బిజెపి మళ్లీ నయవంచన !

Dec 13,2023 10:44 #again, #BJP, #hypocrisy
  • రైల్వే జోన్‌పై 2014 నుంచీ ఇదే కాలయాపన
  • ‘న్యూ ఇయర్‌ 2024’లో ప్రధాని మోడీ వస్తారంటూ మరో వాయిదా !

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు మళ్లీ బ్రేక్‌ పడింది. బిజెపి సర్కారు ఒక మోసంపై మరో మోసానికి పాల్పడుతూ 2014 నుంచీ విశాఖకు ద్రోహాన్ని తలపెడుతోంది. ఎనిమిదేళ్లుగా పూటకో మాట, రోజుకో ప్రకటనతో ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు జల్లుతోంది. రైల్వే జోన్‌పై కేంద్రం నాటకాలపై ప్రధాన రాజకీయ పార్టీలు వైసిపి, టిడిపి, జనసేన పార్టీ ప్రశ్నించకపోవడంపై ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకంలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. రైల్వే జోన్‌పై రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తాజాగా వివరణ ఇస్తూ 2024 కొత్త సంవత్సరంలో దేశ ప్రధాన మంత్రి సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు పునాదిరాయి వేస్తారంటూ మరోసారి ఊరించారు. మరోపక్క విశాఖలోనే తిష్టవేసి కూర్చొన్న బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్‌ నరసింహారావు… రైల్వే జోన్‌ నిర్మాణం జరిగిపోతుందంటూ కపట ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టిన కేంద్రాన్ని కాపాడేందుకు ఆర్‌ఐఎన్‌ఎల్‌ నష్టాలకు గత ప్రభుత్వాలే కారణమని, ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను కేంద్రం ఆపేసిందని, రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఎంతో దూరం లేదని మంగళవారం రాజ్యసభలో ప్రకటించడం ఈ ప్రాంత ప్రజలు, కార్మికవర్గంలో ఆగ్రహాన్ని పెంచుతోంది.

రైల్వే మంత్రి విశాఖ పర్యటనలోనూ ఇదే మాట !

ఈ నెల తొమ్మిదిన విశాఖ జిల్లాలోని సింహాచలం రైల్వే స్టేషన్‌ పర్యటనకు విచ్చేసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ, ‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి రైల్వేకు అప్పగింత జరగనందున కొత్త సంవత్సరంలో మరలా ప్రధాన మంత్రి మోడీ వచ్చి రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తారు’ అని ప్రకటించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎపి విభజన హామీల్లో అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకు నూతన రైల్వే జోన్‌ వంటి అన్నింటినీ తుంగలో తొక్కుతూ హామీలకు తూట్లు పొడుస్తోంది బిజెపి. ఎపికి ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పునర్విభజన చట్టం సెక్షన్‌ 93, షెడ్యూల్‌ (3)లో పేర్కొన్నా, 2016 సంవత్సరం నుంచీ నాన్చుతూనే ఉంది. 2019లో ఎన్నికలకు ముందు విశాఖ నగరంలో బిజెపి ర్యాలీ, సభకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ విశాఖలో ప్రారంభిస్తానని ప్రకటించి ఈ ప్రాంత ప్రజలు, రైల్వే ఉన్నతాధికారులు, ఉద్యోగుల్లో ఆశలు రేపాయి. కానీ, కేంద్ర సర్కారు నయవంచన ఎంతకాలం? అంటూ తాజాగా వీరు ప్రశ్నిస్తున్నారు.

దిక్కూ మొక్కూలేని డిపిఆర్‌… రైల్వే జోన్‌ ఊసే ఎత్తని ప్రధాని

2020లో కేంద్ర రైల్వే బోర్డుకు పంపిన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌) రూ.10 కోట్లు ఇంతవరకూ ఆమోదం పొందలేదని వాల్తేరు రైల్వే డిఆర్‌ఎం కార్యాలయ ఉన్నతాధికారులు ఏకోన్ముఖంగా చెబుతున్నారు. గత ఏడాది నవంబర్‌ 11న విశాఖలో ప్రధాన మంత్రి మోడీ పర్యటనను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, విశాఖలోని జివిఎల్‌ సహా అందరూ బిజెపి నేతలూ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారంటూ ప్రచారం ఊదరగొట్టారు. ఆచరణలో ఇది కూడా తుస్సుమంది. ప్రధాని కనీసం రైల్వే జోన్‌ ఊసెత్తకపోవడం ఆ సందర్భంగా రైల్వే వర్గాలు, విశాఖ ప్రజల్లో చర్చనీయాంశమైంది.

న్యూజోన్‌ కోసం లే-అవుట్‌ కూడా సిద్ధం కాలేదు

రైల్వే డిఆర్‌ఎం కార్యాలయంలో 15 ఎకరాల స్థలం భవనాల కోసం సిద్ధంగా ఉన్నా భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటూ రైల్వే మంత్రి, రాజ్యసభ సభ్యులు జివిఎల్‌ వంటి వారు అబద్దాలను తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి గతంలో రైల్వే భూమి బస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (బిఆర్‌టిఎస్‌) కోసం 2015లో 52.2 ఎకరాలను ముడసర్లోవలో రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. దీంట్లో పది ఎకరాలు మాత్రమే వివాదంలో ఉంది. వివాద రహిత భూమిలో జోన్‌ పనులకు ఆటంకం ఏమిటి? అంటూ రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు వాపోతున్నారు.

భూమికి భవనాలకు లింకేమిటి : సిపిఎం

కేంద్రంలోని బిజెపికి చిత్తశుద్ధి ఉంటే స్థలం లేదంటూ రైల్వే జోన్‌ నిర్మాణ పనులను ఆపేయడం సరికాదని, జోన్‌ పనుల ప్రారంభించడానికి, స్థలాలకు అనవసర లింకులు పెట్టి ఉత్తరాంధ్ర ప్రజలను బిజెపి మోసగిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ నెల పదిన విశాఖ విచ్చేసిన సందర్భంగా ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానెల్స్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు.

➡️