‘కంది’ రైతుకు కష్టాలు

Jan 17,2024 10:54 #'Kandi' farmer, #Difficulties
  • ఈ దఫా చేలల్లో విస్తృతంగా కంది సాగు
  • వర్షాభావంతో దెబ్బతిన్న పంటలు
  • చేతికందొచ్చే కొంత పంటపైనా చీడపీడలు
  • దిగుబడి లేక నష్టాలే
  • వాతావరణ మార్పులే కారణమంటున్న అధికారులు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకన్నీ కష్టాలే మిగిలాయి. అందుకు వర్షాభావ పరస్థితులే కారణమనే తెలుస్తోంది. ఈ ఏడాధి జిల్లాలో లక్ష హెక్టార్లకు పైగా వేరుశనగ పంటను రైతులు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులతో తూర్పు మండలాల్లో ఎక్కువ మంది మెట్ట ప్రాంతాల్లో కంది సాగుపై ఆసక్తి చూపారు. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో వేరుశెనగ ఉసురుమనిపిస్తే కంది రైతులకు కష్టాలు మిగిల్చింది. రైతులు ఎటు చూసినా కష్టాలు నష్టాలు తప్పడం లేదు పదేళ్ల కాలం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. వేరుశెనగ రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న వేరుశనగ ఏటా నష్టాలు తెచ్చి పెట్టడం వేరుశెనగ రైతులు తీవ్ర నష్టాలతో అతలాకుతలం అవుతున్నారు. ఈ ఏడాది వర్షాలలేమి కారణంగా వేరుశెనగతో పాటు కందిపంట రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రైతులు నష్టపోయారు. తమను గట్టెక్కిస్తుం దని కొండంత ఆశతో మొట్ట భూముల్లో కంది పంటను సాగు చేశారు. వాతావరణ మార్పులు చోటుచేసుకో వడంతో పాటు చీడ,పీడలు వెంటాడడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. జిల్లాలో రైతులు అత్యధిక శాతం మంది వర్షాలను నమ్ముకొని పంటలు సాగుచేశారు. ఖరీఫ్‌లో వర్షాధారం కింద అంతర్‌, ప్రధాన పంటలుగా వర్షాధారం కింద దాదాపు 80వేల హెక్టార్లు కంది సాగు చేశారు. సాగు చేసిన వేరుశెనగ పంట రైతులను నట్టేట ముంచింది. అంతర్‌ పంటగా సాగుచేసిన కందికి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడి తగ్గింది. పంట చేతికి అందుతుందని ఆశించిన రైతులకు నిరాశ మిగిలింది. పూత, కోత దశలో వర్షాలు పడకపోవడంతో చీడపీడలు ఆశించి పంట పూర్తిగా దెబ్బతింది. ఎకరా సేద్యం ఖర్చుతో పాటు విత్తనాలు మందుల పిచికారి కోసం ఎకరాకు రూ.22వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆశించిన స్థాయిలో పంట చేతకందక పోవడంతో తీవ్రంగా నష్టపోయవాల్సి వచ్చిందని జిల్లా ఖరీఫ్‌ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఖరీఫ్‌ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ-క్రాప్‌ బుకింగ్‌ ప్రభుత్వం చేపట్టినా కొందరు రైతులు బుకింగ్‌ చేసుకోలేకపోయారని పంట నష్టపోయిన ఖరీఫ్‌ రైతులందరినీ అదుకోవాలని కోరుతున్నారు.

అర క్వింటాలు కూడ కష్టమే- రామయ్య, వేరుశనగ రైతు, ఐరాల మండలం

సాగు సమయంలో వర్షాలు కురవడంతో వేరుసెనగ స్థానంలో ప్రధాన పంటగా కంది పంటను ఎక్కువగా సాగు చేశాం. వాతావరణ మార్పులతో కంది దెబ్బతిని పూత రాలిపోయిడంతో పంట రాలేదు.ఎకరం కంది సాగు కోసం రూ.20వేలు ఖర్చు చేశాం. పంట చేతికందే పరిస్థితి లేదు.

ఏటా నష్టలే- మహిళ రైతు నీలమ్మ, బంగారుపాళ్యం

వేరుశనగలో ఏటా నష్టలు రావడంతో ఈ సారి వెరుశనగతో పాటు కంది సాగుచేశాం. మందుల పిచికారీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాము వేరుశనగ నష్టాన్ని మిగిల్చింది. కంది పంట చేతికొస్తుదనుకుంటే ఆకులు రాలిపోయి. గింజలు ఉండటం లేదు.

➡️