పెద్దన్న …ఒక ధిక్కార స్వరం !

Jan 27,2024 07:12 #Editorial

రాయలసీమలో పెద్దన్నగా పేరుగాంచిన ఒక ధిక్కార స్వరం, పీడిత ప్రజల పెద్ద గొంతుక జనవరి 14వ తేదీన 76 సంవత్సరాల వయసులో మూగబోయింది. పీడిత ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ, కడ వరకూ ప్రజాందోళన కార్యక్రమాలలో భాగస్వామి అయిన ‘ఉద్యమాల పెద్దన్న’ ఇకలేరు. సామాజికంగా అణచివేతకు గురయ్యే రజక వృత్తిజేసే కులంలో జన్మించిన పెద్దన్న, సిపిఐ (ఎం-ఎల్‌) రాష్ట్ర కమిటీ సభ్యునిగా, పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శిగా, రీజనల్‌ కమిటీ సభ్యునిగా పలు ముఖ్యమైన బాధ్యతలను పెద్దన్న నిర్వహించారు. ఏఐఎఫ్‌ టియు (న్యూ) కేంద్ర కార్యవర్గ సభ్యునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా చివరి వరకు బాధ్యతలు నిర్వహించారు. 1998లో పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయాలనే పార్టీ ఆదేశానుసారం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన పెద్దన్న, తదనంతర కాలంలో పూర్తికాలం కార్యకర్తగా పార్టీ కార్యక్రమాలలో నిమగమయ్యారు.

పెద్దన్న మంచి గుర్తింపు కలిగిన కళాకారుడు. యువజన సంఘం కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అనంతపురం కేంద్రంగా రాజకీయ కృషిలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. 1974లో యువజన కాలనీ ఏర్పాటు నుంచి, ముఖ్యంగా అనంతపురం పట్టణంలో పలు కాలనీల నిర్మాణానికి గట్టి కృషి చేశారు. ఈ క్రమంలో పెత్తందార్ల, రౌడీల, పోలీసుల దాడులను, కేసులను ఎదుర్కొన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో అరెస్టయి, జైలు నిర్బంధానికి గురయ్యారు.

విప్లవ కార్మికోద్యమ నాయకునిగా అనంతపురంలో అసంఘటిత రంగంలోని హమాలీలు, ఆటోడ్రైవర్లు, విద్యుత్‌ కార్మికులు, ఆయిల్‌ ఫెడ్‌ మొదలైనవారిని యూనియన్లలోకి సంఘటితం చేసే కృషి జరిపారు. పంచాయితీరాజ్‌ శాఖలోని పంప్‌ మెకానిక్‌లను రాష్ట్ర వ్యాపిత సంఘంగా సమీకృతం చేశారు. తెలుగు గంగ హెచ్‌.ఆర్‌ కార్మికులను సంఘంగా ఏర్పరచి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి సాగించి విజయం సాధించారు.

శ్రోత్రియం భూముల సమస్య, ఈనాం భూములు, కణేకల్లులో పేదల ఇళ్ళ నిర్మాణం, రాయదుర్గం చేనేత కార్మికుల సమస్యలు, భగత్‌సింగ్‌ కాలనీ నిర్మాణం తదితర అంశాలలో తిమ్మారెడ్డి గారితో కలిసి జిల్లా ఉద్యమ నిర్మాణంలో పెద్దన్న భాగస్వాములయ్యారు. రాయలసీమ కరువు, ప్రజల దుర్భర స్థితిగతుల గురించి అన్ని వేదికలపైన పెద్దన్న స్పష్టంగా మాట్లాడేవారు.

బొమ్మనహళ్‌లో 1998లో పేద ప్రజలపై అక్కడి భూస్వామ్య, పెత్తందార్లు కిరాతకంగా సాగించిన హంతక దాడిని తీవ్రంగా ఖండించి బాధిత ప్రజలకు మద్దతునందించటంలో ముందున్నారు. రాష్ట్రంలోని కొండమొదలు, దుగ్గేరు, మునుగోపుల, పల్నాడు రైతాంగ ఉద్యమాలపై నిర్బంధం, నాయకుల హత్యలను ఖండించటమేగాక, ప్రత్యక్షంగా ఆ ఉద్యమ ప్రజానీకాన్ని కలిసి వారికి ధైర్యాన్నందించారు. కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో బ్యాంకుల వడ్డీ దోపిడీలను నిరసిస్తూ రైతులు సాగిస్తున్న ఉద్యమాలకు అండగా నిలిచారు.

టి.ఎన్‌. మెమోరియల్‌ ట్రస్టుకు పెద్దన్న కొంత కాలం కార్యదర్శిగా పనిచేశారు. 1970లలో కా||నాగిరెడ్డి ఆధ్వర్యంలో యువకునిగా తమ చేతుల నుండి వెలువడిన ‘జనశక్తి’ పత్రిక పట్ల అదే మమకారాన్ని, అనుబంధాన్ని ప్రదర్శించేవారు. నాగిరెడ్డి అమరులైన తర్వాత క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జులై 28న ఆయన వర్ధంతిని పెద్దన్న నాయకత్వంలో ఒక రాజకీయ కార్యక్రమంగా జరపటం గొప్ప విషయం. అలాగే 2017లో తరిమెల నాగిరెడ్డి శత జయంతి సందర్భంగా పార్టీ నాయకత్వాన తరిమెలలో, అనంతపురంలో జరిగిన కార్యక్రమాల పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు.రెండు మూడు సంవత్సరాలుగా పెద్దన్నను అనారోగ్యం వెంటాడుతున్నా కడదాకా ప్రజా కార్యక్రమాలలో మనోధైర్యంతో పాల్గొంటూనే వున్నారు. అంగన్‌వాడీల దీర్ఘకాల ఆందోళనకు తీవ్ర అనారోగ్యంలోనూ స్వయంగా వెళ్ళి మద్దతునందించి వచ్చారు. పార్టీలో, కుటుంబంలో ఒడిదుడుకుల నడుమ మార్క్సిజం పట్ల, పార్టీ నాయకత్వం పట్ల దృఢమైన విశ్వాసంతో ఆఖరి శ్వాస వరకు కొనసాగిన పెద్దన్నకు విప్లవ జోహార్లు తెలియజేస్తూ, ఆయన జీవితాన్ని అంకితం చేసిన ఆశయాల సాధన కోసం విప్లవ దీక్షతో ముందుకు సాగుదాం !

– ముప్పాళ్ళ భార్గవశ్రీ, సిపిఐ ఎంఎల్‌ నాయకులు, సెల్‌ : 9848120105.(28న అనంతపురం రజక నగర్‌లో పెద్దన్న సంస్మరణ సభ)

➡️