దగాపడ్డ కౌలు రైతు

Apr 5,2024 04:40 #AAP Government, #Koulu Rythu

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : విభజిత ఆంధ్రప్రదేశ్‌ను పదేళ్లపాటు ఏలిన టిడిపి, వైసిపి ప్రభుత్వాలు వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు తీరని వ్యధ మిగిల్చాయి. కేంద్ర బిజెపి సర్కారు కౌలు రైతులను అసలు లెక్కలోకే తీసుకోలేదు. కౌల్దార్లకు ఎంతో మేలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న టిడిపి, వైసిపి వారికి మోసం చేశాయి. విభజిత ఎ.పి. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇక్కడ మెజార్టీ ప్రాంతాల్లో సేద్యం కౌల్దార్లతోనే సాగుతోంది. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 70-80 శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. అనంతపురం, కర్నూలు వంటి రాయలసీమ జిల్లాలకు కౌలు సాగు పెనవేసుకుంటోంది. వరి, వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, తోటలకూ కౌలు సాగు విస్తరించింది. ఎ.పి. వ్యాప్తంగా 30 లక్షల వరకు ఉన్న కౌలు రైతులకు ఎవరు అధికారంలో ఉన్నా అన్యాయమే జరిగింది. బ్యాంక్‌ రుణాలు, ప్రభుత్వ పథకాలు, చివరికి పండించిన పంటలూ అమ్ముకోలేని దుస్థితి కౌలు రైతులది. రైతు ఆత్మహత్యల్లో కౌలు రైతులవే అధికం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కౌలు రైతుల సమస్యలు ప్రధానంగా ఎజెండా మీదికొచ్చాయి. రాజకీయ పార్టీలు తమ డిమాండ్లను వారి వారి మేనిఫెస్టోల్లో పెట్టి అమలు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు. తమ పాలనలో కౌలు రైతులకు చేసిన అన్యాయంపై సమాధానం చెప్పి ఓట్లు అడగాలని నిలదీస్తున్నారు.

సమాంతర కార్డులు
కౌలు రైతులు ప్రధానంగా అడుగుతున్నది పంటలేసుకోడానికి బ్యాంక్‌ రుణాలు. గతంలో జయతీఘోష్‌ కమిషన్‌ కౌలు రైతులకు సంస్థాగత పరపతి సౌకర్యం కల్పించాలని ప్రముఖంగా సిఫారసు చేసింది. స్వామినాథన్‌ కూడా అదే చెప్పారు. కౌలు రైతుల పోరాట ఫలితంగా 2011లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు రుణ అర్హత కార్డుల (ఎల్‌ఇసి) చట్టం తెచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఎల్‌ఇసి కార్డుల జారీ కొనసాగినప్పటికీ బ్యాంకుల నుంచి రుణాలిప్పించడంలో టిడిపి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 30 లక్షల మంది కౌలు రైతులున్నారని టిడిపి సర్కారు వేసిన రాధాకృష్ణ కమిటీ రిపోర్టు ఇచ్చింది. టిడిపి సర్కారు ఎల్‌ఇసి కార్డులను నిర్వీర్యం చేసి, సాగు దారు సర్టిఫికెట్లను (సిఒసి) సమాంతరంగా మొదలు పెట్టింది. ఎల్‌ఇసి, సిఒసి రెండూ కలుపుకొని ఆ ఐదేళ్లల్లో గరిష్టంగా 2018-19లో 2.80 లక్షల మందికి రూ.2,335 కోట్ల రుణాలిప్పించింది. లక్షలాదిగా కౌలు రైతులుండగా ఏటికేడు ఇచ్చింది బహుస్వల్పం. వార్షిక రుణ ప్రణాళికలో పేర్కొన్న పంట రుణాల్లో పది శాతం కౌలు రైతులకు ఇవ్వాలనుకున్నా దరిదాపుల్లో ఆచరణ లేదు. ఇక రుణ మాఫీ తొలుత కౌలు రైతులకు ఇవ్వమ న్నారు. పోరాటాల ఫలితంగా సుమారు రూ.345 కోట్ల బకాయిలున్నట్లు గుర్తించి వాటిలో రూ.200 కోట్ల వరకు పలు దశల్లో మాఫీ చేశారు. 2019 ఎన్నికల ముందు ‘అన్నదాత సుఖీభవ’ పేరిట ప్రకటించిన పథకంలో కౌలు రైతులకు తొలి కిస్తు ఇవ్వలేదు. ఎన్నికల తర్వాత ఇస్తామని జీఓలో పేర్కొన్నారు.

సిసిఆర్‌సి దారుణం
వైసిపి ప్రభుత్వం కౌలు రైతుల ఉసురు పోసుకుంది. ఎల్‌ఇసి, సిఒసిలను రద్దు చేసి పంట సాగుదారు హక్కు కార్డు (సిసిఆర్‌సి)లను ప్రత్యేక చట్టం తెచ్చి ప్రవేశపెట్టింది. అప్పటి వరకు భూమి యజమానుల రాతపూర్వక అనుమతి లేకుండా గుర్తింపు కార్డులిచ్చారు. కొత్త చట్టంలో ఓనర్ల సంతకం తప్పనిసరి చేశారు. దాంతో కార్డుల జారీ తగ్గిపోయింది. ఆ మేరకు బ్యాంక్‌ రుణాల మంజూరూ పడిపోయింది. ఈ ఐదేళ్లలో ఈ ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2.29 లక్షల మందికి (జనవరి వరకు) రూ.1,020 కోట్ల రుణాలిచ్చారు. ఆర్‌ఎంజి, జెఎల్‌జెలకు రుణాలిచ్చామంటున్నా అవేమీ కౌలు రైతులకే పరిమితం కాదు. ఇక రైతు భరోసా విషయానికొస్తే 15 లక్షల మందికి ఇస్తామని తొలుత అసెంబ్లీలో ప్రకటించారు. అనంతరం భూమి లేని వారికేనన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకేనని మెలిక పెట్టారు. ఐదేళ్లలో ఏ సంవత్సరంలోనూ లక్ష మంది కౌలు రైతులకు భరోసా దక్కడం గగనమైంది. విపత్తు బాధితులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా, సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, చివరికి పంటలు అమ్ముకొనే దగ్గరా ఇ-క్రాప్‌ అనడంతో సరైన రికార్డులు, గుర్తింపు లేక కౌలు రైతులు దారుణంగా నష్టపోయారు.

➡️