కానరాని ‘నారీ శక్తి’

Apr 23,2024 03:19 #Nari Shakti, #PM Modi
  •  మోడీ పాలనలో పెరిగిన లింగ అసమానతలు
  • పేద గర్భిణులకు లభించని ఆరోగ్య సేవలు
  • పాఠశాల విద్యకు బాలికలు దూరం
  • ఉపాధి అవకాశాలూ అంతంతే
  • పెరుగుతున్న నేరాలు

న్యూఢిల్లీ : దేశ జనాభాలో యాభై శాతంగా ఉన్న మహిళలు ఇంటి పనికే పరిమితమైతే విజయాలు ఎలా సాధించగలమని గత సంవత్సరం మార్చిలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. పోయిన ఏడాది మన దేశంలో జరిగిన జి-20 సదస్సులో కూడా ‘మహిళల నేతృత్వంలో అభివృది’్ధ పైన చర్చ జరిగింది. అయితే పాలకుల మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. 2022లో విడుదలైన లింగ అసమానతల సూచికలో 193 దేశాల్లో భారత్‌ 108వ స్థానంలో నిలిచింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహిళలు, బాలికల పరిస్థితిని ‘న్యూస్‌లాండ్రీ’ పోర్టల్‌ అధ్యయనం చేసింది. గర్భిణులైన పేద మహిళల ఆరోగ్య పరిరక్షణపై పాలకులు ఏ మాత్రం శ్రద్ధ వహించడం లేదు. పేద కుటుంబాల్లో జన్మించిన బాలికలు సెకండరీ స్థాయిని దాటి చదువుకోవడం లేదు. డ్రాపవుట్ల సంఖ్య తగ్గుతున్నప్పటికీ 16-18 సంవత్సరాల మధ్య వయసున్న బాలికల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఇప్పటికీ పాఠశాల విద్యకు నోచుకోవడం లేదు. ఇక ప్రతి ఐదుగురు మహిళల్లో ముగ్గురికి ఉపాధి లేదు. మహిళలపై నేరాల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

ఆరోగ్య సేవలకు దూరంగా…
2005-06, 2019-20 మధ్య కాలంలో గర్భిణుల ఆరోగ్య సేవలు మెరుగుపడిన మాట వాస్తవం. పేద మహిళలకు ఈ సేవలు సరిగా అందడం లేదు. ప్రతి నలుగురు పేద మహిళల్లో ఒకరు ఆరోగ్య కేంద్రంలో పురుడు పోసుకోవడం లేదు. వారిలో చాలా మందికి ఇప్పటికీ ఇంటి వద్దే కాన్పు జరుగుతోంది. పేదలైన గర్భిణుల్లో 42% మంది మాత్రమే వైద్య పరీక్షల నిమిత్తం నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఆస్పత్రులకు వెళుతున్నారు. ధనికుల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటోంది. సంపన్న మహిళలు తరచూ ఆస్పత్రుల్లో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ, అక్కడే శిశువుకు జన్మనిస్తున్నారు.

పడిపోతున్న లింగ నిష్పత్తి
2014-2020 మధ్యకాలంలో గర్భిణుల మరణాల సంఖ్య తగ్గింది. లక్ష మంది శిశువులకు జన్మనిస్తున్న మహిళల్లో 97 మంది మరణిస్తున్నారు. ఆరు సంవత్సరాల కాలంలో గర్భిణుల మరణాలు పాతిక శాతం మేర తగ్గాయి. కానీ అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న మరణాల నిష్పత్తితో పోలిస్తే ఈ ఆరేళ్లలో మన దేశంలో గర్భిణుల మరణాల్లో మూడు శాతం తగ్గుదల మాత్రమే కన్పిస్తోంది. 2014-15లో ప్రతి వెయ్యి మంది బాలురకు 918 మంది బాలికలు జన్మించగా, 2022 నాటికి ఆ సంఖ్య 934కు పెరిగింది. బీహార్‌, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో 2021-22లో లింగ నిష్పత్తి పడిపోయింది. బీహార్‌లో ప్రతి వెయ్యి మంది బాలురకు అతి తక్కువగా 898 మంది బాలికలు జన్మించారు. హర్యానా (920), ఢిల్లీ, నాగాలాండ్‌ (924), గుజరాత్‌ (927) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మిజోరంలో మాత్రం అత్యధికంగా ప్రతి వెయ్యి మంది బాలురకు 994 మంది బాలికలు జన్మించగా, సిక్కిం (981), కేరళ (968) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అందని ద్రాక్షపండులా విద్య
సెకండరీ, హయ్యర్‌ సెకండరీ స్థాయి విద్యలో బాలికల ప్రవేశాలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ 2021-22లో 14-16 సంవత్సరాల మధ్య వయసున్న బాలికల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు పాఠశాలలో చేరలేదు. 16-18 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ప్రతి ఐదుగురిలో ఇద్దరు పాఠశాల విద్యకు నోచుకోలేదు.

నేరాలు-ఘోరాలు…
జాతీయ నేర రికార్డుల బ్యూరో సమాచారం ప్రకారం 2015 నుండి మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. 2012లో దేశ రాజధానిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన (నిర్భయ కేసు) తర్వాత మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు పెరిగాయి. నిందితుల అరెస్టులు, వారికి విధించిన శిక్షలు దుండగులపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. 2015లో ప్రతి లక్ష మంది మహిళల్లో 53.9 మందిపై నేరాలు జరగ్గా 2022 నాటికి ఆ రేటు 66.4కు పెరిగింది. ముఖ్యంగా తగిన వయసు రాకుండానే వివాహాలు చేసుకున్న బాలికలపై ఇలాంటి దాష్టీకాలు, అకృత్యాలు ఎక్కువగా జరిగాయి. మహిళలపై లైంగిక దాడుల కారణంగా వారికి ఉద్యోగాలు కల్పించేందుకు యాజమాన్యాలు విముఖత ప్రదర్శిస్తున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఉద్యోగాలు అంతంత మాత్రమే
దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్యలో ఏ మాత్రం పెరుగుదల కన్పించడం లేదు. మహిళల్లో కేవలం 37% మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే దీనర్థం ప్రతి ఐదుగురిలో ముగ్గురి కంటే ఎక్కువ మంది పని చేయకపోవడమో లేదా పని కోసం వెతక్కపోవడమో జరుగుతోంది. 2017-18లో మహిళల్లో 23.3% మంది మాత్రమే ఉద్యోగులు. 2022-23 నాటికి అది 37%కి పెరిగింది. మహిళల్లో నిరుద్యోగ రేటు తగ్గుతున్నప్పటికీ అది ఆశించిన స్థాయిలో లేదు.

➡️