నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి వాటిపై పోరు ఉధృతం

translator

Double-click

Select to translate

 

  • ప్రత్యర్థులపై ఇడి దాడులను ఆపాలి
  • గ్రామీణ బంద్‌కు మద్దతు
  • ఇవిఎంల రీ సీక్వెన్సింగ్‌ కోసం దేశ వ్యాపిత ప్రచారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు

తిరువనంతపురం : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం లౌకికవాదానికి మృత్యు ఘంటికగా పరిణమించిందని సిపిఐ(ఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆరాధనా స్థలాల చట్టం-1991ని అటకెక్కించి, కాశీ, మథుర వివాదాలను మళ్ళీ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలను అది తీవ్రంగా వ్యతిరేకించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇడిని, ధన బలాన్ని ప్రయోగించడాన్ని కేంద్ర కమిటీ తీవ్రంగా విమర్శించింది. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని పార్టీ రాష్ట్ర శాఖలన్నిటికీ కేంద్రకమిటీ పిలుపునిచ్చింది. జనవరి 28-30 తేదీల్లో ఇక్కడ సమావేశమైన పార్టీ కేంద్ర కమిటీ మంగళవారం నాడిక్కడ ఈ కింది ప్రకటన విడుదలజేసింది.

అయోధ్యలో రామ మందిర ప్రారంభం

జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రభుత్వం, పాలనా వ్యవహారాలు, రాజకీయాల నుండి మతాన్ని వేరు చేసి చూడాలని నిర్వచిస్తున్న లౌకికవాద భావజాలానికి మృత్యు ఘంటికలు మోగించింది. ప్రధాని, యుపి ముఖ్యమంత్రి, యుపి గవర్నర్‌ నేరుగా జోక్యం చేసుకున్నారు. ఇదంతా ప్రభుత్వ ప్రాయోజిన కార్యక్రమంలా సాగింది. ‘చేసిన ప్రతిన నెరవేర్చారు’, ‘ నాగరికతా ప్రస్థానంలో గమ్యాన్ని చేరుకునేందుకు భారత్‌ యత్నం’ వంటి పొగడ్తలతో ప్రధానికి భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి శుభాభినందన సందేశాలు పంపారు. ప్రభుత్వానికి ఎలాంటి మతపరమైన అనుబంధం కానీ, ప్రాధాన్యత కానీ వుండరాదని భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. భారత ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు ఇది ప్రాధమిక సూత్రంగా ఉండాలని సుప్రీం కోర్టు పదే పదే ఉద్ఘాటించింది. వీటిన్నిటిని బాహాటంగా ఉల్లంఘిస్తూ ఈ మొత్తం కార్యక్రమం సాగింది.

రాజకీయ, ఎన్నికల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముందుగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాయి. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి వీలుగా వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా పెద్ద పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేశాయి. ఆ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. ఉద్యోగులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మధ్యాహ్నం 2.30గంటల వరకు మూసివేశారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, సంస్థలు, బ్యాంకులదీ అదే పరిస్థితి. ప్రతి రాష్ట్రం నుండి, పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఆలయాన్ని సందర్శించేలా ప్రజలను తరలించేందుకు పథక రచన చేశారు. ఇలా మార్చి వరకు అంటే ఎన్నికల వరకు సాగేలా ఏర్పాటు చేశారు.

అయోధ్య మినహా అన్ని మతపరమైన ఆరాధనా స్థలాల్లో 1947 ఆగస్టు 15 నాటి ముందున్న పరిస్థితే యథాతథంగా కొనసాగించాలని ఆదేశిస్తున్న ఆరాధనా స్థలాల చట్టం, 1991ని అటకెక్కిస్తున్నారన్న సంకేతాన్ని కూడా ఈ ఘటన ఇస్తోంది. అక్కడక్కడా న్యాయపరమైన లోపాయికారీ మద్దతుతో కాశీ, మధురలో వివాదాలను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. అయోధ్యపై తీర్పు ఇచ్చినందుకు ప్రధాని మోడీ, సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలియచేశారు.

మతం అనేది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినది. తమకు నచ్చిన విశ్వాసాన్ని అనుసరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఈ హక్కును గౌరవించాలన్నది సిపిఎం విధానం. అయితే, అదే సమయంలో ప్రజల మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం అలాగే ప్రభుత్వంతో మిళతం చేస్తూ, రాజకీయ లబ్ధికి దీనిని ఒక సాధనంగా దుర్వినియోగం చేసే ఎలాంటి యత్నాన్ని అయినా సిపిఎం గట్టిగా వ్యతిరేకిస్తుంది.

