తెలుగు మీడియా విశ్వసనీయత!

తెలుగునాట మీడియాకు విశ్వసనీయత తగ్గిపోయిందని ఓ పత్రికాధిపతి ఇప్పుడు గుండెలు బాదుకోవడం ఆశ్చర్యకరం. నిజానికి ఈ శతాబ్దపు తొలి దశాబ్దంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు బీజాలు పడగా రాష్ట్ర విభజన అనంతరం అది మరింత వెర్రితలలు వేసింది. రెండక్షరాల పత్రిక వచ్చాక మొదలైన మీడియా విభజన క్రమం ఆ తరువాత మరోవైపున ‘ఆ రెండు పత్రికలు’ అన్న పరిస్థితికి వెళ్లింది. అది ఎలక్ట్రానిక్‌ మీడియాకూ పాకింది. రాజకీయాల్లో ఎలాగైతే రెండు శిబిరాలుగా నిట్టనిలువునా చీలిన పరిస్థితి (బైపోలార్‌ పాలిటిక్స్‌) ఏర్పడిందో (విధాన ప్రాతిపదికన నిలబడే ప్రజాశక్తి వంటివి తప్ప) ప్రధాన మీడియాగా చెప్పబడేవన్నీ అలానే విభజితమయ్యాయి. ఒక పార్టీ కొమ్ము కాయడానికి వాస్తవాలను కప్పిపెట్టడం, అవాస్తవ ఆరోపణలను సైతం పదేపదే ప్రస్తావించడం వాటికి సర్వసాధారణమైపోయింది. చివరికి వాస్తవమేమిటో తెలుసుకోవాలంటే వాటిలో ఏ ఒక్క పత్రికనో చదివితే చాలదు అనే నిర్ధారణకు పాఠకులు వచ్చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే దాన వీర శూర కర్ణ సినిమాలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్‌టి రామారావు గుక్కతిప్పుకోకుండా చెప్పిన ‘ఏమంటివి ఏమంటివి… కురు వంశం ఏనాడో కులవిహీనమైనది’ అన్న ప్రఖ్యాత డైలాగ్‌ గుర్తుకొస్తోంది. తిలా పాపం తలా పిడికెడన్న చందంగా ఈ పరిస్థితి ఏర్పడడానికి ఎవరు ఎంతవరకు కారణమో ప్రధాన మీడియా సంస్థలు, వాటి యాజమాన్యాలూ ఇప్పటికైనా పరిశీలించుకోవడం అవసరం. వారు తమ వైఖరులు సరిదిద్దుకుంటే తెలుగు మీడియాకు తప్పక విశ్వసనీయత పెరుగుతుంది. పాఠకులు, వీక్షకులూ ఆదరించడం తథ్యం!

కార్పొరేట్‌ మీడియా దుర్నీతి…
గుజరాత్‌ అభివృద్ధి మోడల్‌ అనీ, మోడీని ఎంతగానో ప్రస్తుతిస్తూ 2014 ఎన్నికలకు ముందు కార్పొరేట్‌ మీడియా సాగించిన హంగామా ఇంతా అంతా కాదు. అభివృద్ధి ఎజెండా అంటూ వారు ఊదరగొట్టిన తీరు మరువగలమా! అలాగే 2019 ఎన్నికలకు ముందు పుల్వామా ఘటనల ఆధారంగా ఉద్వేగాలు రెచ్చగొట్టడంలో మీడియా పాత్ర తక్కువేమీ కాదు. ముఖ్యంగా పుకార్లు ప్రచారం చేయడంలో సంఫ్‌ు పరివార్‌ వాట్సాప్‌ యూనివర్సిటీ సృష్టించిన అరాచక అసంఖ్యాక పోస్టులు ఎందరి బుర్రలు ఖరాబు చేశాయో! ప్రస్తుత రాజకీయాల్లో కార్పొరేట్‌ మీడియా అదేవిధంగా సోషల్‌ మీడియా పాత్ర, ప్రభావం గణనీయంగానే ఉంటోంది. గత రెండు సాధారణ ఎన్నికల్లో ఈ రెండు మీడియాలు లేకుండా మోడీ అండ్‌ కో గెలుపును ఎవరైనా ఊహించగలరా? ఆంధ్రప్రదేశ్‌లో కూడా వాటి ప్రభావాన్ని తీసి పారేయగలమా! అంతేకాదు.. పాలనా వ్యవహారాలకు సంబంధించి కూడా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి ప్రభుత్వానికి చికాకు తెప్పించినవి కొన్ని కాగా మార్ఫింగ్‌ సైతం చేసి దుష్ప్రచారం గావించినవి అనేకం.

