పంటల బీమాకు కేంద్రం గండి

Feb 19,2024 10:21
  • ఖరీఫ్‌లో నిధులకు భారీ కోత
  • రాష్ట్రం చెల్లించింది రూ. 860 కోట్లు
  • కేంద్రం విడుదల చేసింది రూ. 250 కోట్లు
  • విపత్తు రైతులకు భారీ నష్టం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్‌లో పంటల బీమా అస్తవ్యస్తంగా తయా రైంది. కేంద్రం తన వాటా ప్రీమియాన్ని బాగా తగ్గించుకుంది. ఫిబ్రవరి మధ్యలోకొచ్చినా తాను చెల్లించాల్సిన వాటాను పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. ప్రీమియం చెల్లింపుల్లో రాష్ట్ర సర్కారు ఆలస్యం కారణంగా కేంద్రం నిధులు విడుదల చేయలేదని తెలుస్తోంది. ఫసల్‌ బీమా (దిగుబడి ఆధారిత)లో రైతుల తరఫున ఎపి ప్రభుత్వం దాదాపు రూ.441 కోట్లు కంపెనీలకు చెల్లించగా, కేంద్రం తన వాటా కింద కేవలం రూ.79 కోట్లే చెల్లించింది. వాతావరణ ఆధారిత బీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.418 కోట్లు చెల్లించగా కేంద్రం రూ.171 కోట్లు చెల్లించింది. మొత్తమ్మీద రెండు పథకాలకూ కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర సర్కారు రూ.860 కోట్లు చెల్లించ గా కేంద్రం మాత్రం రూ.250 కోట్లే చెల్లించింది. ఫసల్‌లో ఎక్కువగా ప్రభుత్వరంగ సంస్థలున్నందున కేంద్రం తక్కువ ప్రీమియం చెల్లించినట్లు కనిపిస్తోంది. వాతావరణ బీమాలో అన్నీ ప్రైవేటు సంస్థలే. ఫసల్‌తో పోల్చితే వాతావరణ బీమాకు కొంచెం ఎక్కువ ప్రీమియం చెల్లించిందని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాట లో విపత్తు రైతులకు బీమాపై ధీమా లేకుండా పోయింది.

గతేడాది కంటే తక్కువ

                  వైసిపి వచ్చాక 2021-22 వరకు కేంద్రంతో, కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమాను అమలు చేసింది. కేంద్రం ఒత్తిడితో 2022 ఖరీఫ్‌ నుంచి తిరిగి కేంద్ర పథకాల్లో చేరింది. ఆ ఏడాది ఫసల్‌లో కంపెనీలను ఆహ్వానించింది. వాతావరణ బీమాను మాత్రం తానే నిర్వహించింది. కేంద్ర పథకంలో చేరాక 2022 ఖరీఫ్‌లో 50 లక్షల ఎకరాలను ఫసల్‌ కిందికి తెచ్చారు. 25 లక్షల మంది రైతులను చేర్చారు. రాష్ట్ర సర్కారు ఉచిత బీమా అమలు చేస్తున్నందున రైతులు తన వంతు చెల్లించాల్సిన ప్రీమియంతో కలిపి రూ.1,212 కోట్లూ తానే చెల్లించింది. కేంద్రం తన వాటా కింద రూ.669 కోట్లు బదిలీ చేసింది. గ్రాస్‌ ప్రీమియం రూ.1,882 కోట్లు. పథకం నిబంధన ఏంటంటే… నిర్ణయించిన మొత్తం ప్రీమియంలో రైతులు తమ వంతు 2 శాతం చెల్లించాలి. తతిమ్మా దాంట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలి. ఆ ప్రకారం రైతుల ప్రీమియం రూ.543 కోట్లవుతుంది. ఆ అమౌంట్‌ను రాష్ట్రం రైతుల తరఫున చెల్లించింది. అది పోగా మిగతా ప్రీమియంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పెట్టుకోవాలి కనుక అందులో రూ.669 కోట్లను రాష్ట్రం, మరో 669 కోట్లు కేంద్రం భరించాయి. 2023 ఖరీఫ్‌ దగ్గకొస్తే రైతుల సంఖ్య 22 లక్షలకు తగ్గింది. ఏరియా 47 లక్షల ఎకరాలకు కుచించుకు పోయింది. రాష్ట్రం 441 కోట్లు చెల్లించగా కేంద్రం కేవలం రూ.79 కోట్లే చెల్లించింది. కాగా రైతుల ప్రీమియం రూ.294 కోట్లుగా చూపారు. రాష్ట్ర వాటా 146 కోట్లుగా చూపెట్టారు. ఆ ప్రకారం చూస్తే మాత్రం కేంద్రం చెల్లించాల్ల్సింది రూ.79 కోట్లే అవుతోంది. రాష్ట్రం నిబంధనలు పాటించనందున ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఫసల్‌ బీమాలో కేంద్ర వాటా కొన్ని జిల్లాల్లో సున్నా. అల్లూరి, అనకాపల్లి, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కృష్ణా, మన్యం, నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయనగరం, పశ్చిమగోదావరిలో కేంద్రం వాటా జీరో. ఆ జిల్లాల్లో రాష్ట్రం రైతుల వాటా, తన వాటా చెల్లించింది.

వెదర్‌ బేస్డ్‌

2023 ఖరీఫ్‌లో వాతావరణ ఆధారిత బీమా కూడా కేంద్ర పరిధిలోకి వెళ్లింది. 21 జిల్లాల్లో అమలైంది. అన్ని జిల్లాలనూ ప్రైవేటు కంపెనీలకే అప్పగించారు. ఏడు లక్షల మంది రైతులను పథకంలో చేర్చారు. ఏరియా 17.15 లక్షల ఎకరాలు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల, తన వాటా కలిపి రూ.418 కోట్లు చెల్లించింది. కేంద్రం 171 కోట్లు మాత్రమే చెల్లించింది. రాష్ట్రం రైతుల తరఫున రూ.209 కోట్లు, అది పోను తన వాటా (50 శాతం) రూ.219 కోట్లు చెల్లించింది. కేంద్రం ఏ లెక్కలో రూ.171 కోట్లు చెల్లించిందో తెలీదు. వాతావరణ బీమాను ప్రైవేటు సంస్థలు అమలు చేస్తున్నందున ఫసల్‌తో పోల్చితే ఈ పథకానికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వచ్చాయని తెలుస్తోంది.

➡️