అప్పుల ఊబిలో కేంద్రం

Feb 12,2024 10:39 #BJP Failures, #BJP Govt, #debt
The center is in a quagmire of debt
  • కొండలా పెరుగుతున్న రుణాలు
  • రాష్ట్రాలపై ఆంక్షలు విధిస్తున్న కేంద్రం
  • సామాన్యులకు శాపంగా మారిన ప్రభుత్వ విధానాలు

న్యూఢిల్లీ : భారత్‌పై రుణభారం కొండలా పెరిగిపోతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) గత డిసెంబరులో ప్రకటించగానే కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ఈ అప్పుల కుప్ప కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదంటూ ఐఎంఎఫ్‌ ప్రకటనను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశాయి. 2022-23లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 86.5% మేర ఉన్నాయని, ఇది సంక్షోభమేమీ కాదని చెబుతూ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రుణాలు 2014-15లో జిడిపిలో 67%గా ఉన్నాయి. అవి క్రమేపీ పెరుగుతూ ప్రస్తుత స్థాయికి చేరాయి. కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన 2020-21లో ఈ రుణాలు గరిష్ట స్థాయికి…అంటే జిడిపిలో 90%కి చేరుకున్నాయి. విడివిడిగా చూసినట్లయితే 2022-23లో జిడిపిలో కేంద్ర రుణాలు 61% ఉండగా, రాష్ట్రాల మొత్తం రుణాలు 29.5% మాత్రమే. ఈ గణాంకాలన్నీ ఆర్‌బీఐ అందించినవే. కేంద్ర రుణాలు కానీ, రాష్ట్రాల మొత్తం రుణాలు కానీ గత దశాబ్ద కాలంలో పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రుణాలు జిడిపిలో 100 శాతాన్ని చేరుకోలేదని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాదించే వారూ ఉన్నారు. అనేక సంపన్న ఆర్థిక వ్యవస్థల రుణభారం జిడిపిలో వంద శాతాన్ని దాటేసిందని వారు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.

ఆశాజనకంగా లేని ప్రైవేటు పెట్టుబడులు

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. దేశ ప్రజల ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. ఉద్యోగాల సంఖ్య పెరగడం లేదు. మరోవైపు ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో రుణ స్థాయి అధికంగా ఉండడం కచ్చితంగా కలవరం కలిగించే విషయమే. మరో విషయమేమంటే మూలధనపు పెట్టుబడికి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తోంది. ఈ నిధిలో ఎక్కువ భాగం రహదారులు, బ్రిడ్జిలు వంటి మౌలిక సదుపాయాల కోసం ఖర్చవుతుంది. దీనివల్ల ప్రైవేటు రంగ పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందన్న అభిప్రాయం ఉంది. అయితే అవి ఆశాజనకంగా లేవు.

రాష్ట్రాలపై పెరుగుతున్న ఆంక్షలు

ఇదిలావుండగా ఇటీవలి కాలంలో రాష్ట్రాల రుణ స్థాయిపై తాజాగా వివాదం చెలరేగింది. కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు మితిమీరి అప్పులు చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రాలు తీసుకునే రుణాల పరిధిపై కేంద్ర చట్టాలు ఎన్నో ఆంక్షలు విధిస్తున్నాయి. రాష్ట్రాల మొత్తం రుణాలు పెరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ రుణంలో అవి ఇప్పటికీ సగమే ఉన్నాయి. కానీ రాష్ట్రాల అప్పులు ఎందుకు పెరుగుతున్నాయన్న విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. గత దశాబ్ద కాలంలో రాష్ట్రాలు తీసుకునే రుణాలపై కేంద్రం ఎన్నో ఆంక్షలు విధించింది. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను సైతం నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు జీఎస్టీనే తీసుకుందాం. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ నష్టపరిహారం సంవత్సరాల తరబడి ఆలస్యమవుతోంది. కొన్ని సందర్భాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధుల విడుదలలో తరచుగా జాప్యం జరుగుతోంది. దీంతో రాష్ట్రాలు అప్పులు తీసుకోక తప్పడం లేదు. లేదా ఆ పథకాలను కొనసాగించేందుకు సొంత వనరుల నుండి నిధులు అందజేయాల్సి వస్తోంది. 2017లో జిఎస్‌టి అమలులోకి వచ్చింది. ఈ విధానం కారణంగా పన్నులపై రాష్ట్రాలకు ఉన్న హక్కులన్నీ హరించుకుపోయాయి. కేంద్రం విదిల్చే నిధుల పైనే అవి ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆర్థిక సంఘం నిధులను కూడా పూర్తిగా ఇవ్వడం లేదని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. దీనంతటికీ కారణం కేంద్ర ప్రభుత్వ ఏకీకృత, ఆంక్షలతో కూడిన వైఖరే. ఇది నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్షణం.

ఆర్థిక విధానాలే కారణం

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా దేశ ప్రజలపై మోయలేని రుణభారం పడుతోంది. 2018వ సంవత్సరపు ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంపై సగటున రూ.60,000 రుణభారం పడుతోంది. అదే పట్టణ ప్రాంతంలో అయితే ఈ భారం రూ.1.2 లక్షలుగా ఉంది. అయితే ఇది సగటు భారం మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పులతో అల్లాడుతున్న కుటుంబాలను మాత్రమే కాకుండా జనాభా మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని అంచనా వేశారు. 2012లో ఈ రుణభారం గ్రామీణ కుటుంబంపై రూ.32,522గా, పట్టణాల్లో నివసిస్తున్న కుటుంబంపై రూ.84,625గా ఉంది. ఆదాయాలు తక్కువగా ఉండడం, సరైన ఉపాధి లభించకపోవడం, నిరుద్యోగం, భద్రత లేని ఉద్యోగాలు వంటి కారణాలతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.

సామాన్యుల నడ్డి విరుస్తూ…

ప్రభుత్వాలు తాము తీసుకునే రుణాలను వడ్డీతో సహా తీర్చేస్తాయి. వివిధ రూపాల్లో పన్నుల ద్వారా పోగు చేసిన సొమ్మును ఇందుకోసం వినియోగిస్తాయి. ఈ పన్నుల్లో ఎక్కువ భాగం భరించేది పరోక్ష పన్నుల ద్వారా సామాన్య ప్రజలే. మోడీ ప్రభుత్వం సంపన్న కార్పొరేట్‌ రంగాలకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు కల్పిస్తోంది. కార్పొరేట్‌ పన్నుల్లో నేరుగా కోత పెడుతోంది. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను కృత్రిమంగా పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వ రుణాలు తీర్చడానికి ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతోంది. దీంతో వ్యక్తిగత లేదా కుటుంబ అప్పులు పెరిగిపోతున్నాయి.

➡️