపం, ఆకారం చూడముచ్చటగా ఉంటాయి. పండ్లలో ఎన్ని రుచులున్నా.. మామిడి పండ్ల రుచే వేరయా…ఏదైనా ఎవ్వరైనా వావ్‌ అనాల్సిందే. వేసవికాలం వచ్చిందంటే మామిడిపండ్లతో మజా చేసే రోజులు వచ్చినట్లే.. అందుకే మామిడి పండ్లను ‘సమ్మర్‌ స్పెషల్‌’గా అభివర్ణిస్తారు. అంతేకాదు.. పండ్లలో రారాజు మామిడే. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే మధుర ఫలమిది. పచ్చిది ఉప్పుకారం అద్దుకుని తిన్నా.. పండు రసం జుర్రుకున్నా.. ‘ఆహా ఏమి రుచీ!’ అనకుండా ఉండలేరు. అంత మధురమైన మామిడిపండు గురించే ఈ ప్రత్యేక కథనం..

ఫలాల్లోనే రారాజుగా నిలిచిన మామిడిలో పోషక విలువలూ ఎక్కువే. ఈ పండ్లతో అనేక రకాల వెరైటీ వంటలు కూడా చేయొచ్చు. మామిడి ఒరుగులు చేసుకుని, తినాలనిపించినప్పుడు పప్పులో వేసుకుని వండుకోవచ్చు. ఇక పచ్చళ్లలోనైతే.. మామిడి ముక్కల పచ్చడి, మాగాయ, ఆవకాయ, తొక్కు పచ్చడి, అల్లం వెల్లుల్లి, నువ్వులు, కొబ్బరి, వేసి కూడా పచ్చళ్లు పెడతారు. మరి కొంతమంది మామిడికాయ నిల్వ పచ్చడిలో బెల్లం కూడా వేస్తారు.

ఒక్కొక్కళ్లది ఒక్కో రుచి!
చద్దన్నంలో ఆవకాయ బద్ద, పెరుగన్నంలో మామిడిపండు ముక్కలు వేసుకుని తింటుంటే ఆ మజానే వేరు. ఇక వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ కలిపి ఒక పట్టుపట్టామంటే… ఎలాంటి విందు భోజనమైన దాని ముందు దిగదుడుపే. ఆ రుచి వర్ణించడానికి మాటలు చాలవు. ఇవేనా! మామిడిపండుతో హల్వా, ఐస్‌క్రీములు కూడా తయారుచేస్తారు. ఇక షర్బత్‌లు, జ్యూస్‌ల సంగతైతే సరేసరి. రెడీమేడ్‌గా ఫ్రూటీలు, మాజాలు ఉండనే ఉన్నాయి.

ఎన్నెన్నో రకాలు.. రుచులు..
ఉగాది రోజున పచ్చడిలో పులుపుకు ప్రతీకగా మామిడిని వాడుతూ ఉంటారు. ఇన్ని రకాలుగా ఉపయోగపడి, నోరూరించే మామిడిని ఇష్టపడని వాళ్లుండరు. ప్రపంచ వ్యాప్తంగా వందలాదిగా మామిడి రకాలు ఉన్నాయి. మనదేశంలోనూ ఎన్ని రకాలున్నా బంగినపల్లికి ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఇంకా వీటిల్లో నీలం, రసాలు, చందూరా, రుమానియా, రాజమాను, పంచదార కలశ, కోలంగోవా, అల్పోన్సో, బదామీ, దస్సేరీ, సువర్ణ, రేశ, ఇమాం పసంద్‌, చిలకముక్కు మామిడి, బెంగళూరు మామిడి, మల్గోవ… ఇలా చాలా రకాలున్నాయి. తన రుచితో రాజులను, చక్రవర్తులను సైతం ఆకట్టుకున్న ఘనత ఈ మధురఫలం మామిడిది.


