సైన్స్‌ + సృజన = చెకుముకి సంబరాలు

Feb 25,2024 13:10 #Sneha

శాస్త్రీయ సమాజ నిర్మాణం ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది జన విజ్ఞాన వేదిక (జెవివి). రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ(హెచ్‌) లో పేర్కొన్నట్లు ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం కలిగి వుండేలా కృషి చేస్తోంది. గత 33 ఏళ్లుగా ఉన్నత పాఠశాలల విద్యార్థులలో సైన్స్‌ పట్ల ఆసక్తిని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు, విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహిస్తోంది. ఈ చెకుముకి సైన్స్‌ సంబరాలు పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర మొత్తం నాలుగు స్థాయిల్లో నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10, 11వ తేదీన పల్నాడు జిల్లా యడ్లపాడులో జరిగిన చెకుముకి సంబరాలు సృజనాత్మకంగా జరిగాయి. దీనిపై ప్రత్యేక కథనం..

                చెకుముకి సైన్సు సంబరాలు నాలుగుస్థాయిలలో జరుగుతాయి. స్కూలు స్థాయిలో 8,9,10 తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తారు. ఈ ఏడాది పాఠశాల స్థాయి నవంబరు 10వ తేదిన జరిగాయి. నాలుగు లక్షల ఎనబై వేల మంది విద్యార్ధులు పాల్గొన్నారు. ఇందులో 8,9,10 తరగతుల నుండి ప్రథమ స్థానం పొంది విద్యార్ధులు ‘స్కూల్‌ టీం’గా మండలస్థాయికి హజరవుతారు. మండల స్థాయి సైన్స్‌ సంబరాలు డిసెంబర్‌ 21న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 450 మండలాల్లో నిర్వహించారు. ఆరు వేల పాఠశాలల నుండి హాజరుకావడం జరిగింది. మండల స్థాయి చెకుముకి సైన్స్‌ పరీక్షలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విభాగాల నుండి మొదటి స్థానం పొందిన విద్యార్థి బృందాలు 2024 జనవరి 7న జరిగిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలకు హాజరు కావడం జరిగింది. ఆయా జిల్లాల విద్యాధికారులు, డాక్టర్లు, విద్యారంగంలో సంస్కరణల కోసం కృషి చేస్తున్న మేధావులు, సైన్స్‌ రంగంపై ఆసక్తి కలిగిన ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఈ జిల్లా స్థాయి చెకుముకి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 40 సైన్సు ప్రచార సంస్థలతో కూడిన ‘ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్వర్క్‌’ (ఎఐపిఎస్‌ఎన్‌) ఆధ్వర్యంలో ఈ ఏడాది నవంబర్‌ 7 నుండి 2024 ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్త ‘శాస్త్రీయ దృక్పథ ప్రచార కార్యక్రమం’ కూడా మిళితం చేసుకుని ఈ ఏడాది చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహించారు.

దేశాభివృద్ధికి శాస్త్రీయతే అత్యవసరం..

                ఈ నెల 10, 11 తేదీలలో పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండల కేంద్రంలోని నారాయణ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు చెందిన 48 బృందాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మొత్తం 350 మంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం ఈ సంబరాలు ప్రారంభమ య్యాయి. దేశాభి వృద్ధికి పరిశోధనలు విస్తృతంగా జరగాలి. సైన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు శాస్త్రీయ విధానాలు అవసరం. ఇదే రాష్ట్రస్థాయి చెకుముకి సైన్సు సంబరాలు చాటి చెప్పాయి. ‘కులమతాలు కాకుండా సైన్స్‌ కావాలి. పిల్లల్లో పోటీతత్వం ప్రమాదకరం. మానవ విలువలు, విజ్ఞానం, సామాజిక స్పృహ వంటివి కేంద్రంగా విద్య ఉండాలి. పిల్లల ఆలోచనలను అణచివేస్తున్నారు. పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోంది. అలాకాకుండా విజ్ఞానం, వికాసం, విహారయాత్రలు.. పెరగాలి. ముఖ్యంగా టీచర్లు చదవాలి. చుట్టూ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి, వాటిని పిల్లలకి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక కనీసం ఒక్క పరిశోధనా సంస్థ కూడా ఏర్పాటు చేయలేదు. 11 రకాల జాతీయ విద్యా సంస్థలకు 12 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాల్సి వుండగా, ఇప్పటికి 2500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. ప్రభుత్వాలు సైన్స్‌ని, పరిశోధనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి’ అని వక్తలు పేర్కొన్నారు.

వివిధాంశాలతో రౌండ్స్‌..

