నేవీ డిపో ఆపకుంటే ‘యుద్ధ’మే..!

Dec 14,2023 09:10 #anti-people policies, #Navy Depo
eluru jilugumilli people oppose navy depo

గ్రామసభలో నేవీ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత
అధికారులపై వంకావారిగూడెం, పరిసర గ్రామాల ప్రజలు మండిపాటు
ఏజెన్సీలో గిరిజనులను బతకనీయరా అంటూ ఆవేదన
ఇప్పటికే ‘పోలవరం’ పేరుతో వేల గిరిజన కుటుంబాలది తలోదారి
డిపోను అడ్డుకునేందుకు దేనికైనా సిద్థమంటూ జనం హెచ్చరిక

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో 1,166 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని చూస్తున్న నేవీ యుద్ధ సామగ్రి డిపోపై స్థానిక ప్రజానీకం తిరుగుబాటుకు దిగారు. తమను సంప్రదించకుండా తమ భూముల్లో సర్వేలు నిర్వహించి, భూసేకరణ చేసేందుకు ముందుకు సాగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తహశీల్దార్‌ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో యుద్ధసామగ్రి డిపోను వ్యతిరేకిస్తూ గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తమ మనోభావాలకు వ్యతిరేకంగా యుద్ధసామగ్రి డిపో ఏర్పాటుపై ముందుకు సాగితే ప్రజాయుద్ధం తప్పదని అధికారులను హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతమైన జీలుగుమిల్లి మండలంలో నేవీ యుద్ధసామగ్రి డిపోను ఏర్పాటు చేయాలని కేంద్రంలోని మోడీ సర్కార్‌ పూనుకుంది. విషయం బయటికి రాకుండా ముందుగానే అధికారులతో సర్వేలు సైతం చేయించింది. కేంద్రం నిర్ణయానికి రాష్ట్రం వంత పాడటంతో అధికారులు అక్కడి ప్రజలకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ముందుకు సాగుతున్నారు. యుద్ధసామగ్రి డిపో ఏర్పాటు విషయం బయటికి రావడంతో వంకావారిగూడెం పంచాయతీ పరిధిలోని మడకావారిగూడెం, దాట్లవారిగూడెం, కొత్తసీమలివారి గూడెం, రమణక్కపేట ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. డిపోను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. యుద్ధసామగ్రి డిపో ఏర్పాటు వద్దంటే వద్దంటూ తేల్చి చెప్పేశారు.

నేవీ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటైతే తీవ్ర నష్టమే

నేవీ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటైతే జీలుగుమిల్లి మండలంలో తీవ్ర నష్టం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గిరిజనులకు చెందిన వేలాది ఎకరాల భూమి నేవీ చేతిలోకి వెళ్లిపోతుంది. గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేయాల్సి ఉంటుంది. డిపో ఏర్పాటైన తర్వాత చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఆంక్షలు, నిర్బంధాలు కొనసాగుతాయి. సొంత గ్రామాలకు వెళ్లాలన్నా తనిఖీలు చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకా అనేక ఫ్యాక్టరీలు ఏర్పాటుకు అడుగులు వేసి భూములను లాగేసుకునే పరిస్థితి ఏర్పడనుంది. ఉద్యోగాలు వస్తాయని చెబుతున్న మాటలన్నీ బూటకమే అంటున్నారు. నేవీ యుద్ధసామగ్రి డిపోలో నిపుణులైన ఉద్యోగులు మాత్రమే పని చేస్తారు. అంటే స్థానిక ప్రజానీకానికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు. అటెండర్‌, శుభ్రత పనులకోసం కొంతమందిని తీసుకున్నా అవి తాత్కాలికమేనని చెప్పొచ్చు. జిల్లాలో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాలు ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పేరుతో పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మూడు మండలాల్లోని గిరిజనులను ఖాళీ చేయించి తలోదారి అన్నట్లు గ్రామాల నుంచి తరిమేశారు. పుట్టిన ఊరును వదిలేసి వారంతా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జీలుగుమిల్లి మండలంలో నేవీ యుద్ధ సామగ్రి ఏర్పాటు చేసి ఇక్కడ గిరిజనులను కూడా తరమివేయాలని చూస్తున్నారు. గిరిజనులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో అందరిలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే డిపోను మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అటువైపు కాకుండా తక్కువ ధరకు గిరిజనుల భూములను కాజేసేందుకు ప్రణాళిక రచించారు. నేవీ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటైతే జీలుగుమిల్లి మండలం మొత్తం నేవీ కనుసన్నల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడనుంది. యుద్ధ సామగ్రి డిపోనకు వ్యతిరేకంగా తాము దేనికైనా సిద్ధమని గిరిజనులతోపాటు, ఆ ప్రాంత ప్రజలు ఘంటాపథంగా చెబుతున్నారు.

➡️