అందరికీ వైద్య బీమా ఎండమావే!

Apr 12,2024 06:16 #India, #Medical Insurance, #PMJAY
  •  లక్ష్యం చేరని పిఎంజెఎవై
  •  కేంద్రానికి ప్రచారం..రాష్ట్రాలపై పెను భారం
  •  లోపాలపై గతంలోనే నిలదీసిన కాగ్‌

న్యూఢిల్లీ: దేశంలో వైద్య సేవల ఖర్చు భరించలేనంతగా పెరిగిపోతోంది. పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధి వచ్చిందంటే ఇక అంతే సంగతులు. వైద్య బీమా ఉంటే సరేసరి. లేకుంటే…ఆ ఖర్చు తడిసిమోపెడవుతుంది. జేబులు ఖాళీ అవుతాయి. ఆస్పత్రి బిల్లులు కట్టేసరికి తల ప్రాణం తోకకు వస్తుంది. అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. చివరికి కుటుంబాలు రోడ్డు మీద నిలబడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. దేశ ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తామంటూ ప్రచార బాకాలూదుతూ కేంద్రంలోని మోడీ సర్కార్‌ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పిఎంజెఎవై) లబ్దిదారుల దరి చేరడం లేదు.
2018 నాటికి పట్టణాలలో 19.1 శాతం, గ్రామాలలో 14.1 శాతం మందికి మాత్రమే వైద్య బీమా ఉంది. అంటే 80 శాతానికి పైగా ప్రజలు ఆస్పత్రి బిల్లులు చెల్లించాల్సిందే. ఈ నేపథ్యంలోనే పిఎంజెఎవై తీసుకొచ్చారు. దేశంలోని 15.5 కోట్ల పేద కుటుంబాలకు ఆస్పత్రి సేవలను అందిస్తామని ఘనంగా ప్రచారం దట్టించారు. దేశ జనాభాలో చివరి స్థానంలో ఉన్న 60 కోట్ల మంది లబ్దిదారులకు దీని ద్వారా ప్రయోజనం చేకూర్చడం లక్ష్యం. ఈ పథకం కింద సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకూ వైద్య బీమా కవరేజీ లభిస్తుంది. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఆరోగ్య బీమా పథకాలలో ఇదే అతి పెద్దదిగా మోడీ సర్కార్‌ ప్రచారం చేసుకుంది. కానీ ఆచరణలో ఎండమావిని తలపిస్తోంది.

40 కోట్ల మందికి బీమా లేదు
పథకంలో అనేక లోపాలు కన్పిస్తున్నాయి. దేశంలో ఔట్‌ పేషెంట్లుగా చికిత్స పొందుతున్న 40 నుండి 80 శాతం మందికి ఈ పథకం వర్తించడం లేదు. ఈ పథకం కింద చాలా రాష్ట్రాలలో వైద్యానికి అయ్యే ఖర్చులో 60 శాతం వరకూ కేంద్రమే భరించాల్సి ఉంటుంది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకాశ్మీర్‌, ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం ఖర్చులో కేంద్రం 90 శాతం వరకూ చెల్లించాలి. కొన్ని చోట్ల అయితే కేంద్ర ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరించాలి. వాస్తవానికి కేంద్రం చెల్లిస్తున్న వైద్య ఖర్చులు చాలా తక్కువగానే ఉంటున్నాయి. రాష్ట్రాలపైనే భారం ఎక్కువగా పడుతోంది. ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ ఇంకా 40 కోట్ల మందికి వైద్య బీమా లభించపోవడం గమనార్హం.

