అనర్హుల చేతుల్లో పాస్‌ పుస్తకాలు !

Dec 15,2023 09:48 #hands, #ineligible, #Pass books
  • బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రుణాలు
  • భూముల రీసర్వేతో వెలుగులోకి..
  • అనంతపురం, కడప, చిత్తూరు, విశాఖలో అత్యధికం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భూముల రీసర్వేతోపాటు అధికారుల క్షేత్రస్థాయి పర్యటనల నేపథ్యంలో జరిపిన సమీక్షలతో అనర్హుల చేతుల్లోని పాస్‌ పుస్తకాల గుట్టు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వ్యక్తులు పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొంది ప్రభుత్వపరంగా సబ్సిడీలు, రాయితీలు, బ్యాంకుల్లో రుణాలు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. వేలాది పాస్‌ పుస్తకాలు అనర్హుల చేతుల్లో ఉన్నట్లు తెలుసుకున్న అధికారులు ఏమి చేయాలో తోచక తలలు పట్టుకు కూర్చున్నారు. అనంతపురంలో 70 వేలు, కడపలో లక్షకు పైగా సత్యసాయి, చిత్తూరు, విశాఖపట్నంలో వాటి తర్వాత స్ధానాల్లో నిలవగా మిగిలిన జిల్లాల్లో కూడా అనర్హుల చేతుల్లో నకిలీ పాస్‌ పుస్తకాలు ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం చేసిన తప్పులకు అసలైన భూ యజమానులు ఇప్పటి వరకు యాజమాన్య హక్కులు పొందలేని పరిస్థితి ఏర్పడింది. భూముల రీ సర్వేతో గ్రామీణ ప్రాంతాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి అధికారుల దెబ్బకు సెంటు భూమి లేనివారికి కూడా ఎకరాల్లో స్థలాలు ఉన్నట్లు పాస్‌ పుస్తకాలు వచ్చాయి. దీంతో గ్రామాల్లో ఘర్షణలు, తగాదాలు, కోర్టులను ఆశ్రయించేవారు అధికమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. భూ యజమానులు కాని వ్యక్తులకు పాస్‌ పుస్తకాలు ఇచ్చిన వారిని గుర్తించి వారికి నోటీసులిచ్చి తప్పులను సవరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. అనర్హుల పేర్లను రెవెన్యూ రికార్డుల్లోంచి తొలగించాలని సూచించింది. అయితే అది ఆచరణలో సాధ్యమవుతుందా? లేదా? అనే అంశం రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

పాస్‌ పుస్తకాలతో పెద్దయెత్తున బ్యాంకు రుణాలు

క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిని మేనేజ్‌ చేసి పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందినవారు పెద్దయెత్తున బ్యాంకుల్లో క్రాప్‌ రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు దశాబ్దాలుగా లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఆయా భూములను అమ్మడం, తనఖా పెట్టడం జరిగింది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం భూ యజమానులు బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడంతో అటువంటి వారి భూములను సొంతం చేసుకున్నారు. అధికారులను మేనేజ్‌ చేసి పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందడంతోపాటు వెబ్‌ ల్యాండ్‌లో పేరు నమోదు చేయించుకున్నారు. రీ సర్వేలో భూ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

ఎన్నికల ఏడాదిలో సాహసం చేస్తారా ?

రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు కేవలం మూడు, నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఈ సమయంలో భూములు సాగు చేసుకుంటూ పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన వ్యక్తుల పట్టాలు రద్దు చేసి అసలైన భూ యజమానుల పేర్లు వెబ్‌ల్యాండ్‌ నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు ముందుకు వెళతారా! లేక కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చి చేతులు దులుపు కుంటారా అనేది తేలాల్సి ఉంది.

➡️