నిరాశ పరచిన మధ్యంతర బడ్జెట్‌

-అప్పులు- పన్నులే ఆదాయ వనరులు

-వేతన జీవులకు లభించని ఊరట

-కీలక రంగాలకు అరకొర నిధులు

-ఉద్యోగ కల్పన ఊసే లేదునామమాత్రపు హామీలతో సరి

న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ నిరాశ కలిగించింది. రూ.47.65 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించగా అందులో అత్యధికంగా రక్షణ శాఖకు రూ.6.2 లక్షల కోట్లు కేటాయించారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ఊరట లభించలేదు. గ్రామీణ ఉపాధి హామీ వంటి ముఖ్యమైన పథకాలకు కేటాయింపుల్ని నామమాత్రంగానే పెంచారు. మధ్యంతర బడ్జెట్‌లో ఎన్నికల తాయిలాలు కూడా ప్రకటించకపోవడంతో చప్పగా ఉంది. మరోవైపు దేశంపై అప్పుల భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.168,72,554.17 కోట్ల మేర రుణాలు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ రుణ భారం వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికి రూ.183,67,132.46 కోట్లకు చేరుతుందని నిర్మలా సీతారామన్‌ అంచనా. వీటిలో 2025 మార్చి 31 నాటికి అంతర్గత రుణాలే రూ.177,92,204 కోట్లు ఉంటాయని చెబుతున్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలోనూ, ఎగుమతి, దిగుమతి సుంకాల్లోనూ బడ్జెట్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు.

ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్‌లో ప్రధానంగా నాలుగు వర్గాలపై దృష్టి సారించారు. తన దృష్టిలో ఈ నాలుగే అతి పెద్ద కులాలని ప్రధాని మోడీ గతంలో చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకొని పేదలు, మహిళలు, యువత, రైతుల కోసం కొన్ని పథకాలు, కార్యక్రమాలు ప్రకటించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని పలు సర్వేలు చెబుతున్నప్పటికీ దానిపై ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పలేదు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధనే లక్ష్యంగా ఉపాధి కల్పన కోసం ఏదైనా పథకమో లేక కార్యక్రమమో ప్రకటిస్తారని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద రాబోయే ఐదు సంవత్సరాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని నిర్మల తెలిపారు. విద్యుత్‌ బిల్లుల నుండి సామాన్యులకు ఊరట కల్పించే ఉద్దేశంతో కొత్తగా సౌరశక్తి పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా కోటి ఆవాసాలకు ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ లభిస్తుందని చెప్పారు. ఇళ్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునే వారికి ఏడాదికి రూ.15,000 నుండి రూ.18,000 ఆదా అవుతుందని తెలిపారు.

పట్టణ పేదల కోసం కూడా ఆర్థిక మంత్రి ఓ పథకాన్ని ప్రకటించారు. ‘అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికారిక కాలనీలలో నివసించే మధ్యతరగతి ప్రజలు ఇళ్లను కొనుగోలు చేసేందుకు లేదా నిర్మించుకునేందుకు సాయం అందిస్తాం’ అని చెప్పారు. ఈ పథకం లక్ష్యాన్ని మాత్రం వివరించలేదు. 9-14 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా వ్యాక్సిన్ల తయారీని ప్రోత్సహిస్తామని అన్నారు. దేశంలో మరిన్ని వైద్య కళాశాలల ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి స్వనిధి ద్వారా ఇప్పటి వరకూ 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించామని, రాబోయే కాలంలో మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. పంటలకు నానో డిఎపి ఎరువులు అందజేస్తామని అన్నారు. చమురు గింజల రంగంలో ఆత్మ నిర్భరత సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2, 3 తరగతులకు చెందిన నగరాలకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఛార్జింగ్‌ స్టేషన్లు, ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ప్రోత్సహిస్తామని వివరించారు.

స్వల్పంగా పెరిగిన కేటాయింపులు

మధ్యంతర బడ్జెట్‌లో పలు కీలక పథకాలకు కేటాయింపులు పెద్దగా పెంచలేదు. గ్రామీణ ఉపాధి హమీ పథకానికి కేటాయింపులను కేవలం రూ.26,000 కోట్లు మాత్రమే పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.86,000 కోట్లు (సవరించిన అంచనాలు) కేటాయించారు. ఇక ఆయుష్మాన్‌ భారత్‌ (పిఎంజెఎవై) పథకానికి కేటాయింపులు రూ.7,200 కోట్ల నుండి రూ.7,500 కోట్లకు అంటే కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెరిగాయి.

