విద్యుత్‌ సంస్థల్లో కొత్త సర్వీస్‌ రూల్స్‌

  • పాత వివాదం మరోసారి తెరపైకి
  • ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు వర్తింపు
  • ప్రభుత్వానికి సిపిడిసిఎల్‌ సిఎండి లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో కొత్త నిబంధనలు తీసుకురానున్నట్లు తెలిసింది. గతంలో పక్కన పెట్టిన నూతన సర్వీస్‌-2021 రూల్స్‌ను ఆంద్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎపిసిపిడిసిఎల్‌) మరలా తెరపైకి తీసుకొచ్చింది. వీటికి ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. కొత్త సర్వీస్‌ రూల్స్‌ ప్రకారమే నియామకాలు చేపట్టాలని లేఖలో పేర్కొంది. ఈ నిబంధనలు ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయని, వేతనాలు తగ్గించేలా ప్రతిపాదనలు చేశారని విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటి వరకు విద్యుత్‌, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇతర నిబంధనలు విడిగా ఉన్నాయి. పిఆర్‌సి విద్యుత్‌ ఉద్యోగులకు నాలుగేళ్లకొక్కసారి ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకొకసారి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని నియమ, నిబంధనలతో పాటు వేతనాలూ వారికి వర్తించే విధంగా రూల్స్‌ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అదే విధంగా పిఆర్‌సి ఇక నుంచి ఐదేళ్లకొకసారి వర్తింప జేసేలా నిబంధనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం విద్యుత్‌ సంస్థల్లో డిప్లొమా అర్హతతో టెక్నీషియన్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల్లో 5వస్థాయిలో అభ్యర్ధుల నియామకం జరుగుతోంది. ఏడేళ్ల తరువాత జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా వీరికి పదోన్నతి ఉంటుంది. ఈ పోస్టును ఇప్పుడు జూనియర్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌-2 పేరుతో కారుణ్య నియామకం ద్వారా గానీ, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో గానీ నియమిస్తుంది. ఈ పోస్టులకు జూనియర్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌-1 పదోన్నతి ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఎఇఇ) పోస్టులను డిగ్రీ, బిటెక్‌ అభ్యర్థులతో నియామకం ఉంటుంది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌ సూపరింటెండెం ట్‌ చీఫ్‌ ఇంజనీర్లుగా పదోన్నతి పొందుతారు. కొత్త రూల్స్‌ ప్రకారం ఎఇఇ పోస్టులను అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌-2గా మార్చింది. పదోన్నతి ద్వారా వీరు అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌-1, మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు అవుతారు. 2022 జనవరి 7వ తేదీన బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్‌ శాఖమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణపట్నం ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంతో పాటు సర్వీస్‌ రూల్స్‌ అంశంపై కూడా విద్యుత్‌ ఉద్యోగుల జెఎసితో చర్చించారు. ఆ సమయంలోనే ఉద్యోగుల జెఎసి ఈ రూల్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో బాలినేని కొత్త సర్వీస్‌ రూల్స్‌ను అమలు చేయొద్దని వీటిని పక్కన పెట్టాలని డిస్కంలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు వీటిని ఆమోదించాలని సిపిడిసిఎల్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది.

ఇంజనీర్లను విభజించొద్దు: ఎపిఎస్‌ఈబిఎఇఇకొత్త రెగ్యులేషన్స్‌ ప్రవేశపెట్టి ఇంజనీర్లను విభజించి సమస్యలను సృష్టించాలని చూస్తే సహించబోమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతిలోనే నియామకాలు జరపాలని ఎంవిఆర్‌ ఆర్‌టిపిపిలో శనివారం జరిగిన అసోసియేషన్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. జెన్‌కోలో 450, డిస్కమ్‌లలో 400, డిస్కమ్‌లో 350 చొప్పున ఎఇఇ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని త్వరగా భర్తీ చేయాలని డిమాండ్‌ చేసింది.

➡️