India in trade deficit : టాప్‌ -10 దేశాల్లో తొమ్మిదింటితో భారత్‌ వాణిజ్య లోటు

May 27,2024 15:40 #India, #trade deficit

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉన్న టాప్‌ -10 దేశాల వాణిజ్యంలో తొమ్మిందిటితో భారత్‌ వాణిజ్యలోటు ఉందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. గతేడాది వాణిజ్యలోటు (ఎగుమతులు- దిగమతులు)లో చైనా, రష్యా, సింగపూర్‌, కొరియాతో సహా టాప్‌ -10 వాణిజ్య భాగస్వామ్య దేశాలన్నింటిలో తొమ్మి దేశాలతో భారత్‌ వాణిజ్యలోటుతో ఉంది.
అధికారిక సమాచారం ప్రకారం… 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో చైనా, రష్యా, కొరియా, హాంకాంగ్‌లతో భారత్‌ వాణిజ్యలోటు పెరిగింది. ఇక యుఎఇ, సౌదీ అరేబియా, రష్యా, ఇండోనేషియా, ఇరాక్‌ దేశాలతో మన దేశ వాణిజ్యలోటు తగ్గింది.
ఇక దేశాల వారీగా చూస్తే.. 2022-23 పోల్చితే.. 2023-24లో చైనాతో 85, రష్యా 57.2, కొరియా 14.71, హాంకాంగ్‌ 12.2 బిలియన్‌ డాలర్ల మేర భారత్‌ వాణిజ్యలోటు పెరిగింది. ఇక ప్రపంచ అగ్రగామి దేశమైన అమెరికా తర్వాత 2023-24లో 118.4 బిలియన్‌ డాలర్లతో భారత్‌కు రెండవ అతిపెద్ద వాణజ్య భాగస్వామి దేశంగా చైనా అవతరించింది. భారత్‌- అమెరికా దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24లో 118.28 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో కూడా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగింది.
సింగపూర్‌, యుఎఇ, కొరియా, ఇండోనేషియా (ఆగేయాసియా దేశాల వాణిజ్య ఒప్పందంలో భాగంగా)లతో మనదేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కొనసాగిస్తోంది. 2023-24లో అమెరికాతో భారతదేశం 36.74 బిలియన్ల వాణిజ్య మిగులును కలిగి ఉంది. అమెరికాతోనే కాకుండా.. యుకె, బెల్జియం, ఇటలీ, ఫ్రాన్స్‌, బంగ్లాదేశ్‌లతో కూడా భారత్‌ వాణిజ్య మిగులు ఉంది. 2022-23లో 264.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్న మన దేశ వాణిజ్యలోటు గత ఆర్థిక సంవత్సరంలో 238.3 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.
దేశ ఎగుమతులను పెంచడానికి.. ముడి పదార్థాలను లేదా వాటికి సంబంధించిన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే భారత్‌ వాణిజ్యలోటు ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. అయితే వాణిజ్యలోటు అనేది కచ్చితంగా దేశీయ కరెన్సీపై ఒత్తిడి తెస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే వాణిజ్యలోటు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎకనామిక్‌ థింక్‌ ట్యాంక్‌ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జిటిఆర్‌ఐ) హెచ్చరించింది.
దిగుమతులు పెంచడం వల్ల.. వాటికి సంబంధించిన చెల్లింపులు విదేశీ కరెన్సీల్లోనే చెల్లించాలి. దీంతో మన దేశ కరెన్సీ విలువ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దిగుమతులు మరింత ఖరీదైనవి అవ్వడం వల్ల వాణిజ్యలోటును మరింత దిగజారుతుందని జిటిఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజరు శ్రీవాస్తవ చెప్పారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న లోటును పూడ్చడానికి దేశం విదేశీ రుణదాతల నుండి ఎక్కువ రుణాలు తీసుకోవలసి ఉంటుంది. బాహ్య రుణాలు పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలను క్షీణింపజేస్తుందని, పెట్టుబడిదారులకు ఆర్థిక అస్థిరతను సూచిస్తుందని, ఇది విదేశీ పెట్టుబడులను తగ్గించడానికి దారితీస్తుందని ఆయన అన్నారు.
ముఖ్యంగా వాణిజ్యలోటును తగ్గించడానికి ఎగుమతులను పెంచడం, అనవసరమైన దిగుమతులను తగ్గించడం, దేశీయ పరిశ్రమలను అభివృద్ధి చేయడం, కరెన్సీ, రుణ స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించడం అవసరం అని శ్రీవాస్తవ తెలిపారు.

  • దేశం
  • మిలియన్ డాలర్లలో వాణిజ్య సంతులనం

చైనా                                                                           – 85,087

రష్యా                                                                         – 57,170

ఇరాక్                                                                        – 26,650

సౌదీ అరేబియా                                                      – 20,244

ఇండోనేషియా                                                        – 17,422

సౌత్ కొరియా                                                          – 14,719

యుఎఇ                                                                   – 12,393

హాంగ్ కాంగ్                                                            – 12,206

సింగపూర్                                                               – 6,787

అమెరికా                                                                 – 36,742

➡️