ఉద్యోగం ఒకటే – జీతాల్లో వ్యత్యాసం

Nov 29,2023 10:03 #job, #pay
  • ఎనర్జీ అసిస్టెంట్ల ప్రొబేషనరీ పట్ల అస్పష్టత
  • ఒక్కో విధంగా పే స్లిప్స్‌శ్రీ ఎటూ తేల్చని ప్రభుత్వం, ఉద్యోగుల్లో ఆందోళన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సచివాలయాల్లో నియమితులైన ఎనర్జీ అసిస్టెంట్ల (జెఎల్‌ఎమ్‌ గ్రేడ్‌-2) పరిస్థితి గందరగోళంగా మారింది. విధులు ఒకటే నిర్వహిస్తున్నా రెగ్యులర్‌ జెఎల్‌ఎమ్‌కు ఇస్తున్న బేసిక్‌ ఎనర్జీ అసిస్టెంట్‌కు చెల్లిస్తున్న వేరుగా ఉండటంతో తాము నష్టపోతున్నామని జెఎల్‌ఎమ్‌-2లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌ జెఎల్‌ఎమ్‌కు బేసిక్‌రూ.32,500లు కాగా అలవెన్స్‌లతో కలిపి సుమారు రూ.40,795ల వరకు వస్తోంది. ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ కాక ముందు సచివాలయ ఉద్యోగుల జీతం కన్సాలిడిటేడ్‌ కింద రూ.15వేలు చెల్లించే వారు. ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయిన తర్వాత ప్రస్తుతం బేసిక్‌ రూ.22,460లు కాగా, అలవెన్స్‌లతో కలిపి రూ.29వేల లోపు వస్తోంది. ఇద్దరి ఉద్యోగుల మధ్య వ్యత్యాసం రూ.10నుంచి రూ.11వేల వరకు ఉంది. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,329 మంది ఎనర్జీ అసిస్టెంట్లుగా ప్రభుత్వం నియమించింది. వీరంతా గ్రామ సచివాలయంలో ఉంటూ విధులు నిర్వహించాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో డిస్కమ్‌ల కింద ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పర్మినెంట్‌ జెఎల్‌ఎమ్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలి

పర్మినెంట్‌ జెఎల్‌ఎమ్‌లకు అందిస్తున్న బెనిఫిట్స్‌ తమకు కూడా ఇవ్వాలని ఎనర్జీ అసిస్టెంట్లు కోరుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ జాబ్‌ చార్ట్‌ ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో జెఎల్‌ఎమ్‌ గ్రేడ్‌-2గా జాబ్‌ చార్ట్‌లో వాటర్‌ వర్క్స్‌, వీదిలైట్లు, విధ్యుత్‌పోల్స్‌ మరమ్మతులు వంటి పనులు చేయాల్సి ఉండగా, డిస్కమ్‌ల పరిధిలో హైటెన్షన్‌ విద్యుత్తు సరఫరా పనులతో పాటు విద్యుత్తు స్ధంబాలు ఎక్కిస్తున్నారు. గ్రామ సచివాలయం పరిధిలో పనిచేసేందుకు ఎనర్జీ అసిస్టెంట్‌ పోస్టుల కింద రిక్రూట్‌ చేశారు. పే స్లిప్స్‌లో తేడాలు: డిస్కమ్‌ల్లో పనిచేసే జెఎల్‌ఎమ్‌-2 ఉద్యోగులు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని గ్రామ వార్డు సచివాలయాలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ విద్యుత్‌శాఖకు లేఖ రాశారు.మూడు రకాల డిస్కమ్‌ల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పే స్లిప్స్‌లో సిపిడిసిఎల్‌ ఉద్యోగుల పే స్లిప్‌లో రెగ్యులర్‌, ఎపిఎస్‌పిడిసిఎల్‌ ఉద్యోగుల పే స్లిప్స్‌లో ఎమర్జన్సీ అంటూ ఇపిడిసిఎల్‌ ఉద్యోగులకు పే స్లిప్‌లో ప్రొబేషనరీ అని చూపుతున్నారు.

డిస్కమ్‌ల పరిధిలోఎనర్జీ అసిస్టెంట్‌లు

సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ మదర్‌ డిపార్టు మెంట్‌ లైనింగ్‌ డిపార్టుమెంట్‌ గాపర్యవేక్షిస్తోంది. 18 శాఖలన్ని మునిసిపల్‌ కమిషనరు, ఎంపిడిఓ నియంత్రణలో ఉండగా, లైనింగ్‌ బాధ్యతలన్నీ ఆయా మాతృశాఖలు పర్యవేక్షిస్తున్నాయి. మునిసిపల్‌ కమిషనరుకు తమను అప్పజెప్పకుండా డిస్కమ్‌ల కిందనే ఉంచుకుంటూ 24/7 గంటలు పనిచేయిస్తున్నారని ఎనర్జీ అసిస్టెంట్లు పేర్కొంటున్నారు.

ప్రతి రోజు ఉదయం గ్రామ వార్డు సచివాలయంలో బయోమెట్రిక్‌ వేసిన అనంతరం డ్యూటీలు చేసేందుకు సంబంధిత ట్రాన్స్‌కో ఎఇ, డిఇ వద్దకు వెళుతున్నారు. ఇది ఇబ్బందిగా మారిందని, ఎనర్జీ అసిస్టెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఎనర్జీ అసిస్టెంట్లకు మాత్రం విద్యుత్తు శాఖ చెల్లిస్తోంది. ఇప్పటికే అత్యవసర సేవల పేరుతో 24 గంటలు షిప్టుల వారీగా అర్ధరాత్రి, అపరాత్రి కూడా విధులు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. తమను గ్రామ వార్డు సచివాలయాలశాఖ ఉద్యోగులుగా గుర్తిస్తే జాబ్‌ చార్ట్‌ ఆ శాఖ సూచించిన విధంగా ఉంచాలని, లేక విద్యుత్‌ శాఖ ఉద్యోగులుగా గుర్తిస్తే ఆశాఖ బేసిక్‌ అమలయ్యే విధంగానైనా అమలు చేయాలని గతంలో ఎనర్జీ అసిస్టెంట్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరణించిన వారిని ఆదుకోరా ?

ఎనర్జీ అసిస్టెంట్లు విద్యుత్తు స్తంభాలు ఎక్కిన సమయాల్లో ప్రమాదాలకు గురై మరణించినా తీవ్ర గాయాల పాలైన గ్రామవార్డు సచివాలయశాఖ లేక, విద్యుత్‌శాఖ నుంచి ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వర్కుఛార్ట్‌ తయారు చేసి న్యాయం చేయాలని ఎనర్జీ అసిస్టెంట్లు కోరుతున్నారు.

➡️