ట్రక్‌ డ్రైవర్ల వెతలు తీరేనా…? .. వేతనాలు పెరిగేనా…?

Dec 27,2023 08:12 #Editorial

డిసెంబర్‌ 10 తేదీన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్లో ట్రక్‌ డ్రైవర్లకు మెరుగైన వాతావరణం కల్పించాలనే దష్టితో 2025సం. నుండి నూతనంగా తయారుచేసే యన్‌2, యన్‌ 3 ట్రక్కుల డ్రైవర్‌ కేబిన్లో ఎయిర్‌ కండిషన్‌ తప్పనిసరిగా ఉండాల్సిందేని స్పష్టం చేసింది. దీనివలన వేడి వాతావరణంలో పనిచేసే డ్రైవర్లకు అలసట తగ్గి మరింత పని సామర్థ్యం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది చాలా మంచి నిర్ణయం. దేశ రవాణాలో డ్రైవర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశంలో 80 లక్షలకు పైగా ట్రక్‌ డ్రైవర్లు ఉన్నారు. వ్యవసాయ రంగం తరువాత మనదేశంలో అత్యధిక ఉపాధిని కల్పిస్తున్న రంగం రవాణా రంగం. భారత ట్రక్కింగ్‌ పరిశ్రమ, దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క శక్తి కేంద్రంగా ఉంది. జి.డి.పికి 6 శాతానికి పైగా దోహదం చేస్తుంది మరియు మిలియన్ల మందికి జీవనోపాధిని అందిస్తుంది. డ్రైవర్లు చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారికి ఆహారము, నిద్ర, విశ్రాంతి తీసుకోడానికి తగు సమయం దొరకడం లేదు. డ్రైవింగ్‌ సమయంలో వారు నడుపుతున్న ట్రక్కే వారికి ఇల్లు. ఇంకా జాతీయ రహదారుల్లో ట్రక్కుల డ్రైవర్లు చాలా సవాళ్ళను ఎదుర్కుంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించి వాళ్లకి నాణ్యమైన డ్రైవింగ్‌ అనుభవాన్ని, జీవితంపై భరోసా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. 2022 నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం, భారతదేశం తన దేశీయ సరుకులో 70% రోడ్డు మార్గం ద్వారా రవాణా చేయబడుతుంది. భారతీయ రహదారులపై తిరుగుతున్న ట్రక్కుల సంఖ్య 2022లో 4 మిలియన్ల నుండి 2050 నాటిడిసెంబర్‌ 10 తేదీనకి 17 మిలియన్లకు చేరుకుందని నివేదికలు చెబుతున్నాయి. 2.2 ట్రిలియన్‌ టన్నుల-కిమీగా ఉన్న ఈ ప్రస్తుత డిమాండ్‌ 2050 నాటికి నాలుగు రెట్లు అనగా 9.6 ట్రిలియన్‌ టన్నుల-కిమీకి పెరుగుతుందని అంచనా. భారతదేశంలో 2.8 మిలియన్ల ట్రక్కులు సంవత్సరానికి 100 బిలియన్‌ కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తాయి. ట్రక్కులు వాల్యూమ్‌ ప్రకారం రహదారి వాహనాలలో 2 శాతం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

