మతోన్మాద బిజెపి, దానికి మద్దతిచ్చే టిడిపి – జనసేన కూటమి, నిరంకుశ వైసిపిలను ఓడించండి : సిపిఎం-సిపిఐ రాష్ట్ర సదస్సు పిలుపు

Feb 21,2024 09:05

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, దానికి మద్దతిస్తున్న టిడిపి-జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం-సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. విజయవాడలోని ఎంబివికెలో మంగళవారం జరిగిన ఈ సదస్సుకు భారీ స్పందన లభించింది. వామపక్షాలు, కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రంలోని బిజెపి యేతర పార్టీలు ఒకే వేదికపైకి వచ్చిన ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో ప్రజానీకం కదలిరావడంతో ఎంబివికె కిటకిట లాడింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మతం పేరిట ప్రజలను విభజిస్తూ, అదే సమయంలో అదాని, అంబాని వంటి కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న తీరును, . ప్రత్యేక హోదాతోపాటు, విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహంచేస్తున్నా టిడిపి-జనసేన, వైసిపిలు బిజెపిని బలపరుస్తున్న తీరును వక్తలు వివరించారు. బిజెపిని, దానికి మద్దతిస్తున్న టిడిపి-జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిలను ఓడించాలన్న తీర్మానాన్ని సదస్సు హర్షధ్వానాలతో ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రంలో బిజెపిని ఓడించడమంటే, దానికి కొమ్ముకాస్తున్న టిడిపి-జనసేన కూటమి, నిరంకుశ వైసిపిని ఓడించడమే. రాష్ట్రం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం, మత సామరస్యం కోసం వామపక్ష లౌకిక శక్తులను బలపర్చాలని ఈ సదస్సు రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేసింది.

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  కేంద్రంలో బిజెపిని సాగనంపాలంటే రాష్ట్రంలో టిడిపి, జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని ఓడించాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడలో సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యాన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించారు. బిజెపిని వ్యతిరేకించే రాజకీయ పార్టీలూ ఈ సదస్సుకు హాజరయ్యాయి. బిజెపికి, దానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్న పార్టీలకు వ్యతిరేకంగా ప్రజాతంత్ర, లౌకికవాదులు, సంస్థలు ముందుకు రావాలని కోరుతూ రాజకీయ తీర్మానాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రవేశపెట్టగా సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.

వారు ఉత్సవ విగ్రహాలు : కె.నారాయణ

                     రాష్ట్రంలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉత్సవ విగ్రహాలుగా మారారని, బిజెపి నేరుగా పాలన చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. మోడీ, అమిత్‌షాల అడుగులకు మడుగులొత్తడానికి ఇద్దరు అలవాటు పడ్డారన్నారు. దేశాన్ని హోల్‌సేల్‌గా దోచుకుంటూ రాజ్యాంగాన్ని మోడీ ప్రమాదంలో నెట్టారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలిపారు. ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మోడీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు. రాష్ట్రపతిని సైతం మోడీ గౌరవించడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ‘సిపిఐ – చంద్రబాబుకు ఫెవికాల్‌ సంబంధం ఉందనుకుంటున్నారు. రాజకీయాల్లో విభేదిస్తాం. విమర్శిస్తాం’ అని చెప్పారు. ‘తెలుగు ప్రజలకు మోడీ శత్రువు. అలాంటివారితో ఎవరు సంబంధం పెట్టుకున్న వారూ మాకు శత్రువులే. వారితో రాజీ పడే ప్రసక్తే లేదు’ అని అన్నారు. అయితే, సిపిఐ దృష్టిలో జగన్‌, చంద్రబాబు సమానం కాదని చెప్పారు. ‘జగన్‌ శత్రుత్వ వైఖరి అనుసరిస్తున్నాడు’ అని అన్నారు. రూ.45 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన ముఖ్యమంత్రి జగన్‌ బయట తిరుగుతున్నాడని, చిన్న చిన్న కుంభకోణాల్లో ప్రతిపక్ష ముఖ్యమంత్రులను జైల్లో పెట్టిస్తున్నారని అన్నారు. పార్లమెంటులో పెట్టే బిల్లుకు సంబంధించి డ్రాఫ్ట్‌ కాపీలు రాగానే వాటి ఆమోదానికి తాము ముందుంటామంటూ వైసిపి, టిడిపి ఎంపిలు మోడీ ప్రభుత్వ కాళ్లముందుపడుతున్నారన్నారు. ఇంతకంటే లొంగుబాటు మరొకటి లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో బిజెపి, వైసిపి, టిడిపికి వ్యతిరేకరంగా వామపక్షాలు జరిపే ఉమ్మడి కృషికి ఈ సదస్సు దోహదపడుతుందని అన్నారు.