ప్రపంచంలో.. మన మామిడికే గిరాకీ..
ప్రపంచంలోని అనేక దేశాల్లో మామిడిపండ్లు విరివిగా లభిస్తున్నాయి. కొన్ని దేశాల్లో సాగు లేకపోయినా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని, మామిడి పండ్లు తినడం ఆనవాయితీగా మారింది. సమశీతోష్ణ పరిస్థితుల్లో ఎక్కువగా మామిడి తోటలు సాగువుతున్న విషయం తెలిసిందే. మనదేశం, కరేబియన్‌, మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో ఈ పంట ఎక్కువగా సాగవుతోంది. ఏటేటా సీజన్‌ వారీగా లభించే పండ్లలో మామిడికే అగ్ర తాంబూలం. మనదేశంలో పండే మామిడి పండ్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. అందుకే ఏటేటా ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. బంగినపల్లి, కలెక్టర్‌, తీపి మామిడి, సువర్ణరేఖ, నీలాలు, చిన్నరసం, పెద్దరసం, చెరుకురసం పేర్లు వింటేనే నోరూరుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఏటా 25 మిలియన్‌ టన్నుల మామిడి పండ్లు మనదేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఏప్రిల్‌లో ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామం నుంచి మామిడి పండ్లు కెనడా, అమెరికాకు ఎగుమతయ్యాయి. కృష్ణాజిల్లా అయ్యంకిలోని కోసూరి బాలాజీ ఆగ్రో ఫుడ్‌ ప్రయివేటు లిమిటెడ్‌లో ప్యాకహేౌస్‌లో మామిడికాయలు గ్రేడింగ్‌ చేసి, ప్యాకింగ్‌ చేసి పంపిస్తున్నారు. గతేడాది ఈ ప్యాక్‌ హౌస్‌ నుంచి 125 టన్నుల మామిడికాయలు యుకె, కెనడా, సౌదీ అరేబియా, యుఎస్‌ఎ, దుబారుకి ఎగుమతి చేశారు. ఈ ఏడాది 300 టన్నులు మామిడికాయలు నూజివీడు ప్రాంతం నుండి ఎగుమతి చేయబోతున్నాయి. ఈ ప్యాక్‌ హౌస్లో గామా ఇరాడియేషన్‌ జరిపించి, బెంగళూరులోని ఇన్నోవా ప్యాక్‌ హౌస్‌కి పంపిస్తారు. అక్కడి నుంచి బెంగుళూరు ఎయిర్‌పోర్టు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో…
రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత ఏలూరు, ఎన్‌టిఆర్‌ జిల్లా పరిధిలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. నూజివీడు మామిడికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. నూజివీడు మెట్ట ప్రాంతంలో 60 శాతం మంది రైతులు మామిడి పంటను ప్రధాన సాగుగా చేపడుతున్నారు. రాష్ట్రంలో ఏటేటా 30 నుంచి 40 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అంచనా. నూజివీడు ప్రాంతంలో పండే చిన్న, పెద్ద రసాలతో పాటు హిమాయతీలకు బాగా గిరాకీ ఉంది. ఈ ప్రాంతంలో రసాలతో పాటు బంగినపల్లి, ముంత మామిడి, తోతాపురి ఇతర జాతులు బాగా సాగవుతాయి.

ప్రతిఏటా ఢిల్లీలో ఫెస్టివల్‌..
ఏటా అంతర్జాతీయ మ్యాంగో ఫెస్టివల్‌ ఢిల్లీలో నిర్వహిస్తుండటం ఆనవాయితీగా కొనసాగుతోంది. దేశంలో పండే దాదాపు 50కి పైగా రకాల మామిడిపండ్లను అక్కడ ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఇలాంటి ఫెస్టివల్స్‌ దేశమంతా విరివిగా జరుగుతున్నాయి. గత నాలుగైదేళ్లుగా హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం లాంటి ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఏటా జులై 2న అంతర్జాతీయ మామిడి దినోత్సవాన్ని సైతం నిర్వహిస్తున్నారు.


ఇక్కడ నుంచే..
మనదేశ నాగరికత ప్రారంభం నుంచే భారతీయులకు మామిడిపండ్లతో సంబంధం ఉంది. ప్రపంచంలో ఈ పండ్ల తోటను మొదటిగా సాగు చేసింది ఇండియానే. 5000 ఏళ్లుగా మనం మామిడి చెట్లను పెంచుతున్నాం. ఇక్కడి నుంచే ఈ మొక్కలు ఆగేయ ఆసియా దేశాలకు వెళ్లాయి. క్రీ.పూ 5, 4 శతాబ్దాల్లో అక్కడా ఈ పంటలను సాగు చేశారు. భారత్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌ జాతీయ పండు మామిడిపండు. బంగ్లాదేశ్‌ జాతీయ చెట్టు మామిడి. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా మామిడిని అందిస్తూ అగ్రస్థానంలో ఉంది మనదేశమే. తర్వాతి స్థానంలో చైనా ఉంది. మామిడి పండ్లు కూడా జీడిపప్పు, పిస్తా జాతికి చెందినవే. మనకు రోజువారీ అవసరమయ్యే సి విటమిన్‌ మామిడి పండ్ల నుంచి వంద శాతం పొందొచ్చు. మనదేశంలో ఎవరికైనా బుట్ట మామిడిపండ్లు ఇస్తే.. వారితో మనం స్నేహాన్ని కోరుకుంటున్నామని అర్థం. మామిడి చెట్లు 100 అడుగుల ఎత్తువరకూ పెరగగలవు.