            విద్యార్థులలోని సైన్స్‌ అవగాహనను, శాస్త్రీయ దృక్పథాన్ని పరీక్షించేందుకు అదేవిధంగా విద్యార్థులకు వివిధ అంశాలపై గల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయోగాల రౌండ్‌, విజువల్‌ రౌండ్‌, డైరెక్ట్‌ రౌండ్‌ క్విజ్‌, రాత పరీక్షలు నిర్వహించారు. ప్రయోగాల రౌండ్‌లో ప్రతి టీంకు ఒక సైన్స్‌ కిట్‌ ఇచ్చారు. ఈ కిట్‌లో మెటీరియల్‌ ఉపయోగించి, ప్రతి టీం వివిధ ప్రయోగాలు చేసి చూపించాలనే టాస్క్‌ ఇచ్చారు. తదనుగుణంగా విద్యార్థులు ఉత్సాహంగా ప్రయోగాలు చేసి, చూపించారు. పిల్లలు చేస్తున్న ప్రయోగాలు చూసి తల్లిదండ్రులు అబ్బురపడ్డారు. ప్రయోగాల పట్ల విద్యార్థులలో ఆసక్తి పెంపొందింపజేసేందుకు ఈ ఎక్స్పరిమెంటల్‌ రౌండ్‌ ఉపయోగపడింది.క్విజ్‌లో ప్రశ్నలు అడగడం, విజువల్‌ రౌండ్‌లో వివిధ విషయాల పట్ల విద్యార్థుల అవగాహనను, తర్క జ్ఞానాన్ని పరీక్షించడం.. అదేవిధంగా వాటికి సరైన సమాధానాలను అర్థమయ్యేలా కృషి చేశారు. ప్రతి అంశానికి ఉన్న లాజిక్‌ని విద్యార్థులకు విశదీకరించారు. దీంతో విద్యార్థులు తమ జ్ఞానాన్ని మెరుగుపరుచుకున్నారు. రాత పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌, నేచురల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్స్‌లో ఆయా పాఠశాలల విద్యార్థులకు గల అవగాహనా శక్తిని అంచనా వేశారు.

మీట్‌ ది సైంటిస్ట్‌..

                 ఈ చెకుముకి సైన్సు సంబరాలలో ‘మీట్‌ ది సైంటిస్ట్‌’ కార్యక్రమం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. చెకుముకి సంబరాలకు హాజరైన ఇస్రో సైంటిస్టులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు, విద్యార్థులకు మధ్య సంభాషణలు జరిగాయి. విద్యార్థులు పలు ప్రశ్నలను అడగడం ద్వారా ఆసక్తికరమైన చర్చను లేవనెత్తారు. అలాంటి వాటిల్లో ‘ఇతర గ్రహాల మీద జీవం ఉందా? శ్రీహరికోట నుండి రాకెట్‌ను ముహూర్తం పెట్టి, ఎందుకు పంపుతారు? ఇది సరైనదేనా? దిక్సూచి ఉత్తర-దక్షిణాలే ఎందుకు చూపుతుంది? సూర్యుడులో ఆక్సిజన్‌ లేదు కదా మరి సూర్యుడు ఎలా మండుతాడు? అంతరిక్ష పరిశోధనకు వాడే వేలాది కోట్ల రూపాయలతో భూమి మీద కాలుష్యం తగ్గించవచ్చు కదా..!’ ఇలా పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వచ్చాయి. వీటన్నింటికీ సంబంధిత సైంటిస్టులతో సమాధానాలు తెలుసుకున్నారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యా, వైద్యం తదితర అంశాలపై చర్చా కార్యక్రమం జరిగింది. ‘బ్లడ్‌ గ్రూప్‌ని బట్టి మనస్తత్వం ఉంటుందా? జనరిక్‌ మందులు మంచివేనా? నాడీ వైద్యం, ఆనందయ్య మందు, మెడిటేషన్‌ వల్ల ఎంత ఉపయోగం? అల్లోపతి- ఆయుర్వేదము-హోమియోపతి వైద్యం’ తదితర వాటిపై డాక్టర్లు, ప్రొఫెసర్లతో చర్చించారు.

ఇస్రో మొబైల్‌ ఎగ్జిబిషన్‌..

                ఇస్రో మొబైల్‌ ఎగ్జిబిషన్‌ ఈ సంబరాలలో ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ మొబైల్‌ ఎగ్జిబిషన్లో ఇస్రో ద్వారా చేపట్టిన వివిధ ప్రయోగాలకు సంబంధించిన అంశాలున్నాయి. అలాగే అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా చంద్రయాన్‌-3పై ప్రదర్శనలున్నాయి. ఈ మొబైల్‌ వెహికల్‌ చూసేందుకు వచ్చినవారికి వాటి గురించి వివరించడం జరిగింది. యడ్లపాడు వంటి గ్రామీణ ప్రాంతానికి ఇస్రో బస్సు రావడం చాలా గొప్ప విషయంగా విద్యార్థులు, గ్రామస్తులు చెప్పుకున్నారు. యడ్లపాడులో ప్రదర్శన అనంతరం, మొబైల్‌ ఎగ్జిబిషన్‌ని చిలకలూరిపేటలో కూడా ప్రదర్శించారు. వంలాది ఆ ప్రాంత విద్యార్థులు, పౌరులు ఈ మొబైల్‌ ఎగ్జిబిషన్‌ సందర్శించారు.

