రమేష్‌ ఎన్నికల బాండ్ల మాయ

Mar 18,2024 07:01 #BJP, #Bonds Scam, #Electoral, #Ramesh
  • హిమాచల్‌లో ‘రుత్విక్‌’కు డ్యామ్‌ కాంట్రాక్టు
  •  ఆ వెంటనే రూ.45 కోట్ల బాండ్లు కొనుగోలు
  •  త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ లావాదేవీలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి రాజ్యసభ ఎంపి సిఎం రమేష్‌ భారీ మొత్తంలో ఎన్నికల బాండ్ల కొనుగోలు చేయడం, ఆయన సదరు బాండ్లను కొనుగోలు చేసిన సమయం అనేక అనుమానాలకు తావిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక కీలకమైన జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణపనులను ఆయన తనయుడు సిఎం రిత్విక్‌ రమేష్‌ కీలక పాత్రదారిగా ఉన్న రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ (ఆర్‌పిపిఎల్‌) కైవసం చేసుకోవడం, ఆ తర్వాత ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన సంస్థలకు చెందిన కార్యాలయాల్లో సోదాలు జరపడం తదితర పరిణామాల నేపథ్యంలో సిఎం రమేష్‌కు చెందిన సంస్థలు భారీ మొత్తంలో ఎన్నికల బాండ్లు కొన్నారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వాటిని కొనుగోలు చేయడం విశేషం. హిమాచల్‌ ప్రదేశ్‌లో సున్నీ జలవిద్యుత్‌ ప్రాజెక్టు కోసం రూ.1,098 కోట్ల విలువైన నిర్మాణ పనుల కాంట్రాక్టును పొందిన కొద్ది రోజులకే రిత్విక్‌ సంస్థ రూ.5 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేశారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేయగా..ఆ తర్వాత మళ్లీ రూ.40 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్‌పిపిఎల్‌)లో రిత్విక్‌ రమేష్‌ ఆపరేషన్స్‌ ప్రెసిడెంట్‌గా కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. రిత్విక్‌ అనేది 1999 మార్చి 31న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్‌, అన్‌లిస్టెడ్‌ కంపెనీ. ఈ సంస్థకు 2023 జనవరి 14న సున్నీ డ్యామ్‌ నిర్మాణ పనుల కాంట్రాక్టు లభించింది.
రెండు విడతల్లో కొనుగోళ్లు
సున్నీ డ్యామ్‌ కాంట్రాక్టును పొందిన రెండు వారాల తరువాత, ఆర్‌పిపిఎల్‌ 2023 జనవరి 27న ఒక్కొక్కటి రూ.కోటి చొప్పున ఐదు బాండ్‌లను కొనుగోలు చేసింది. రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ 2023 ఏప్రిల్‌ 11న మరో విడత రూ.40 కోట్లు విలువ చేసే 40 బాండ్‌లను కొనుగోలు చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది జరిగింది.
ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సిసిఇఎ) 2023 జనవరి 4 రూ.2,614 కోట్ల సున్నీ డ్యామ్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ను ఆమోదించింది. పది రోజుల తరువాత రిత్విక్‌ ప్రాజెక్టులకు నిర్మాణ కాంట్రాక్టు లభించింది. ఆర్‌పిపిఎల్‌ తనను తాను ‘ప్రముఖ నిర్మాణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థగా పేర్కొంది. కంపెనీ దేశవ్యాప్తంగా జల విద్యుత్‌ ప్రాజెక్టులు, కాంక్రీట్‌ డ్యామ్‌లు, స్పిల్‌వేలు, సోలార్‌ ప్రాజెక్టులు, సొరంగాలు, నీటిపారుదల కాలువలు, వంతెనలు, హైవేలు, హౌసింగ్‌ కాలనీల నిర్మాణంలో గణనీయమైన పురోగతిని సాధించింది’ అని పేర్కొంది.
సున్నీ డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు
సున్నీ డ్యామ్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, మండి జిల్లాల్లో విస్తరించి ఉన్న సట్లెజ్‌ నదిపై నిర్మిస్తున్న రన్‌-ఆఫ్‌-ది-రివర్‌. తక్కువ పరిహారం, 2013 భూసేకరణ, పునరావాసం, పునరావాస చట్టం అమలు చేయకపోవడం, ప్రాజెక్టు స్థలంలో చెత్తాచెదారం 900 మీటర్ల పరిధికి మించి పడిపోవడం, పంట నష్ట పరిహారం చెల్లించడం, స్థానికులకు సైట్‌లో ఉద్యోగాలు తగినంతగా అందించకపోవడం వంటి వాటిని నిరసిస్తూ బాధిత గ్రామాల స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. 2023 డిసెంబరులో ప్రారంభమైన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. తమ భూములను పాక్షికంగా లేదా పూర్తిగా కోల్పోయిన 1,000 మందికి పైగా భూ యజమానులు తమ డిమాండ్‌లను నెరవేర్చకపోతే దేశవ్యాప్త రైతుల నిరసనలకు పిలుపునిచ్చేందుకు నిర్ణయించుకున్నారు.
చంద్రబాబుకు ఎంపి సిఎం రమేష్‌ సన్నిహితుడు. 2019 వరకు టిడిపిలో ఉన్నారు. 2014- 2018 మధ్య తెలంగాణ నుంచి పార్టీ రాజ్యసభ ఎంపిగా ఉన్నారు. ఆయన కంపెనీ అనేక ప్రధాన నీటిపారుదల, నిర్మాణ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందింది. ఆయన కుమారుడు రిత్విక్‌ రమేష్‌ కంపెనీ బోర్డులో ‘ప్రెసిడెంట్‌ ఆపరేషన్స్‌’ హోదాలో ఉన్నారు.
2003లో కంపెనీ ఆదాయం రూ.61 కోట్లు ఉన్న ప్రభుత్వ సబ్‌-కాంట్రాక్టర్‌ 2009లో రూ.488 కోట్లకు ఎలా పెరిగిందనే దానిపై సిబిఐ విచారణ కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును 2009లో వైఎస్‌ విజయలక్ష్మి ఆశ్రయించారు. రాజకీయ ప్రేరేపితమని కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
2018 అక్టోబరులో సిఎం రమేష్‌కు చెందిన రూ.100 కోట్ల విలువైన లావాదేవీలపై ఆదాయపు పన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కడపలోని ఆయన ఇంటిపై, హైదరాబాద్‌లోని ఆర్‌పిపిఎల్‌ కార్యాలయ ఆవరణలపై దాడులు నిర్వహించింది. ఆర్‌పిపిఎల్‌ ‘కనిపెట్టలేని లావాదేవీల’తో రూ.74 కోట్లను స్వాధీనం చేసుకుంది. మరో రూ.24 కోట్లు ‘అవాస్తవమైనవి’ అని పేర్కొన్నారు. అనంతరం కొన్ని నెలల తరువాత 2019 జూన్‌లో రమేష్‌ బిజెపిలో చేరారు.

➡️