నూజివీడు రసాలు ప్రత్యేకం..
నూజివీడులో పండే చిన్న, పెద్ద రసాలకు దేశంలోని వివిధ ప్రాంతాలే కాకుండా.. విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. ఏప్రిల్‌ నుండి జూన్‌ మాసాంతం వరకు మామిడి కాయలు అందుబాటులో ఉంటాయి. నూజివీడు ప్రాంతంలో రసాలతో పాటు బంగినపల్లి, ముంత మామిడి ఎక్కువగా లభిస్తుంటాయి. నూజివీడు పట్టణ పరిసర ప్రాంతాల్లో మ్యాంగో పల్ప్‌, మ్యాంగో జ్యూస్‌ ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయంగా నూజివీడు మామిడికి డిమాండ్‌ ఉండడంతో ఏటా 40 వేల టన్నుల మామిడి ఢిల్లీ, నాగ్‌పూర్‌, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. మామిడి ఎగుమతుల ద్వారా రైల్వే శాఖకు ప్రతి ఏటా కోట్ల రూపాయల్లో రవాణా ఛార్జీల రూపంలో ఆదాయం సమకూరుతుంది.

పరిశోధనలు..
ప్రకృతి వైపరీత్యాలు.. తుపాన్లు.. చీడపీడలు, సాగునీటి సౌకర్యాలు, మార్కెట్లో ధరలు వంటి కారణాలతో మామిడి సాగు ఏటా తగ్గిపోతోంది. ఈ క్రమంలో ఏలూరుజిల్లా నూజివీడులోని డాక్టర్‌ వైఎస్సార్‌ హెచ్‌యు ఆధ్వర్యంలోని మామిడి పరిశోధనా స్థానం ఏటా తన పరిశోధనా పరిధిని విస్తృతి చేసుకుంటూ రైతులకు మామిడి పంటను కాపాడుకునే సస్యరక్షణ చర్యలను తెలియజేస్తోంది. విజయవాడ రూరల్‌ మండలంలో నున్నలోని మామిడి మార్కెట్‌ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడి నుంచి ఈ సీజన్‌లో ప్రతిరోజూ దేశ, విదేశాలకు మామిడి ఎగుమతులు జరుగుతున్నాయి.

ఆరోగ్యానికి మేలు
ఇది మామిడి పళ్ల సీజన్‌. వేసవిలో వచ్చే వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే మామిడి తినాల్సిందే. ఇది పోషకాహార నిపుణులు చెబుతున్న మాట. చక్కెరలు అధికంగా ఉండే మామిడి పండుకు రుచిలో తిరుగేలేనప్పటికీ డయాబెటిస్‌ వ్యాధిగ్రస్థులు మామిడిపండ్ల విషయంలో కాస్తంత అలర్ట్‌గా ఉండాలి.
మామిడి పళ్లలో బీటాకెరోటీన్‌, ల్యూటీన్‌, జియాజాంథీన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో చక్కెరలు కూడా అధికమే. రకరకాల విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌తో పాటు, విటమిన్‌ సి అధికం. ఫలితంగా మామిడికాయల్లో ఆమ్ల గుణం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్‌, గుండెసంబంధిత సమస్యలను దరి చేయనీయవు. ఇంకెందుకు ఆలస్యం ఇంత మేలు చేసే మామిడి పండ్లను ఆస్వాదిస్తూ.. ఆరగిద్దాం.

 

డాక్టర్‌ బొర్రా కనకమహాలక్ష్మి,
నూజివీడు మామిడి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త,
డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ,
ఏలూరు జిల్లా. నెం: 99489 77535

సేకరణ : యడవల్లి శ్రీనివాసరావు

➡️