బిజెపి, దాని మద్దతు పార్టీలతో ప్రమాదం : వి. శ్రీనివాసరావు

              రాష్ట్రానికి బిజెపితో ప్రమాదమని, ఇప్పుడు దానికి మద్దతు ఇచ్చే పార్టీలతోనూ ప్రమాదం వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. . బిజెపి, టిడిపి-జనసేన కూటమికి, నిరంకుశ వైసిపికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎవరున్నారో వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం, రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని అడుగు పెట్టనీయకుండా చేయడమే సదస్సు ఉద్దేశమని పేర్కొన్నారు. చొక్కాలు, కుర్చీలు మడత పెట్టాలని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికే నాయకులకు బిజెపిని మడతపట్టే ధైర్యం, దమ్మూలేదన్నారు. రాష్ట్రంలో వైసినిని ఓడించాలని ప్రజలు పట్టుదలతో ఉన్నా, తెలుగుదేశాన్ని గెలిపించాలనే ఆలోచన వారిలో కనిపించడం లేదని చెప్పారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు లేని లోటు స్పష్టంగా కనిసిస్తోందని, ప్రజల తరపున ప్రశ్నించేవారు లేక పోవడంతో రాష్ట్రానికి ప్రస్తుత దుస్థితి దాపురించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావం పెరుగుతోందని తెలిపారు. రాబోయే రోజులు ఎర్రజెండా రోజులని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను బిజెపి నెరవేర్చలేదని తెలిపారు. స్టీలు ప్లాంటు అమ్ముతున్నారని, కడప ఉక్కులేకుండా చేశారని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని తెలిపారు.కార్పొరేట్ల నిధులు తీసుకోకుండా ప్రజల నిధులతో వారికోసం పనిచేస్తున్న పార్టీలు వామపక్షాలు మాత్రమేనని తెలిపారు. ప్రజల సొమ్మును ప్రజలకు ఇచ్చి తన సొమ్ములా ప్రచారం చేసుకుంటున్న జగన్మోహన్‌రెడ్డి 100లో 90 శాతం దోచుకుంటున్నారని, ఇప్పుడు టిడిపి కూడా 15 శాతం ఇస్తామంటోందని, మిగిలిన సొమ్ము గురించి మాట్లాడటం లేదని తెలిపారు. సిఎం వారానికి ఒకసారి ఢిల్లీకి వెళతారని, కానీ ఏమీ సాధించలేకపోగా మోడీ ఆజ్ఞ లేకుండా చీమ కూడా కదలని పరిస్థితిని సృష్టించారని తెలిపారు. కేంద్రానికి అంశాల వారీ మద్దతు ఇస్తున్నామని సిఎం చెబుతున్నారని, దేనిమీద మద్దతు ఇవ్వలేదో చెప్పాలని డిమాండు చేశారు. ఐదేళ్లలో 2.28 లక్షల కోట్లు పంచామని చెబుతున్నారని, ప్రజల జేబుల్లో నుండి ఎంత లాక్కున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రశ్నించడానికి, విమర్శించడానికి, ఉద్యమించడానికి, భిన్నాభిప్రాయం చెప్పడానికి లేకుండా నిరంకుశ, నిర్బంధం పాలన సాగిస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో బిజెపి తీరును ఎండగట్టిన చంద్రబాబు ఎన్నికల తరువాత బిజెపిని ఒక్కమాట కూడా అనలేదని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ప్రజల మోకాళ్ల ముందు తాకట్టు పెట్టారని అన్నారు. ఈ విషయంలో జగన్‌కు, చంద్రబాబుకు తేడా లేదని చెప్పారు.

