దాడులకు భయపడకుండా పోరాటాలు : ‘ప్రజాశక్తి’తో ఎఐకెఎస్‌ నాయకులు

Dec 18,2023 11:10 #special story

ప్రజాశక్తి- కర్నూలు, అనంతపురం ప్రతినిధులు : దాడులకు భయపడకుండా పోరాటాలు సాగిస్తున్నామని పలువురు ఎఐకెఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు విజయాలు సాధించామని చెప్పారు. కర్నూలులో ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా పలు రాష్ట్రాల ఎఐకెఎస్‌ కౌన్సిల్‌ సభ్యులు తమ ఉద్యమానుభవాలను ‘ప్రజాశక్తి’తో పంచుకున్నారు.

బలమైన పోరాటాలతో ముందుకెళ్తాం

త్రిపురలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చాక మార్కిస్టు పార్టీ నాయకుల, కార్యకర్తల ఇళ్లు, కార్యాలయాలపై, వ్యవసాయ క్షేత్రాలపై దాడులకు పాల్పడింది. పంటలు, పండ్ల తోటలను ధ్వంసం చేసింది. వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను నాశనం చేసింది. మహిళలను, పిల్లలను, ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. సిఐటియు కార్యకర్తల జీవనాధారమైన వాహనాలను ధ్వంసం చేసింది. అయినా, మొక్కవోని ధైర్యంతో నాయకులు, కార్యకర్తలు పోరాడుతున్నారు. ఎఐకెఎస్‌, సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ప్రజలను కూడగట్టి జిల్లాల వారీగా ప్రదర్శనలు చేశాం. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ గుండాల ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతం ప్రచారం చేశాం. అసెంబ్లీని ముట్టడించాం. గవర్నర్‌ భవనానికి చేరుకుని సమస్యలు వివరించాం. మోసపూరిత వాగ్దానాలతో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చింది. ప్రధాన మంత్రి, 20 మంది మంత్రులు ప్రచారంలోకి దిగారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మత ఉన్మాదాన్ని పెంచే ప్రచారాన్ని చేశారు. కాంగ్రెస్‌, టిఎంసి నాయకులను బిజెపిలో చేర్చుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అసత్య ప్రచారం చేసి సిపిఎం పట్ల వ్యతిరేక భావాన్ని పెంచారు. కొత్త ఉద్యోగాలిస్తామన్నారు. ఏడో ఫైనాన్స్‌ కమిషన్‌ను అమలు చేస్తామన్నారు. మంచి పాలన అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదు. బిజెపి పాలనలో అవినీతి, లంచగొండితనం పెరిగింది. సిపిఎం రెండోసారి ఓడిపోయినా గతం కంటే 12 శాతం ఓటింగ్‌ పెరిగింది. పట్టణ, ఏజెన్సీ ప్రాంత ప్రజలు సిపిఎంను ఆదరించారు. భవిష్యత్తులో బలమైన పోరాటాలతో ముందుకెళ్తాం.

– పవిత్రకార్‌, ఎఐకెఎస్‌ త్రిపుర ప్రధాన కార్యదర్శి.

