మూర్ఛ వ్యాధి – అవగాహన

Mar 26,2024 06:30 #Articles, #awareness, #edit page, #Epilepsy

ప్రపంచ వ్యాప్తంగా మార్చి 26న ‘ప్రపంచ మూర్ఛ రోగ అవగాహన దినం లేదా వరల్డ్‌ ఎపిలెప్సీ అవేర్‌నెస్‌ డే’ను పాటిస్తున్నాం. ఎపిలెప్సీ లేదా మూర్ఛ రోగం లేదా కాకిసోమాల వ్యాధి పట్ల సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల ఎపిలెప్సీ రోగులున్నారని, వీరిలో 80 శాతం అభివృద్ధి చెందుతున్న, మధ్య ఆదాయ దేశాల్లోనే ఉన్నారని తేలింది. ప్రతి 26 అమెరికన్లలో ఒకరికి తన జీవిత కాలంలో ఎపిలెప్సీ వచ్చే అవకాశం ఉందని తేలింది. అయితే ఎపిలెప్సీ రుగ్మతగల స్త్రీపురుషులు పూర్తి జీవితాన్ని అనుభవించే అవకాశాలే ఎక్కువ. కొన్ని కేసుల్లో అకాల మరణాలు కూడా చోటు చేసుకోవచ్చు.
రోగ లక్షణాలు
మూర్ఛ రోగ లక్షణాలుగా అసాధారణ ప్రవర్తన, స్పృహ కోల్పోవడం, తాత్కాలిక గందరగోళం, నిశ్చేష్టంగా చూడడం, కాళ్ళు చేతులు నియంత్రణ కోల్పోయి కదలడం, భయపడడం, ఉద్రేక పడడం లాంటివి కలిగి ఉంటారు. అధిక జ్వరం, తలకు గాయాలు, రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పడిపోవడం, ఆల్కహాల్‌ అలవాటును ఒక్కసారిగా మానడం లాంటి సందర్భాలలో మూర్ఛలు బయట పడతాయి. సరైన చికిత్స అందుబాటులో లేని ఎపిలెప్సీ రుగ్మత చిన్న పిల్లలు, వృద్ధులలో అధికంగా కనిపిస్తుంది. మహిళల కన్న పురుషుల్లో దీని ప్రభావం ఎక్కువ.
కేంద్ర నాడీమండలంతో పాటు మెదడు సంబంధ రుగ్మతల్లో మూర్ఛ రోగం నాల్గవ ముఖ్య వ్యాధిగా గుర్తించబడి అనాదిగా మిలియన్ల ప్రజలను పట్టి పీడిస్తున్నది. భారత్‌లో 10 మిలియన్ల మూర్ఛరోగులున్నారని అంచనా (జనాభాలో దాదాపు ఒక శాతం). మన దేశంలో పేదరికం, సాంప్రదాయ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు, ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బంది కొరత, యాంటీ-ఎపిలెప్సీ ఔషధాల పట్ల అవగా హన లోపించడం లాంటి కారణాలతో మూర్ఛ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఎపిలెప్సీ అనబడే మెదడుకు సంబంధించిన రుగ్మత (మెదడుకు గాయం, బ్రెయిన్‌ ట్యూమర్లు, మెదడుకు ఇన్‌ఫెక్షన్లు సోకడం)గా భావిస్తారు.
ఎపిలెప్సీల్లో 25 శాతం నివారించదగినవే అని నమ్మాలి. తలకు గాయాలు కాకుండా చూసుకోవడం, గర్భంలోని శిశువుల సంరక్షణ, జ్వరం వచ్చినపుడు శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చూడడం, బిపి/షుగర్‌/స్థూలకాయాలను నియంత్రించు కోవడం, పొగాకు/ఆల్కహాల్‌ వాడకం తగ్గించుకోవడం, మెదడుకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్త పడడం లాంటి చర్యలతో ఎపిలెప్సీని నివారించవచ్చని తెలుసుకోవాలి.
మూర్ఛ రోగం పట్ల కుటుంబ పెద్దలు, యువత సంపూర్ణ అవగాహన కలిగి, ఎలాంటి అపోహలకు తావు లేకుండా, రోగులకు ధైర్యాన్ని అందిస్తూ ఎపిలెప్సీ రుగ్మతల కట్టడికి కృషి చేయాలి. పేదరికం, అధిక జనాభా, నిరక్షరాస్యత లాంటి తీవ్ర సమస్యలు ఉన్న భారత్‌ లాంటి దేశాల్లో మూర్ఛ రోగం బహు భారంగా నిలుస్తున్నది. ఇలాంటి ఎపిలెప్సీ రుగ్మత పట్ల ముప్పేట సమూహిక దాడి చేద్దాం, ఆరోగ్య భారత నిర్మాణ యజ్ఞంలో మనందరం భాగస్వామ్యం తీసుకుందాం.

డా|| బుర్ర మధుసూదన్‌ రెడ్డి,
సెల్‌: 9949700037

➡️