ఒకేవేదికపైకి రావడం అభినందనీయం : గిడుగు రుద్రరాజు

                   దేశంలో బిజెపిని వ్యతిరేకించే శక్తులు, మిత్రులు ఒకే వేదికపైకి రావడం అభినందనీయమని సిడబ్ల్యుసి సభ్యులు గిడుగు రుద్రరాజు అన్నారు. ఇలాంటి వేదికను ఏర్పాటు చేసిన సిపిఎం, సిపిఐలను ఆయన అభినందించారు. సదస్సులో ప్రవేశపెట్టిన తీర్మానాలకు కాంగ్రెస్‌ తరపున ఆయన మద్దతు ప్రకటించారు. రాష్ట్రాన్ని కార్పొరేట్లు దోచుకుంటున్నాయని, వాటికి వ్యతిరేకంగా సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులు పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, స్టీలు ప్లాంటు రక్షణకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని తెలిపారు. విభజన హామీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రాజధానిపై కాంగ్రెస్‌ ఒకే నిర్ణయంతో ఉందని పేర్కొన్నారు. బిజెపికి వ్యతిరేకంగా రాష్ట్రంలో వామపక్షాలు నిర్వహించే కార్యక్రమాలకు తమ మద్దతు ఉందని పేర్కొన్నారు.

వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు : రామకృష్ణ

                    సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ మోడీ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని అన్ని రాష్ట్రాల్లో నాయకులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. జగన్‌, మోడీ, షా కలిసే చంద్రబాబును జైల్లో పెట్టారని, అయినా బాబు వారి సంకే ఎక్కుతున్నారని విమర్శించారు.

రైతులపై దాడులా…? గఫూర్‌

                    రైతాంగ సమస్యలను పరిష్కరించడానికి బదులు మోడీ ప్రభుత్వం వారిపై దాడులకు దిగుతోందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ అన్నారు. డ్రోన్లు, సూపర్‌సోనిక్‌ పరికరాలతో రైతులను భయపెడుతున్నా రన్నారు. యువకులకు ఉద్యోగాలు లేవన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎస్‌కెఎం నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ మోడీ అనుసరిస్తున్న తీరుపై ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఒకప్పుడు తెలుగుప్రజల ఆత్మగౌరవం నినాదంతో కేంద్రం మెడలు వంచిన చరిత్ర రాష్ట్రానికి ఉందని, అటువంటి చోట నాయకులు మోడీ కాళ్ల వద్ద సాగిలపడటం అన్యాయమని పేర్కొన్నారు.

బిజెపితో కలవడం వల్ల రాష్ట్రంలో వైసిపి, టిడిపి పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని, వాటికి ముప్పు పొంచి ఉందని విసికె పార్టీ నాయకులు బాలసింగం అన్నారు. 2024 తరువాత దేశంలో మోడీ అధికారంలోకి వస్తే తరువాత ఎన్నికలు ఉండవనే అంశాన్ని అందరూ గుర్తించాలని హెచ్చరించారు. మత పరమైన ఏజెండాతో ముందుకు వెళుతున్న బిజెపిని అడ్డుకోవాలంటే లెఫ్ట్‌ పార్టీల అవసరం ఉందని తెలిపారు.

జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వి.వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని మోడీ నాశనం చేశారని అన్నారు. అన్ని అంశాల్లోనూ దేశం వెనుక్కుపోతుంటే కేవలం ప్రచారంతో మోడీ ఎన్నికల్లోకి వెళుతున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన తరువాత దేశం ఎటువైపు వెళుతుందో ఊహించుకోవడమే కష్టమని తెలిపారు.