దయనీయంగా చెరుకు రైతుల పరిస్థితి

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాల వల్ల చెరుకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దేశ వ్యాప్తంగా 732 చక్కెర కర్మాగారాలు ఉంటే, గతేడాది 530 కర్మాగారాలు మాత్రమే క్రషింగ్‌ చేశాయి. మిగిలినవి మూతపడే స్థితిలో ఉన్నాయి. చెరకు రైతులను ఆదుకునేందుకు తీసుకొచ్చిన 1966 షుగర్‌ కేన్‌ కంట్రోల్‌ ఆర్డర్‌కు గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. ఇవి రైతులను నాశనం చేస్తున్నాయి. రెవెన్యూ షేరింగ్‌ ఫార్ములాను అమలు చేయాలని రంగరాజన్‌ కమిటీ సూచించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు రెవెన్యూ షేరింగ్‌ చట్టాన్ని చేసినా ఏడేళ్లుగా అవి అమలు కావడం లేదు. తమిళనాడులో గతేడాది ఆందోళన చేపట్టి టన్ను చెరుకుకు అదనంగా రూ.195 చొప్పున ఇన్సెంటివ్‌ సాధించుకున్నాం. గతేడాది తెలంగాణలో 30 సహకార చక్కెర కర్మాగారాలకు ప్రభుత్వం బకాయి ఉంటే, పోరాడి సాధించుకున్నాం. ఇంకా దేశ వ్యాప్తంగా రూ.6 వేల కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో బకాయిల కోసం ఆందోళనలు సాగుతున్నాయి. తమిళనాడులో ఎస్‌ఎపి ప్రకటించని 2004-2005, 2008-2009 సంవత్సరాల్లో ఫ్యాక్టరీకి వచ్చే లాభాల్లో 50 శాతం రైతులకు చెల్లించాలని కోర్టులో కేసు వేసి ఆర్డర్‌ తెచ్చుకున్నాం. బిజెపి అధికారంలో ఉన్న యుపిలో ఈ ఉత్తర్వుల ప్రకారం రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు. ఎపిలో ఆరు సహకార చక్కెర కర్మాగారాలు ఎన్‌సిఎల్‌టికి అప్పగించాలని చూస్తే హైకోర్టులో కేసు వేశాం. ఎన్‌సిఎల్‌టికి అప్పగించకూడదని కోర్టు తీర్చు ఇచ్చింది. ఎపిలో చక్కెర కర్మాగారాల బకాయిలను ప్రభుత్వం ఇచ్చి వాటిని పున:ప్రారంభించాలి.

– డి.రవీంద్రన్‌, అఖిల భారత చెరుకు రైతుల ఫెడరేషన్‌ అధ్యక్షులు

పోరాటాలతో ముందుకు సాగుతున్నాం

రాష్ట్రంలో పలు సమస్యలపై పోరాటాలతో ముందుకు సాగుతున్నాం. కర్ణాటకలో ప్రధానంగా రైతుల భూములు లాక్కోవడానికి వ్యతిరేకంగా, పంటలకు గిట్టుబాటు ధర కోసం పోరాటాలు సాగుతున్నాయి. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదు. కొబ్బరి ఉత్పత్తిలో కర్ణాటక రెండో రాష్ట్రంగా ఉంది. ఉద్యాన శాఖ అధికారిక లెక్కల ప్రకారం క్వింటాలు కొబ్బరి తీయడానికి రూ.16,730 ఖర్చు అవుతోంది. కేంద్రం రూ.11,730 మాత్రమే మద్దతు ధర ఇస్తోంది. అది కూడా సక్రమంగా అందడం లేదు. రైతులకు రూ.6,500 నుంచి రూ.9 వేల మధ్య మాత్రమే దక్కుతోంది. నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరిగింది. 15 నుంచి 30 రోజుల్లోనే కొనుగోలు కేంద్రాలను మూసేశారు. తీవ్ర ఆందోళనల ఫలితంగా 25 శాతం కొబ్బరినే కొన్నారు. గతంలో రాష్ట్రంలోని బిజెపి అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తోంది. దీనిపై చలో విధానసౌధ, చలో రాజ్‌భవన్‌, ఎంపి, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి చేపట్టాం. రాష్ట్రంలోని గత బిజెపి ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను చేసింది. వాటివల్ల రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. వాటిని రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటినే కొనసాగిస్తోంది. భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రైతుల నుంచి బలవంతంగా లాక్కొంటోంది. దీనిపై 600 రోజులకుపైగా ఆందోళన సాగుతోంది. గాలి జనార్థన్‌రెడ్డి 2012లో 14 వేల ఎకరాలు తీసుకుని బ్రాహ్మణి స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకూ కంపెనీ పెట్టలేదు. దీనిపై 300 రోజులుగా బళ్లారి జిల్లా కురుగోడులో ఆందోళన సాగుతోంది. రైతులందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో బిజెపిని ఓడించగలిగాం.

                         – టి.యశవంత, కర్ణాటక రాష్ట్ర ప్రాంత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి

➡️