ఎవరు చెప్పారమ్మ..?

Jun 16,2024 11:34 #kavithalu, #Sneha

ఎవరు చెప్పారమ్మ
ఈ పాపకు?
దినచర్యలను
తేపతేపకు!
ఎంత ఆత్రమ్మో
ఈ పాపకు
వేవేగ తను నిద్ర
లేవాలని!
కాలకృత్యాల్‌
పూర్తి కావాలని
పుస్తకాలను
సర్ది ఉంచాలని!
వెనువెంటనే
బడికి వెళ్ళాలని
తోటి పిల్లల తోటి
త్రుళ్లాలని!
పెరటిలో
మొక్కలను పెంచాలని
ప్రాణవాయువు
ప్రజలకు పంచాలని!
శ్రద్ధగా బుద్ధిగా
చదవాలని
ఎంతెంతో ఎత్తులకు
ఎదగాలని!
మంచినే సదా
ప్రేమించాలని
మంచితో పరుల
మెప్పించాలని!
తెలివితో యుక్తితో
గెలవాలని
గురువులను
భక్తితో కొలవాలని!
తల్లిదండ్రులు
నిత్య దైవాలని
బంధుమిత్రులు
సత్య బంధాలని!
విజ్ఞాన సంపదను
వెతకాలని
బంగారు పాపలా
బతకాలని!

అలపర్తి వెంకట సుబ్బారావు
9440805001

➡️