కేంద్రం ఇచ్చింది 28శాతం మాత్రమే
ఈ పథకం ప్రస్తుతం 23 రాష్ట్రాలలో అమలవుతోంది. రాష్ట్ర స్థాయిలో తమకు వేరే ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయన్న కారణంతో పశ్చిమ బెంగాల్‌, ఒడిషా, ఢిల్లీ రాష్ట్రాలు ఇందులో చేరలేదు. బడ్జెట్‌ ప్రకారం 2019 నుండి 2023-24 వరకూ కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఆస్పత్రి అడ్మిషన్ల కోసం రూ.23,575.89 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి రూ.15,712,26 కోట్లు సమకూర్చాయని అంచనా. అయితే ప్రభుత్వ గణాంకాలు మరోలా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 2వ తేదీ నాటికి ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రూ.80,000 కోట్లు ఖర్చు చేశామని పిఎంజెఎవై డాష్‌బోర్డు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన ప్రీమియం కంటే ఇది రెండు రెట్లు అదనం. మొత్తం వ్యయం రూ.80,000 కోట్లలో కేంద్రం ఇచ్చింది రూ.23,575 అయితే మిగిలింది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భరించినట్లే కదా. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే పిఎంజెఎవై కింద రాష్ట్రాలు 72శాతం సమకూర్చితే కేంద్రం విదిల్చింది కేవలం 28శాతం మాత్రమే.

లబ్దిదారుల ఎంపిక రాష్ట్రాలదే
ఆరోగ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశమే. అందులో సందేహం ఏమీ లేదు. అయితే ఇప్పటికే నిధుల పంపిణీ విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఆర్థికపరమైన సమస్యలు, వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పిఎంజెఎవై పథకం రాష్ట్రాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతోంది. పథకంలో ఎంతమంది లబ్దిదారులనైనా రాష్ట్రాలు చేర్చవచ్చు. ఇందులో కేంద్రం ప్రమేయం ఉండదు. లబ్దిదారుల ఎంపిక విషయంలో రాష్ట్రాలు వేర్వేరు సమాచారాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఇరవై రాష్ట్రాలు 2011 నాటి జనగణన లేదా ఎస్‌ఈసీసీ వివరాలను ఆధారంగా చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు తమ పౌర సరఫరాల విభాగాలు అందించిన సమాచారంపై ఆధారపడ్డాయి. జార్ఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాలు ప్రజా పంపిణీ వ్యవస్థ గణాంకాలను ప్రామాణికంగా తీసుకున్నాయి. పుదుచ్చేరి, ఉత్తరాఖండ్‌, లఢక్‌ వంటి కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రం నిర్దేశించిన లక్ష్యాల కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా లబ్దిదారులను ఎంపిక చేశాయి. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా వంటి రాష్ట్రాలు లక్ష్యాల కంటే 25శాతం అదనంగా లబ్దిదారులను ఎంపిక చేసుకున్నాయి. చాలా రాష్ట్రాలు మాత్రం లక్ష్యాలకు అనుగుణంగానే వ్యవహరించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు తమకు లక్ష్యంగా నిర్దేశించిన లబ్దిదారుల సంఖ్యలో 32-80 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశాయి.

కార్డుల జారీలో…
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పథకానికి విశేష ప్రాచుర్యం కల్పించి పేదలు, మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో పిఎంజెఎవై కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. చాలా రాష్ట్రాలు మాత్రం దీనిపై పెద్దగా ముందడుగు వేయడం లేదు. 19 రాష్ట్రాలు జాతీయ స్థాయి (57.46శాతం) కంటే ఎక్కువగా 31 కోట్ల కార్డులు జారీ చేశాయి. 14 రాష్ట్రాలు జాతీయ స్థాయి కంటే తక్కువగానే కార్డులు ఇచ్చాయి. వీటిలో కేరళ, తమిళనాడు, కర్నాటక ఉన్నాయి. రాష్ట్ర స్థాయి పథకాలలో ఎక్కువ మంది లబ్దిదారులను చేర్చిన ప్రభుత్వాలు, పీఎంజేఏవై లక్ష్యం కంటే తక్కువగానే కార్డులు జారీ చేశాయి. బీహార్‌ రాష్ట్రంలో కేవలం లక్ష్యంలో 13శాతం మాత్రమే కార్డులు జారీ అయ్యాయి.