ప్రత్యేక హోదా సాధన సమితినాయకులు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ బిజెపికి వ్యతిరేకంగా నిలబడిన వామపక్షాల ఆధ్వర్యాన జరిగే పోరాటాలకు మద్దతు ప్రకటించారు. ఆర్‌పిఐ నాయకులు అంజయ్య మాట్లాడుతూ బిజెపి వ్యతిరేక శక్తులను ఒకతాటిపైకి తీసుకొచ్చి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎంసిపిఐ నాయకులు ఖాదర్‌భాషా, కాంగ్రెస్‌ నాయకులు సుంకర పద్మశ్రీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు పాశం వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు మూర్తి, తెలుగుసేన అధ్యక్షులు మూర్తి, రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి బండ్ల శ్రీనివాస్‌, నవతరం పార్టీ నాయకులు రావు సుబ్రహ్మణ్యం, భారత్‌ బచావో నాయకులు సిహెచ్‌.భాస్కరరావు, అమ్‌ఆద్మీ పార్టీ నాయకులు బాలసుబ్ర హ్మణ్యం తదితరులు మాట్లాడారు. తొలుత సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు వక్తలను వేదిక మీదకు ఆహ్వానించారు. సిపిఐ రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ వందన సమర్పణ చేశారు. సదస్సులో ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా ఒక తీర్మానాన్ని మెగా డిఎస్‌సి కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మెగా డిఎస్‌సి నిర్వహించాలని కోరుతూ మరో తీర్మానాన్నీ ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఒకే వేదికపైకి బిజెపి వ్యతిరేక శక్తులు

                  రాష్ట్రంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. బిజెపిని, దానికి మద్దతు ఇస్తున్న టిడిపి, జనసేన కూటమి, నిరంకుశ వైసిపిని వ్యతిరేకించే శక్తులు మంగళవారం ఒకే వేదికపైకి చేరాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసిపి.. బిజెపికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తోంది. జనసేన ఎన్‌డిఎ కూటమిలోనే ఉంది. ఇప్పుడు బిజెపి చెంతకు టిడిపి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇప్పటికే అమిత్‌షా, నడ్డాను కలిసి వచ్చారు. అనంతరం ఎన్‌డిఎలో చేరతారనే ప్రచారం వుంది. కేంద్రం పెట్టే బిల్లులన్నిటికీ టిడిపి, వైసిపి మద్దతు ఇచ్చి పార్లమెంటులో ఓటు కూడా వేశాయి. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ బిజెపికి కాళ్ల ముందు మోకరిల్లాయి. ఈ నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఉమ్మడిగా నిర్వహించిన సభకు పెద్దయెత్తున మద్దతు వచ్చింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్‌తో సహా అనేక పార్టీలు, సంస్థలు ఐక్యంగా గళం విప్పాయి. సిపిఎం, సిపిఐ చొరవను అభినందించడంతోపాటు భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాల్లో కలిసి వస్తామని ప్రకటించాల్సి వచ్చింది. నూతనంగా ఏర్పాటైన జైభారత్‌ నేషనల్‌ పార్టీ, అమ్‌ఆద్మీ, ఆర్‌పిఐ, ఫార్వార్డ్‌బ్లాక్‌, ఆర్‌ఎస్‌పి, ప్రజా కాంగ్రెస్‌, నవతరం, తెలుగుసేన, విసికె పార్టీలూ కలిసి వచ్చాయి. అలాగే రైతుల సమస్యలపై సుదీర్ఘపోరాటం చేస్తున్న ఎస్‌కెఎం రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా ఈ సదస్సులో పాల్గొని బిజెపిని ఓడిస్తేనే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తని స్పష్టం చేశారు. ప్రఖ్యాత ఇంజినీరు కెఎల్‌రావు కుమారుడు విజయరావు కూడా తన సంపూర్ణ మద్దతు ప్రకటించడంతోపాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. యువజన, విద్యార్థి, మహిళా, కార్మిక, సంఘాల నాయకులు కూడా ఈ వేదికలో పాలు పంచుకున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బిజెపికి వ్యతిరేకంగా బలమైన వాణిని వినిపించే శక్తులన్నీ ఒకవేదికపైకి వచ్చినట్లయింది.

➡️