కలవరపరుస్తున్నాయి

Dec 17,2023 11:26 #governer, #Justice RF Nariman
  • దేశంలో ఘటనలపై జస్టిస్‌ నారిమన్‌
  • బిబిసిపై దాడులు, ఆర్టికల్‌ 370పై సుప్రీం తీర్పు ప్రస్తావన
  • ఇసి బిల్లు, గవర్నర్ల వైఖరిని తప్పుపట్టిన సుప్రీం మాజీ న్యాయమూర్తి

న్యూఢిల్లీ   :   ఈ సంవత్సరం దేశంలో నాలుగు ‘అత్యంత కలవరపరిచే’ ఉదంతాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రోహింటన్‌ ఎఫ్‌ నారిమన్‌ తెలిపారు. రాజ్యాంగ తనిఖీ వ్యవస్థలు, మానవ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని మండిపడ్డారు. గుజరాత్‌ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్రకు సంబంధించి బిబిసి డాక్యుమెంటరీ వెలువడిన తర్వాత దేశంలో ఆ సంస్థపై ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు పెరిగాయని నారిమన్‌ చెప్పారు. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఓ మంత్రికి ఎలా స్థానం కల్పిస్తారని ప్రశ్నించారు. కేరళ గవర్నర్‌ తన వద్దకు వచ్చిన బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతికి ఎలా పంపుతారని నిలదీశారు. ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. ఇవన్నీ ఈ సంవత్సరంలో తీవ్ర కలవరపాటుకు, ఆందోళనకు గురిచేసిన ఉదంతాలని తెలిపారు.

జస్టిస్‌ నారిమన్‌ శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధానికి వ్యతిరేకంగా డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బిబిసిని ఐటి దాడులతో వేధింపులకు గురిచేశారని చెప్పారు. మీడియాపై జరుగుతున్న దాడులను కూడా ఆయన ప్రస్తావిస్తూ ‘మీడియాపై దాడుల విషయంలో న్యాయస్థానాలు జాగరూకతతో వ్యవహరించాలి. స్వతంత్ర మీడియా ఏదో ఒక విషయాన్ని బయటపెడితే ఆ సంస్థపై ఆదాయపన్ను అధికారులు దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం’ అని అన్నారు. మీడియాను నిర్వీర్యం చేస్తే ఇంకేం మిగులుతుందని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్నికల కమిషన్‌ బిల్లుపై కూడా నారిమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఓ చట్టాన్ని చేసే వరకూ ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇతర కమిషనర్లను ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని అంటూ సిజెఐ స్థానంలో కమిటీలో కేంద్ర మంత్రిని చేరుస్తూ బిల్లు ప్రవేశపెట్టడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

‘ఈ విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇతర కమిషనర్లను ఎంపిక చేస్తే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడమనేది ఓ ఫార్సుగా మారుతుంది. ఇది ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను దెబ్బతీస్తుంది. ఇలాంటి చట్టాలను కోర్టులు తోసిపుచ్చాలి’ అని అన్నారు. తన వద్దకు ప్రభుత్వం పంపిన బిల్లులను కేరళ గవర్నర్‌ ‘హోల్‌సేల్‌’గా రాష్ట్రపతికి పంపడాన్ని జస్టిస్‌ నారిమన్‌ తప్పుపట్టారు. ఇలాంటివి జరిగినప్పుడు రాష్ట్ర పాలనా వ్యవస్థ స్తంభించిపోతుందని అన్నారు. ‘సంప్రదాయకంగా మైనారిటీలు అధిక సంఖ్యలో నివసించే రాష్ట్రం కేరళ. గవర్నర్‌ 23 నెలల పాటు బిల్లులను తన వద్దే అట్టి పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు మందలించినప్పుడు ఆయన ఏం చేశారు? అలాంటి బిల్లులు ఎనిమిది ఉంటే ఒక దానిని ఆమోదించి, ఏడింటిని రాష్ట్రపతికి నివేదించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా వ్యవహరించే వారినే గవర్నర్లుగా నియమించాలని సుప్రీంకోర్టు సూచించే రోజు కోసం ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు.

  • ఫెడరలిజంపై తీవ్ర ప్రభావం

ఆర్టికల్‌ 370 రద్దును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫెడరలిజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని జస్టిస్‌ నారిమన్‌ అభిప్రాయపడ్డారు. ‘అప్పటికే రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రాన్ని విభజించడం వెనుక కీలకమైన ఉద్దేశం ఉంది. రాష్ట్రపతి పాలనను సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగించరాదన్న ఆర్టికల్‌ 356 లోని ఓ క్లాజును నీరుకార్చడమే దీని ఉద్దేశం. సుప్రీంకోర్టు తన నిర్ణయంలో కీలక ప్రశ్నను వదిలేసింది. జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని సొలిసిటర్‌ జనరల్‌ ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకుంది. ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చే అధికారం సొలిసిటర్‌ జనరల్‌కు లేదు. శ్రేయా సింఘాల్‌ కేసులో ఇచ్చిన తీర్పులో అలాంటి హామీని నేను అంగీకరించలేదు’ అని నారిమన్‌ వివరించారు.

  • నాలుగు సంవత్సరాల సమయం ఎందుకు?

ఆర్టికల్‌ 370పై నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు సుమారు నాలుగు సంవత్సరాల సమయం తీసుకోవడాన్ని కూడా నారిమన్‌ తప్పుపట్టారు. 2019లో కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, అప్పుడే కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని, ఆ సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూడా లేదని ఆయన గుర్తు చేశారు.

➡️