కొండవీడు విజ్ఞాన విహారయాత్ర

                విద్యార్థులకు కొండవీడు విజ్ఞాన విహారయాత్ర ఏర్పాటు చేశారు. యడ్లపాడు నుంచి విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఆరు బస్సులలో కొండవీడు తీసుకువెళ్లారు. కొండవీడు సందర్శన ద్వారా విద్యార్థులు రాజుల కాలం నాటి కోటలు, భవనాలు, అప్పటి నీటి వసతులు తదితర విషయాలు ఆసక్తిగా తెలుసుకున్నారు. ఇది వారికి మధురానుభూతిని మిగిల్చింది.

ఆలోచనాత్మక కళాజాత..

               కళాజాత మంచి ఉత్సాహాన్నివ్వడంతో పాటు, ఆలోచనను రేకెత్తించేలా ఉంది. ఒక వైవిధ్య భరితమైన కార్యక్రమం ఇది. శాస్త్ర దృక్పథ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న కళాజాత టీం చెకుముకి నిర్వహించబడుతున్న యడ్లపాడుకు పదవ తేదీ వచ్చింది. 10వ తేదీ రాత్రి పాటలు, మాటలు, స్కిట్లు, డ్యాన్సులు వంటివి చేశారు. మూఢనమ్మకాలు, బాలికా విద్య, తర్క జ్ఞానం, సైన్సు- శాస్త్రీయ దృక్పథం వంటి అంశాలపై కళారూపాలు ప్రదర్శించారు. అందరినీ ఈ కళారూపాలు బాగా ఆకట్టుకున్నాయి. మరుసటి రోజు కొండవీడులోనూ కళాజాత నిర్వహించారు. అక్కడ కొండవీడు ఫెస్టివల్‌ జరుగుతున్నందున అత్యధిక సంఖ్యలో కొండవీడు సందర్శనార్థం వచ్చిన అధికారులు, విద్యార్థులు, ప్రజలను ఇవి విశేషంగా ఆకట్టుకున్నాయి. అధికారులు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని ప్రశంసించారు.

పుస్తకావిష్కరణలు..

             సంబరాలలో ‘వేమన పద్యాలు’ తెలుగు-ఇంగ్లీష్‌ పుస్తకాన్ని, సైన్స్‌ కథల సమాహారం, ‘తెలుసుకుందామా మన ప్రపంచాన్ని’ మొదటి, రెండవ భాగాలు.. సావిత్రిబాయి పూలే సమగ్ర జీవితాన్ని, తెలుగులో అనువదించిన వోల్గా గారి ‘నేను.. సావిత్రిబాయి’ పుస్తకం మొత్తం మూడు పుస్తకాలను ఆవిష్కరించారు.

విశేషాలు..

గాజు పెంకులపై నడక, నెయిల్‌ బెడ్‌, మాయా హుండీ మొదలైన ఆసక్తి గొలిపే సైన్స్‌ అంశాలపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పిల్లల మధ్య జిల్లాలకు అతీతంగా స్నేహాలు వెల్లివిరిసాయి. ఈ చెకుముకి సంబరాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇచ్చారు.శాస్త్రీయ దృక్పథమే ఎజెండా..జెవివి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ.. చెకుముకి సైన్స్‌ సంబరాల నిర్వహణ ద్వారా పాఠశాల విద్యలోను, సమాజంలోనూ శాస్త్రీయ దక్పథాన్ని ఒక కీలకమైన ఎజెండాగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. విద్యార్థులలో సైన్స్‌ పట్ల, శాస్త్రీయ భావాల పట్ల ఆసక్తిని, ప్రశ్నించే తత్వాన్ని కలిగించేందుకు చెకుముకి సైన్స్‌ సంబరాల ద్వారా కృషి చేస్తున్నాం.సైన్స్‌ను ఆచరించాలి!’మన దేశంలో శాస్త్ర సాంకేతికాభివృద్ధి’ అనే అంశంపై ప్రొఫెసర్‌ ఎ. రామచంద్రయ్య మాట్లాడుతూ.. 33 ఏళ్లుగా చెకుముకి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఇలా నిర్వహించే ఏవిధమైన సైన్స్‌ సంస్థ దేశంలోనే లేదు. పిల్లలు సైన్స్‌ని జీవితానికి అన్వయించుకోవాలి. సైన్స్‌ను ఆచరించాలి. సైన్స్‌ను సుడో సైన్స్‌ను కలిపి, కలగాపులగం చేయకుండా శాస్త్రీయ ఆలోచనతో విద్యార్థులు ఎదిగితే.. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే అది నిజమైన దేశాభివృద్ధి అవుతుంది.

కుర్రా రామారావు

రాష్ట్ర ప్రధానకార్యదర్శి జనవిజ్ఞాన వేదిక

949300442

➡️