ఎదుర్కొంటున్న సవాళ్లు

ఏది ఏమైనప్పటికీ, ఈ అభివద్ధి చెందుతున్న రంగం సంక్లిష్టమైన సవాళ్ల శ్రేణిని ఎదుర్కొంటున్నది. ప్రతి ఒక్కటి పరిష్కారానికి ప్రత్యేకమైన విధానాన్ని కోరుతుంది. జాతీయ రహదారులలో ప్రయాణం చేస్తున్న ట్రక్‌ డ్రైవర్లు సరుకులను తక్కువ కాలంలో సుదూర ప్రాంతానికి చేర్చాలని ఒత్తిడి ఉంటుంది. దీని మూలాన రోజులో ఎక్కువ గంటలు డ్రైవింగ్‌ చేయవలసి ఉంటుంది. ఈ కారణాన్న వాహన వేగాన్ని పెంచుతారు. చాలా మంది డ్రైవర్లు రోజుకు 14 గంటల వరకు డ్రైవింగ్‌ చేస్తున్నట్లు కొన్ని పరిశోధనలో తేలింది. ప్రమాదాలు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గణాంకాలు చూస్తే భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు 2022 వార్షిక నివేదక ప్రకారం 2022 లో మొత్తం రోడ్డు ప్రమాదాలలో 32.9 శాతం (1,51,997) మరియు మొత్తం మరణాలలో 35.7 శాతం (55,571) జాతీయ రహదారుల పైనే జరిగాయి. నాన్‌స్టాప్‌ ట్రావెల్‌ కారణంగా 50% ట్రక్‌ డ్రైవర్లు డ్రైవింగ్‌ సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. టైం లేకపోవడం లేదా వారికి అలవాటైన భోజనం దొరకక 70 శాతం కంటే ఎక్కువ మంది డ్రైవర్లు వేళకి ఆహారం తీసుకోవడం లేదు. ఇంకా ఊబకాయం, మస్క్యులోస్కెలెటల్‌ (ఎముకలు మరియు కండరాలు) సమస్యలు , అధిక రక్తపోటు, నిద్రలేమి, అధిక ఒత్తిడి స్థాయిలు, డీ హైడ్రేషన్‌ మొదలగు ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. చాలా మంది నిరక్షరాస్యులు కావడం వలన స్థానిక భాష తెలియకపోవడం వలన అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. ప్రయాణం మధ్యలో అనారోగ్యానికి గురైతే ఆర్థిక పరిపుష్టి లేక సరైన వైద్యసేవలు పొందలేక పోతున్నారు. వాహనాలు మోరాయించినా, ప్రమాదాలకు గురైనా చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. కొన్ని మార్గాలలో దారి దోపిడీలు కూడా జరుగుతున్నాయి. ట్రక్కులలో సరుకును అపహరించుకు పోతున్నారు. దోపీడీ దారులకు అడ్డు తగిలితే డ్రైవర్లను హత్యలు కూడా చేయడానికి వెనుకాడడం లేదు. స్థానిక మద్దతు లభించడం లేదు. డ్రైవర్లు చాలా కాలం ఇంటికి దూరం కావడం వలన మానసిక అనారోగ్యానికి కూడా గురగుచున్నారు. ఇంకా అవాంఛిత లైంగిక కార్యక్రమాల వలన సుఖవ్యాధులు లేదా ఎయిడ్స్‌ వచ్చే అవకాశం ఉంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు నెలవారీ జీతాలు ఉండవు. ట్రిప్లు వెళ్లిన రోజులకు మాత్రమే వేతనాలు పొందుతున్నారు. వీళ్లు కుటుంబాన్ని పోషించుకోలేక పోతున్నారు. దీని మూలాన యువత ఈ రంగాన్ని శాశ్వత ఉపాధి మార్గంగా ఎంచుకోడానికి వెనుకాడుతున్నారు. మన దేశంలో ట్రక్‌ డ్రైవర్‌ సగటు జీతం సంవత్సరానికి ?3,14,600 (నెలకు ?17,040), ఇది భారతదేశంలోని జాతీయ సగటు జీతం కంటే ?72,900 (-19%) తక్కువ. ఈ రంగంలో అధికారికీకరణ ఇప్పటికీ పరిపక్వ స్థాయిలలో లేనందున, ట్రక్కింగ్‌ యొక్క వాంఛనీయ సామర్థ్య వినియోగం కోసం నాణ్యమైన డ్రైవర్ల లభ్యత కూడా ఇటీవలి కాలంలో ఈ రంగాన్ని వేధిస్తుంది. భారతదేశంలో డ్రైవర్‌-టు-ట్రక్‌ నిష్పత్తి ఇప్పటికీ 1000కి 750 కంటే తక్కువగా ఉంది. ఇది భారతదేశంలోని 25% నుండి 30% ట్రక్కులు కొన్ని సమయాలలో డ్రైవర్లు లేకపోవడం వలన ఖాళీగా ఉండిపోతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం వీరికి నెలవారీ జీతం వచ్చేటట్టుగా ట్రక్‌ యజమానులను ఒప్పించాలి. కనీస వేతనం అమలయ్యేటట్లు చూడాలి. హైవే పెట్రోలింగ్‌ పెంచి దారి పొడవునా వీరు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలి. డ్రైవర్లు కోసం రాత్రి పూట నిద్రించేందుకు వసతి సౌకర్యం ఏర్పాట్లు చేయాలి. హైవే ప్రక్కన ప్రతీ 400 కిలో మీటర్లుకు ప్రత్యేకంగా వీరికోసం ఆసుపత్రులు ను నెలకొల్పాలి. ప్రతీ ఒక్క డ్రైవర్‌ ప్రమాద బీమా పరిధిలోకి వచ్చేటట్లు చేయాలి. ఇవన్నీ ఒకే రోజున జరిగే పనులు కావు. క్రమ క్రమంగా డ్రైవర్లకు సౌకర్యాలు కల్పిస్తే మరింత నాణ్యమైన సేవలను పొందగలం.

– జనక మోహన రావు దుంగ 8247045230

➡️