అసెంబ్లీ ఎన్నికలు

              గతంలో రెండు విడతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లలో బిజెపి విజయాలను నమోదు చేయగా, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, తెలంగాణాల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది.

హిందూత్వ ఓటును సంఘటితపరచడంతో పాటు కుల మనోభావాలను ప్రమాదకరమైన రీతిలో వాడుకోవడమే బిజెపి విజయాల్లో కీలకంగా వుంది.

ఇలా హిందూత్వ మతోన్మాద భావాలను సంఘటితపరచడాన్ని సూటిగా, నిక్కచ్చిగా ఎదుర్కొనాల్సి వుంది. హిందూత్వకు పోటీగా మెతక హిందూత్వను అనుసరించడం, లేదా తేలికగా తీసుకోవడం వంటి వైఖరులు ప్రజల్లో గణనీయమైన సెక్షన్లపై హిందూత్వ ప్రభావం బలపడేందుకే దారి తీస్తుంది. ఇది, సమాజంలో మరింతగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి, మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలకు, ఇతర హిందూత్వ సంస్థలకు ఇది అవకాశమిస్తుంది.

ఇండియా బ్లాక్‌

                 ఇండియా బ్లాక్‌ నుండి జెడి(యు) వీడి బిజెపితో కుమ్మక్కైనప్పటికీ, ‘ఇండియా’ బ్లాక్‌ను మరింత బలోపేతం గావించేందుకు, అలాగే మన రాజ్యాంగబద్ధమైన రిపబ్లిక్‌ లౌకిక, ప్రజాతంత్ర స్వభావాన్ని కాపాడుకునేందుకు బిజెపిని ఓడించే లక్ష్యంతో సిపిఎం తన కృషిని మరింత ముమ్మరం చేస్తుంది. ఇండియా బ్లాక్‌ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సద్దుబాటుపై రాష్ట్ర స్థాయిలో చర్చలు సాధ్యమైనంత త్వరగా ముగించడంపై దృష్టి పెట్టాలి. వెంటనే ప్రజల జీవనోపాధులను మెరుగుపరిచేందుకు సంబంధించిన మౌలిక సమస్యలను, రాజ్యాంగ విలువలను పరిరక్షణకు సంబంధించిన అంశాలతో ప్రజల చెంతకు వెళ్లాలి.

కేరళ

                  నవ కేరళ సదస్‌ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసినందుకు కేరళ ప్రజలకు, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి కేంద్ర కమిటీ అభినందనలు తెలియచేసింది. దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విశిష్టమైనది. గవర్నర్‌ – ఆ పదవికి తగరు : ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వంపై, వరుసగా రాజకీయ దాడులు చేస్తూ, తన తప్పుడు ప్రవర్తనతో కేరళ గవర్నర్‌ అన్ని హద్దులను దాటేశారు. ఈ క్రమంలో తాజాది రోడ్డుపై ధర్నా చేయడం. శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్ధులు చేస్తున్న నిరసన ప్రదర్శనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అవాంఛనీయమైన రీతిలో ధర్నాకు దిగారు. కేంద్ర భద్రతా బలగాలు తనకు రక్షణ కల్పించాలని కోరి, మరీ సంపాదించుకున్నారు. ”రాజ్యాంగ యంత్రం కుప్పకూలింది ” అంటూ ఆయన చేసిన ప్రకటనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించేలా ఉన్నాయి. , వీటిని రాష్ట్ర ప్రజలు నిర్ద్వంద్దంగా తిప్పి కొడతారు. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రతికూల, అప్రజాస్వామిక వైఖరినవలంబిస్తోంది. ముఖ్యమంత్రిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. కేరళ ప్రజలపై కేంద్రం చేస్తున్న దాడుల పట్ల మాత్రం మౌనం వహిస్తోంది. ఇది, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి పన్నే కుయుక్తులు, ఎత్తుగడలకు దోహదపడుతోంది.

పశ్చిమ బెంగాల్‌ :

రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు సాగించి, బ్రహ్మాండమైన బ్రిగేడ్‌ ర్యాలీతో విజయవంతంగా ఇన్సాఫ్‌ యాత్ర ముగించినందుకు బెంగాల్‌ యువతకు కేంద్ర కమిటీ అభినందనలు తెలియచేసింది.