సిపిఎంపై అక్కసు…!
దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేస్తున్న బిజెపిని ఒంటరిపాటు చేసి ఓడించాలనీ, రాష్ట్ర రాజకీయాలు నిట్టనిలువునా చీలిపోయిన నేపథ్యంలో వైసిపి, టిడిపి రెండు శిబిరాలనూ వ్యతిరేకించి వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులతో ప్రత్యామ్నాయ శక్తులను సమీకరించాలని సిపిఎం నిర్ణయించుకుంది. అందుకు తన శక్తికొద్దీ కృషి చేస్తోంది. ఈ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం మధ్య ఎలాంటి విభేదాలు పొడసూపకపోవడమేగాక ఇతర వామపక్ష శక్తులు కూడా సమన్వయంతో పని చేసిన విషయం గుర్తెరగాలి. అదేవిధంగా బిజెపికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ సమితి నేతలు నిర్వహించిన ఉమ్మడి సదస్సులు, చేపట్టిన ప్రచారం ప్రజలపై ముఖ్యంగా లౌకిక ప్రజాస్వామ్య భావాలు కలిగినవారిని ప్రభావితం చేశాయి. గడచిన పదేళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన ప్రజా ఉద్యమాలన్నిటిలోనూ సిపిఎం క్రియాశీలక పాత్ర వహించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల మొదలు అసంఘటిత కార్మికులు, అంగన్‌వాడీ, ఆశా తదితర స్కీమ్‌ వర్కర్ల సమస్యలపై శ్రమజీవులకు వెన్నుదన్నుగా నిలిచింది. సామాన్యుల కోర్కెలను ఎల్లవేళలా ముందుంచింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజి, పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలకడగా ఉద్యమాలు నిర్వహించింది. ఇంకా చెప్పాలంటే గతంలో చంద్రబాబు, ఇటీవలి ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎవరున్నా వారి పర్యటనల సందర్భంగా సిపిఎం కార్యకర్తలు, నాయకులనే గృహ నిర్బంధం లేదా ముందస్తు అరెస్టు చేస్తున్నారంటే రెండు పాలక పార్టీలకూ వారంటే ఎంత కంటగింపో విదితమవుతోంది. అలాంటిదీ మీడియా గురించి విశ్లేషించే సందర్భంలో ఆ పార్టీ గురించి ఒక సబ్‌ హెడింగ్‌ పెట్టి మరీ ‘ఉనికి కోసం వెతుక్కునే పరిస్థితి’లో ఉందని వ్యాఖ్యానించడం సబబేనా!

జర్నలిజం శాస్త్రీయం..
ఒక పర భాషా విశ్లేషకునిపై వ్యాఖ్యానిస్తూ ‘ప్రజల నాడి పసిగట్టలేని జర్నలిస్టులు, విశ్లేషకులు తెలుగునాట ఉన్నారనే కదా దీని అర్థం!’ అని పేర్కొనడం మనల్ని మనం కించపరుచుకోవడం కూడా అవుతుంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని ఎవరైనా జర్నలిస్టు రాస్తే లేదా చెబితే ‘అలా కాదు.. మేం చెప్పినట్టు చెయ్యండి’ అంటూ వారి నోళ్లు నొక్కిన అగ్రశ్రేణి తెలుగు మీడియా సంస్థల యాజమాన్యాల నిజస్వరూపం తెలియనిదెవరికి? ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నవారికి..! జర్నలిజం శాస్త్రీయమైనది. వాస్తవ పరిస్థితులను వస్తుగతంగా పరిశీలించి, భూత భవిష్యత్‌ వర్తమానాలకు దాన్ని అన్వయించి విశ్లేషిస్తే అది తప్పక ప్రజామోదాన్ని ఆదరణనూ పొందుతుంది. అయితే, నయా ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో పాలకవర్గాలు ప్రధానంగా ద్రవ్య పెట్టుబడి శక్తులు వాస్తవాలను ఎలా మసిబూసి మారేడు కాయ చేస్తున్నాయో ప్రముఖ జర్నలిస్టు నోమ్‌ ఛామ్‌స్కీ తన ‘మాన్యుఫాక్చరింగ్‌ కన్సెంట్‌’ గ్రంథంలో విపులంగా వివరించారు. ఆయన తెలుగువాడు కాదు.. అసలు ఈ దేశస్థుడే కాదు! కాని ఆయన చెప్పినవన్నీ అక్షర సత్యాలు.

-గిరిపుత్ర

➡️