కీలకమైన ఆరోగ్యం, విద్య రంగాలకు సైతం మధ్యంతర బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగాలకు జరిపిన కేటాయింపుల్ని సైతం పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యపై రూ.1,16,417 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.1,08,878 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అదే విధంగా ఆరోగ్య రంగంపై రూ.88,956 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా రూ.79,221 కోట్లు వ్యయం చేశారు.

కేటాయింపుల్లోనూ కోతలే

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం ఉద్దేశించిన కీలక పథకాలకు కూడా మధ్యంతర బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధించారు. ఉదాహరణకు షెడ్యూల్డ్‌ కులాల వారి అభివృద్ధి కోసం ఒకే గొడుగు కింద సాయం చేసేందుకు ఉద్దేశించిన పథకానికి (అంబ్రెల్లా స్కీమ్‌) బడ్జెట్‌ అంచనాలు రూ.9,409 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ.6,780 కోట్లు. షెడ్యూల్డ్‌ తెగలకు బడ్జెట్‌ అంచనాలు రూ.4,295 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ.3,286 కోట్లు. మైనారిటీలకు బడ్జెట్‌ అంచనాలు రూ.610 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ.555 కోట్లు. ఇతర బలహీన వర్గాలకు బడ్జెట్‌ అంచనాలు రూ.2,194 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ.1,918 కోట్లు.

పన్నులే ఆదాయం

ప్రభుత్వానికి ఇప్పుడు ఆదాయ పన్ను ద్వారానే అధిక ఆదాయం లభిస్తోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు అప్పులే అయినప్పటికీ అతి పెద్ద రెండో ఆర్థిక వనరు ఆదాయ పన్ను నుండి లభించే రాబడి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక వనరుల్లో 19% రాబడి ఆదాయ పన్ను ద్వారా లభించేదేనని బడ్జెట్‌ పత్రాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆర్థిక వనరుల్లో 17% కార్పొరేట్‌ పన్నులు, 18% జీఎస్టీ, 28% అప్పుల ద్వారా సమకూరుతోంది.

ద్రవ్యలోటును మరింత తగ్గిస్తాం

రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం మార్కెట్‌ విలువ (నామినల్‌ జిడిపి) 10.5% పెరగవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. తాజా బడ్జెట్‌ పత్రాల ప్రకారం ఈ విలువ రూ.3,22,71,808 కోట్లు ఉండవచ్చునని అంచనా. ద్రవ్య లోటును 5.8%కి తగ్గించామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దీనిని 5.1%కి, 2025-26 నాటికి 4.5%కి తగ్గిస్తామని తెలిపారు. మూలధన వ్యయాన్ని రూ.10 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ సవరించిన అంచనాలను బట్టి అది సాధ్యపడలేదని తేలింది. మూలధన వ్యయం రూ.9.5 లక్షల కోట్లకే పరిమితమైంది.

ప్రతిపక్షాలపై విసుర్లు

గంట పాటు సాగిన నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగంలో… అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలపైనా స్పందించారు. మోడీ ప్రభుత్వం లౌకికవాదాన్ని బలపరిచే చర్యలు చేపడుతోందని చెప్పుకున్నారు. ప్రతిపక్ష నేతలపైనే జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలను గురించి మాట్లాడుతూ ‘గతంలో సామాజిక న్యాయం ఓ రాజకీయ నినాదంగా ఉండేది. మా ప్రభుత్వానికి సంబంధించి అది సమర్ధవంతమైన, అవసరమైన పరిపాలనా మోడల్‌. ప్రజలందరికీ సామాజిక న్యాయం అందేలా చూడాలి. అవినీతిని తగ్గించాలి. బంధుప్రీతిని రూపుమాపాలి’ అని అన్నారు.

రైలు బోగీలకు వందే భారత్‌ హంగులు

బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. నలభై వేల సాధారణ బోగీల్లోనే వందే భారత్‌ రైళ్లలో ఉండే ప్రమాణాలు నెలకొల్పుతామని చెప్పారు. పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల కోసం మెట్రో, నమో భారత్‌ రైళ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. దేశంలో మూడు కొత్త రైల్వే ఆర్థిక కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైళ్ల రాకపోకలు ఎక్కువగా జరిగే మార్గాల్లో, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని అన్నారు. ప్రధాని గతిశక్తి కార్యక్రమం కింద ఇంధనం- ఖనిజాలు – సిమెంట్‌ కారిడార్లు, ఓడరేవుల అనుసంధానం కారిడార్లు, రద్దీ అధికంగా ఉండే కారిడార్లు… ఇలా మూడు ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో వివరించారు. ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకలను మెరుగుపరుస్తామని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె చెప్పారు. కారిడార్ల ఏర్పాటుతో రైళ్ల ప్రయాణ వేగం కూడా పెరుగుతుందని ఆర్థిక మంత్రి అన్నారు.

➡️