త్రిపుర :

త్రిపురలో బిజెపి ఏక పార్టీ నిరంకుశ ప్రభుత్వం తన ఫాసిస్ట్‌ తీవ్రవాద దాడులను ఉధృతం చేసింది. దీంతో స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడంపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బిజెపి దాడుల్లో సిపిఎం కార్యకర్తలు లక్ష్యాలుగా మారుతున్నారు. దీన్ని ప్రతిఘటించాల్సి వుంది.

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)

                   2019 డిసెంబరు నుండి, మోడీ ప్రభుత్వం ఈ చట్టం కింద నిబంధనలను రూపొందించలేదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని, మతపరమైన భావాలను మరింత రెచ్చగొట్టేందుకు ఈ చట్టాన్ని త్వరగా అమలులోకి తేవడం ద్వారా మత సమీకరణలకు మరింత పదును పెట్టడం ద్వారా ఎన్నికల్లో లబ్ధికి ముఖ్యంగా తూర్పు భారతంలో ప్రయోజనం పొందాలని చూస్తోంది.

ఇడిని, ధన బలాన్ని దారుణంగా దుర్వినియోగం చేస్తున్న బిజెపి

                అయోధ్య కార్యక్రమం నేపథ్యంలో తలెత్తిన మతపరమైన మనోభావాలను దారుణంగా దుర్వినియోగం చేస్తున్నా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయాలను సాధించినా 2024 ఎన్నికల్లో గట్టెక్కుతామన్న నమ్మకం బిజెపికి ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో తన విజయావకాశాలను మెరుగుపరుచుకోవాలన్న ఆశతో బిజెపి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఫిరాయింపులకు పాల్పడేందుకు, మాజీ ప్రత్యర్థ్ధులతో పొత్తులు పెట్టుకోవడానికి అత్యంత దారుణమైన రీతిలో, దూకుడుగా ఇడిని దుర్వినియోగపరచడం, ధన బలాన్ని ప్రయోగించడం వంటివి చేస్తోంది. ఇంతకుముందు మహారాష్ట్రలో అది ఈ పని చేసింది. తర్వాత కర్ణాటకలో, ఇప్పుడు బీహార్‌లో అదే పని చేసింది. రాజకీయ లబ్ది కోసం అనేకసార్లు తన అభిప్రాయాలను, విధానాలను మార్చుకోవడంలో అతి చెత్త రికార్డు కలిగి ఉన్న జెడి(యు)తో పొత్తు కలిసింది. ఈసారి బిజెపి మద్దతుతో నితీష్‌ కుమార్‌ బీహార్‌ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 9వ సారి ప్రమాణం చేశారు. బిజెపిని ఓడించిన ఈ రాష్ట్రాల్లోని ప్రజలు అటువంటి ఊసరవెల్లులకు తగిన గుణపాఠం చెబుతారు.

కేంద్ర కమిటీ పిలుపు

  • మోడీ ప్రభుత్వ విధానాలతో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రజల జీవనోపాధులపై దాడి వంటి వాటికి వ్యతిరేకంగా పార్టీ అన్ని రాష్ట్ర శాఖలు పోరాటాలను ఉధృతం చేయాలి.
  • కేరళ పట్ల మోడీ ప్రభుత్వ వివక్ష్షాపూరిత విధానాలకు నిరసనగా, రాష్ట్రాల హక్కులపై, సమాఖ్యవాదంపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరి 8న న్యూఢిల్లీలో కేరళ రాష్ట్ర ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ధర్నాతో పాటే, రాష్ట్రాల్లో అన్ని రాష్ట్ర కమిటీలు నిరసన కార్యక్రమాలు తప్పక నిర్వహించాలి.
  • ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణ నిర్వహించాలంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఇచ్చిన పిలుపునకు కేంద్ర కమిటీ సంఘీభావాన్ని ప్రకటించింది.
  • ఇవిఎంల పనితీరుపై విస్తృతంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలింగ్‌ బూత్‌ల్లో – ఓటింగ్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వివిపిఎటిల్లో – ఎలక్ట్రానిక్‌ యూనిట్ల వరుస క్రమాన్ని తిరగదోడాలి. ఓటింగ్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్టు, వివిప్యాట్‌లను ఒక క్రమంలో ఏర్పాటు చేయాలని పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టనుంది. కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైన ఓట్లతో కనీసం 50శాతం వివిపిఎటిలు సరిపోలాల్సి వుంటుంది.
➡️