జిందాల్‌ జొరబడుతోంది !

Dec 18,2023 10:12 #intruding, #jindal, #visakha steel
  • స్టీల్‌ ప్రై’వేటు’కు మరో కుట్ర
  • బ్లాస్ట్‌ ఫర్నేస్‌ అప్పగింతకు రహస్య ఒప్పందం
  • ఢిల్లీలో మూడు రోజులుగా యాజమాన్యాల తిష్ట
  • అడుగుపెట్టనివ్వబోమన్న కార్మికులు

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ ఉక్కుపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు సాగిస్తూనేవుంది. ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి ‘ఉక్కు’ పరిరక్షణకు పోరాడుతున్న నేపథ్యంలో దానిని ముక్కలుముక్కలు చేసి తెగనమ్మేందుకు మోడీ సర్కార్‌ ప్రయత్నిస్తోంది. తాజాగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌ – 3 నిర్వహణ బాధ్యతలను జిందాల్‌ స్టీల్‌ సంస్థకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆ సంస్థతో ఎంఒయు కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రయివేటీకరణపై కేంద్రం పునరాలోచిస్తోందంటూ స్థానిక నేతల ప్రకటనలతో ఒకవైపు నాటకాన్ని కొనసాగిస్తూ మరోవైపు విశాఖ ఉక్కును ముక్కలు చేసి ప్రయివేటుకు కట్టబెట్టేస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిందాల్‌ను స్టీల్‌ ప్లాంట్‌లోకి అడుగుపెట్టనీయబోమని అంటున్నాయి. ఉక్కు ప్రయివేటీకరణపై సమీక్షిస్తామంటూ రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహరావు వంటి నేతలతో ఇక్కడ అసత్యాలు వల్లెవేయిస్తూ మరోవైపు జిందాల్‌తో రహస్య ఒప్పందం చేసుకోవడం బిజెపి ఆడుతున్న నాటకానికి అద్దం పడుతోందని కార్మికులు విమర్శిస్తున్నారు. జనసేన కూడా విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూనే..దానికారణమైన బిజెపి గళాన్నే వినిపిస్తుండటం దుర్మార్గమని వాపోతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం..విశాఖ ఉక్కును ప్రయివేటీకరించేందుకు ఈ నెల 16న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యాన్ని, జిందాల్‌ యాజమాన్యాన్ని కేంద్ర పెద్దలు ఢిల్లీకి రప్పించుకుని రహస్య మంతనాలు జరిపారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 నడిపేందుకు జిందాల్‌ స్టీల్‌తో ఎంఒయు చేసుకోవాలని నిర్ణయించారు. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ప్లాంట్‌, జిందాల్‌ యాజమాన్యాలు తిష్టవేశాయి. ప్లాంట్‌ను నడిపేందుకు అన్ని వ్యవహారాలనూ చక్కబెట్టాలని జిందాల్‌ను కేంద్రం కోరింది. ఈ మంతనాల్లో కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ ముఖ్య ప్రతినిధులూ పాల్గొన్నారు. కేంద్ర పెద్దలు, జిందాల్‌ యాజమాన్యంతో భేటీ అనంతరం ఢిల్లీ నుంచే స్టీల్‌ సిఎండి, కొందరు డైరెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి బెంగళూరు, విశాఖలోని డైరెక్టర్లను భాగస్వామ్యం చేస్తూ అక్కడి విషయాలు తెలియజేశారు. డిసెంబరు 2న జరిగిన కార్మికులు, స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్య చర్చల్లో జిందాల్‌ మన ప్లాంట్‌లోకి రాదంటూ సిఎండి చెప్పారు. తాజా పరిణామాలతో సిఎండి అబద్ధాలు చెప్పి మోసగించారంటూ కార్మికులు మండిపడుతున్నారు. వెయ్యి రోజులకుపైగా స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, విశాఖలోని అన్ని తరగతుల ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాడుతూ ప్లాంట్‌ను నడిపేందుకు సహకరించాలని మొరపెట్టుకుంటున్నా కేంద్రంలోని బిజెపి సర్కార్‌ తన ప్రయత్నాలను మానడం లేదు. ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యారాం హెచ్చరించారు. ప్లాంట్‌ అమ్మకం ఆగిపోయిందంటూ, అన్ని సమస్యలూ కేంద్రం పరిష్కరించనుందంటూ బిజెపి నాయకులు జివిఎల్‌ నరసింహారావు, ఆ పార్టీతో అంటకాగుతున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల విశాఖ సభలో ప్రజానీకాన్ని వంచించే ప్రయత్నం చేశారు.

            నోరుమెదపని రాష్ట్ర ప్రభుత్వం

కేంద్రం కుట్రలను ఎదిరించేందుకు కార్మికవర్గం పోరాడుతున్నా వైసిపి, రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి నోరుమెదపకపోవడం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. జిందాల్‌తో గడిచిన రెండు రోజులుగా ఏం చర్చలు జరిగాయో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చర్చలు నిజమే ! ధ్రువీకరించిన స్టీల్‌ పిఆర్‌ఒ

ఢిల్లీ స్థాయిలో స్టీల్‌ యాజమాన్యం, జిందాల్‌కు మధ్య చర్చలు జరగాయని స్టీల్‌ ప్లాంట్‌ పిఆర్‌ఒ సెక్షన్‌ హెచ్‌ఒడి ఆర్‌పి శర్మ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు. ఏం జరిగిందో యాజమాన్యం చెబుతుందని, తనకు తెలియదని చెప్పారు.

➡️