Census : జనగణనపై కేంద్రం మీనమేషాలు !

Jul 2,2024 15:44 #Census

పాలనా సరిహద్దులపై ప్రకటించని వైనం

న్యూఢిల్లీ : జనగణన (సెన్సస్‌)పై కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దేశాభివృద్ధికి జనగణన చాలా కీలకం. అందుకే ప్రతిపక్షాలు సైతం జనగణన నిర్వహించాలని ఏళ్లతరబడి పట్టుబడుతున్నాయి. బీహార్‌లో ఆర్‌జెడి పార్టీతోపాటు ఎన్‌డిఎ కూటమిలోని భాగస్వామ్య పార్టీగా ఉన్న జెడియు పార్టీ కూడా కులగణన చేపట్టాలని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. అన్ని పార్టీలు జనగణన చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
జనగణనకు ఎంతో కీలకమైన జిల్లాలు, తాలూకాలు, మున్సిపల్‌, పట్టణాల పరిపాలనా సరిహద్దుల గడువు 2024 జూన్‌ 30తో ముగిసింది. అయితే ఇప్పటివరకు జనగణన ఏ తేదీలోగా పూర్తి చేయాలో కేంద్ర ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఒక ప్రభుత్వ సీనియర్‌ అధికారి మీడియాతో చెప్పారు.
కాగా, యుపిఎ ప్రభుత్వ హయాంలో 2011లో జనగణన జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తొమ్మిదిసార్లు గడువును పొడిగించాయి. మళ్లీ పదేళ్లకు అంటే ఈ జనగణన 2021లో జరగాలి. కానీ కోవిడ్‌ వల్ల జనగణన నిర్వహించడం సాధ్యంకాలేదని మోడీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో జనగణన సరిహద్దు గడువు పొడిగించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ తేదీని పొడిగించే అవకాశం లేకపోతే దానికి సంబంధించిన కసరత్తుకు మూడు నుంచి ఆరునెలలు సమయం పట్టే అవకాశం ఉందని మాజీ జనగణన అధికారి ఒకరు తెలిపారు.
గతేడాది (2023) డిసెంబర్‌ 30వ తేదీన రాష్ట్ర పరిపాలనా సరిహద్దుల గడువును 2024 జూన్‌ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జనగణన కోసం యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకు కనీసం మూడు నెలల సమయం తీసుకున్నా… అక్టోబర్‌ 1 నుండైనా ఈ ప్రక్రియ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.

జనగణన పూర్తైతేనే.. మహిళారిజర్వేషన్‌ బిల్లు అమలు
గతేడాది మోడీ ప్రభుత్వం చట్టసభల్లో 33 శాతం మహిళల రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించింది. ‘నారీశక్తి వందన్‌ అధినియమ్‌’ పేరుతో ఆమోదించిన ఈ బిల్లు కూడా జనగణన లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ చేపట్టిన తర్వాతే అమల్లోకి రానుంది. ఈ లెక్కన చూస్తే ఈ బిల్లు అమలయ్యేటప్పటికి వచ్చే లోక్‌సభ ఎన్నికలే కాదు.. మరికొన్ని సంవత్సరాలు పట్టే అవకాశముందని, ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడే ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు మోడీ ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఇక లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల తర్వాత జనగణన, సీట్ల పునర్విభజన నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు నెలరోజులు కావొస్తున్నా… ఇప్పటివరకూ ఆయన ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ‘జనగణన ప్రక్రియ సిద్ధం చేయడానికి రాష్ట్రాలకు 5-6 నెలల సమయం పడుతుంది. ఇది డిజిటల్‌ సెన్సస్‌. అందుకుతగ్గట్టుగా అధికారులకు శిక్షణను కొత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. పరిపాలనా సరిహద్దుల గడువు తేదీలు పొడిగించకపోతే జనగణన మొదటి దశ 2025లో చేయవచ్చని పైన పేర్కొన్న మాజీ జనగణన అధికారి తెలిపారు.

➡️