‘ఆడుదాం ఆంధ్రా’కు ఆటస్థలాలేవీ ?

Dec 11,2023 10:44 #details, #playgrounds
  • 5,951 సచివాలయాల్లో ఇదే పరిస్థితి
  • ఉన్న వాటిల్లోనూ పాఠశాలలే గతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’కు అవసరమైన ఆట స్థలాలు అందుబాట్లో లేకపోవడం, 50 రోజుల్లోనే హడావుడిగా దాదాపు మూడు లక్షల మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించడం విమర్శలకు దారితీస్తోంది. నాలుగున్నరేళ్ల నుంచి క్రీడలను పట్టించుకోకుండా ఎన్నికల ముందు 50 రోజుల్లోనే నిర్వహించాలని నిర్ణయించడం ఎన్నికల స్టంట్‌లో భాగమేననే అభిప్రాయం కలుగుతోంది. ఈ కార్యక్రమానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ కనీసం ఆడేందుకు ఆట స్థలాలు లేని పరిస్థితి నెలకొంది. ఎపి క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో ఆటల పోటీలను ప్రభుత్వం నిర్వహించనుంది. 37,14,062 మంది క్రీడాకారులు శనివారం నాటికి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 23,553,53 మంది పురుషులు, 13,57,822 మహిళలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలు ఉన్నాయి. ఈ క్రీడలను నిర్వహించేందుకు ఆట స్థలాలు లేవు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశం ఇప్పటివరకు రాకపోవడంతో అధికారులు కూడా ఆట స్థలాలపై దృష్టి సారించని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు హడావుడిగా ఆడుదాం ఆంధ్రా రావడంతో అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నాయో వెతికే పనిలో పడ్డారు. వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ ఆటలకు 10 సెంట్ల స్థలం ఉన్నా ఆడించొచ్చు. క్రికెట్‌కు స్థలం ఎక్కువగా కావాలి. 15,004 సచివాలయాల్లో 9,053 వాటిల్లోనే క్రికెట్‌ ఆడేందుకు స్థలాలు ఉన్నట్లు శాప్‌ గుర్తించింది. 5,951 సచివాలయాల్లో లేవు. గుర్తించిన వాటిల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో ఆటస్థలాలు ఎక్కువగా ఉన్నాయి. ఖాళీ స్థలాలు లేని సచివాలయాల్లో క్రికెట్‌ ఎలా ఆడించాలోనని గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు తర్జనభర్జన పడుతున్నారు. గ్రామ స్థాయి తరువాత మండల, నియోజకవర్గ స్థాయిలో ఆడించేందుకు విద్యాసంస్థల స్థలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

జిల్లా కేంద్రాల్లోనూ కొరతే..

ఆటస్థలాల కొరత జిల్లా కేంద్రాల్లోనూ వెంటాడుతోంది. ఉన్నవి శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకోవడం లేదు. గతంలో విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం, గుంటూరులో బ్రహ్మానంద రెడ్డి స్టేడియాల్లో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పుడు వీటి నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఇందిరా గాంధీ స్టేడియాన్ని రాజకీయ, ప్రచార సభలకే ఉపయోగిస్తున్నారు. ఇటీవల కోట్ల రూపాయలతో స్టేడియంలో యజ్ఞం చేయించిన రాష్ట్ర ప్రభుత్వానికి దీనిని అభివృద్ధి చేయాలనే ఆలోచన రాలేదు. చిన్నపాటి వర్షం వస్తే రోజుల తరబడి నీరు ఉండటంతో బ్రహ్మానంద స్టేడియం వైపు క్రీడాకారులు వెళ్లడం లేదు. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ, మున్సిపల్‌ పరిధిలో ఉన్న వాటిల్లో క్రీడా వికాస కేంద్రాలను గత ప్రభుత్వం ప్రారంభించింది. వీటి నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించి, క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలని సలహా ఇచ్చింది. కొంత ఆర్థిక స్తోమత ఉన్న క్రీడాకారులు డబ్బులు చెల్లించి ఆడుతున్నారు. పేదలు మాత్రం డబ్బులు చెల్లించలేక ఆటలకు దూరమవుతున్నారు.

ఒక పక్క ఆట.. మరో పక్క పాఠం

శాప్‌ క్రికెట్‌కు గుర్తించిన స్థలాల్లో సుమారు ఐదు వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఉన్నవే ఉన్నాయి. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు వరుసగా మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ఒక పక్క విద్యార్థులు పాఠాలు వింటుంటే, మరోపక్క సచివాలయ సిబ్బంది ఆటలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ గందరగోళం మధ్యలో విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.

50 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు సాధ్యమేనా ?

గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 2.99 లక్షల మ్యాచ్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఇన్ని మ్యాచ్‌లను 50 రోజుల్లోనే నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న క్రీడాకారుల్లో నెలకొంది. ఈ నెల 15 నుంచి 15,004 గ్రామ, వార్డుల్లో 6 రోజుల్లో 1.5 లక్షల మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంది. వీటిల్లో గెలుపొందిన జట్లకు మండల స్థాయిలో 15 రోజుల్లో 1.42 లక్షల మ్యాచ్‌లను 680 మండలాల్లో నిర్వహించాలి. మండల స్థాయిలో గెలుపొందిన జట్లకు ఆరు రోజుల్లో 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లను జరపాలి. జిల్లా స్థాయికి అర్హత సాధించిన జట్లకు 10 రోజుల్లో 26 జిల్లాల్లో 312 మ్యాచ్‌లు నిర్వహించాలి. రాష్ట్రస్థాయికి వచ్చిన జట్లకు 250 మ్యాచ్‌లను 6 రోజుల్లో నిర్వహించాలి.

వలంటీర్లే అంపైర్లు !

ఎంపిక చేసిన ఆటల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం వలంటీర్లకు అప్పగించింది. కేవలం 10 రోజులు ఆన్‌లైన్‌ శిక్షణ వీరికి ఇచ్చి తూతూ మంత్రంగా నిర్వహిస్తుందనే అభిప్రాయం క్రీడాకారుల్లో నెలకొంది. వీరితోనే గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయి వరకు నిర్వహించనుంది. రాష్ట్రంలో యుజిడి, ఎంపిఇడి, బిపిఇడి వంటి వ్యాయామ విద్య అభ్యసించిన నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారు. శాప్‌లో సుమారు వెయ్యి కోచ్‌ పోస్టులకు కేవలం 150 మంది మాత్రమే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారు. ఇవి కాకుండా ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వేల పిఇటి పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.

17.10 లక్షల క్రీడా దుస్తులు

గ్రామ స్థాయిల్లో గెలుపొందిన జట్లకు క్రీడా దుస్తులను అందజేస్తారు. బ్యాడ్మింటన్‌ జట్టుకు రెండు, క్రికెట్‌కు 16, ఖోఖోకు 15, కబడ్డీకి 15, వాలీబాల్‌కు 12 చొప్పున గెలుపొందిన పురుషులు, మహిళా జట్లకు 114 డ్రెస్సులు అందిస్తారు. 15,004 సచివాలయాల్లో 114 చొప్పున 17,10,456 డ్రెస్సులను ప్రభుత్వం అందించనుంది. గ్రామస్థాయిలో ఇచ్చిన దుస్తులతో జిల్లా స్థాయి వరకు ఆడతారు. జిల్లా స్థాయిలోకి వచ్చిన జట్లకు పూర్తిస్థాయి దుస్తులు అందజేస్తారు.

➡️