అందుబాటులో సుమారు 30 వేల ఆస్పత్రులు
పిఎంజెఎవై పథకం కింద వైద్య సేవలు పొందడానికి 17,135 ప్రభుత్వ, 12,626 ప్రైవేటు (మొత్తం 29,761) ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఒక్కో ఆస్పత్రిలో సగటున 48 బెడ్లు ఉన్నాయి. అంటే పథకం కింద వైద్య సేవలు పొందుతున్న 31.63 కోట్ల మందికి 14.28 లక్షల బెడ్లు అందుబాటులో ఉన్నాయన్న మాట. ఈ సంఖ్య తక్కువే అయినప్పటికీ జాతీయ సగటు (వెయ్యి మందికి 0.6 బెడ్లు) కంటే మాత్రం ఎక్కువే. జాతీయ స్థాయిలో ప్రతి లక్ష మంది లబ్దిదారులకు 9.41 ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి. అయితే కేరళ వంటి 12 రాష్ట్రాల్లో జాతీయ స్థాయి కంటే తక్కువ సంఖ్యలోనే ఆస్పత్రులు ఈ పథకం కింద వైద్య సేవలు అందజేస్తున్నాయి. రాష్ట్రాల మధ్య మాత్రమే కాదు…రాష్ట్రంలోని కొన్ని జిల్లాల మధ్య కూడా ఆస్పత్రుల కేటాయింపు సరిగా జరగలేదు.

అవగాహనా లోపంతో…
ఈ పథకం కింద ప్రతి వెయ్యి మంది లబ్దిదారుల్లో సగటున సుమారు 160 మంది వైద్య సేవలు పొందుతున్నారు. అయితే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రాల్లో వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్య జాతీయ సగటు (ప్రతి వెయ్యి మందికి 29 మంది) కంటే తక్కువగా ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించకపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమంటే పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువ సంఖ్యలో ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు.

కాగ్‌ అక్షింతలు
పథకం అమలులో అవకతవకలను, లోపాలను గత సంవత్సరం ఆగస్టులో కాగ్‌ ఎత్తిచూపింది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరికరాలు, వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని చోట్ల వైద్య పరికరాలు పనిచేయడం లేదు.
అనేక ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను, ప్రమాణాలను పాటించడం లేదు. ఆస్పత్రులు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. అనేక చోట్ల ఫిర్యాదులను పరిష్కరించే నాథుడే లేడు. వ్యాధులకు ప్రత్యేక చికిత్స అందజేస్తున్న దాఖలాలు లేవు. ఒకే ఫోన్‌ నెంబరు లేదా పనిచేయని నెంబరుతో అనేకమంది లబ్దిదారుల పేర్లను రిజిస్టర్‌ చేశారు. ఎంపికకు ముందు ఆస్పత్రులను తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది లభ్యతపై సంతృప్తి చెందాల్సి ఉంటుంది. అయితే మూడు రాష్ట్రాలలో ఈ నిబంధనను పాటించలేదు. ఇక వైద్య సేవలకు అయ్యే ఖర్చుకు, బీమా కవరేజీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ తేడా 73 శాతం వరకూ ఉంటోందని అంచనా. దీంతో లబ్దిదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దేశ జనాభాలో 30శాతం మందికి (40 కోట్లు) ఈ పథకం అందుబాటులో లేదని సాక్షాత్తూ నీతి ఆయోగ్‌ సంస్థే చెప్పింది.

అంతులేని అక్రమాలు
కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో రిజిస్ట్రేషన్‌ నడిచే ఈ పథకంలో అక్రమాలు అంతులేకుండా పోయాయి. గతేడాది ఆగస్టులోనే కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదించింది. 7,49,820 మంది లబ్ధిదారులు ఒకే బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ (బిఐఎస్‌)లో ఒకే మొబైల్‌ నంబరుతో అనుసంధానించినట్లు కాగ్‌ పరిశీలనలో వెల్లడైంది. ఈ పథకం అసలైన లబ్దిదారులకు కాకుండా అక్రమార్కుల కోసమే తీసుకొచ్చినట్లు కనిపిస్తోందని అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగ్‌ లేవనెత్తిన లోపాలను సరిదిద్ది పేదలందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్‌ చేశాయి. కానీ మోడీ సర్కార్‌ పట్టించుకున్న పాపాన పోలేదు.

➡️