ఆలయం సరే… విధ్వంసం మాటేమిటి ?

Jan 12,2024 09:47 #destruction, #fine, #temple
  • గూడు కోల్పోయి రోడ్డున పడ్డ అయోధ్య వాసులు
  • మూతపడిన వ్యాపారాలు…
  • దినదిన గండంగా బతుకులు
  • ప్రజల పాలిట శాపంగా మారిన రోడ్ల విస్తరణ, సుందరీకరణ

లక్నో : ఆధునిక పౌరాణిక కథతో ఓ భారీ బాలీవుడ్‌ చిత్రాన్ని నిర్మిస్తే అందులోని సెట్టింగులు ఎలా ఉంటాయో తెలుసా? ఇప్పుడు అయోధ్యలో కూడా ఎక్కడ చూసినా అలాంటివే దర్శనమిస్తున్నాయి. రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో ఏ మూలన చూసినా బుల్డోజర్లు, ఎక్సవేటర్లు, డ్రిల్లింగ్‌ మిషన్లు రాత్రింబవళ్లూ అవిశ్రాంతంగా పని చూసుకుంటూ పోతున్నాయి. వేలాది మంది కార్మికులు అలుపూ సొలుపూ లేకుండా సుందరీకరణ పనులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. మూడు ప్రధాన రహదారులలో ఉన్న భవనాలకు రామ్‌పథ్‌, భక్తిపథ్‌, రామ జన్మభూమిపథ్‌ అని పేర్లు పెట్టి సర్వాంగసుందరంగా అలంకరిస్తున్నారు. 30 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన యానిమేషన్‌ లే-అవుట్‌ ఆనాటి అయోధ్య రాజ్యాన్ని గుర్తుకు తెస్తోంది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరాన్ని ప్రారంభించి, రాబోయే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సమర శంఖం పూరించబోతున్నారు.

వాస్తవానికి ప్రధాన ఆలయ నిర్మాణం 2025 నాటికి కానీ పూర్తి కాదు. ఐదు సంవత్సరాల బాల రాముడి నూతన విగ్రహ ప్రతిష్టాపన కోసం అక్కడ ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట జరుగుతోంది. అయినప్పటికీ ఇప్పుడు అక్కడ అంతా హడావిడే. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని బీజేపీ ఇచ్చిన హామీ నెరవేరిందన్న ఉత్సాహంతో వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. రామ జన్మభూమి సమీపంలో నివసిస్తున్న ప్రజలు గత ఏడు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ తతంగాన్ని, రాజకీయాలను చూస్తూనే ఉన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి వారికి పెద్దగా ఆనందం కలిగించడం లేదు. పైగా అది వారి పాలిట శాపంగా మారింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరుతో రహదారుల విస్తరణ, సుందరీకరణ పనుల కోసం తమ నివాస గృహాలను నేలమట్టం చేయడం, జీవనోపాధిని దెబ్బతీయడం వారిని కుంగదీస్తోంది.

నామమాత్రపు నష్టపరిహారంతో సరి

నగరంలో జరిగిన అభివృద్ధిపై కొందరు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఓ కలగా ఉన్నదని అంటూనే జరిగిన విధ్వంసాన్ని కూడా కాదనలేమని చెప్పారు. నివాస గృహాలు కోల్పోయిన వారికి అధికారులు నామమాత్రంగా నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఇచ్చిన ఆ కొద్దిపాటి సొమ్ము ఇంటి పునర్నిర్మాణానికి ఏ మూలకు చాలలేదు. రోడ్ల విస్తరణ ప్రాజెక్టు కోసం చిన్న చిన్న దుకాణాలను తొలగించారు. దీంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. స్థానికుల ప్రయోజనాలు, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ ప్రణాళిక ప్రకారం పనులు చేసి ఉంటే బాగుండేదని, దానికి బదులు తమను వేధించి బెదిరించారని, ఇండ్లను కూల్చేసి చాలీచాలని సొమ్ము చేతిలో పెట్టారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

పర్యాటకుల కోసమేనా అభివృద్ధి ?

2019కి ముందు అయోధ్య వ్యాపారులు ఎక్కువగా పరిసర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల పైనే ఆధారపడే వారు. ముఖ్యమైన పండుగలు, ఆధ్యాత్మిక వేడుకలు వచ్చినప్పుడు మాత్రమే అయోధ్య భక్తులతో కళకళలాడుతుండేది. వారు పెట్టే ఖర్చు కూడా పరిమితంగానే ఉండేది. ఉచిత సత్రాలలో బస చేస్తూ, ప్రసాదాలతో కడుపు నింపుకునే వారు. 2019 తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆలయ నిర్మాణానికి అవరోధాలు తొలగిపోవడంతో అయోధ్యలో మార్పులు కొట్టొచ్చినట్లు కన్పించాయి. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వేగవంతంగా వృద్ధి చెందింది. పెద్ద పెద్ద హోటళ్లు వెలిశాయి. యాత్రికుల రద్దీ పెరగడంతో వ్యాపారాలు ఊపందుకున్నాయి. రాబోయే కాలంలో రోజుకు మూడు లక్షల మంది పర్యాటకులు అయోధ్యకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య నగర జనాభా కంటే ఎక్కువే. పర్యాటకుల అవసరాలు తీర్చేందుకు నగరంలో మౌలిక సదుపాయాలను వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఇదంతా పర్యాటకుల కోసమే. రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఇళ్లు, జీవనోపాధి కోల్పోయిన స్థానికుల కోసం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కన్పించడం లేదు. ఆలయానికి సమీపంలో ఉన్న పూజా సామగ్రి దుకాణాలను తొలగించి కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేసిన నూతన వాణిజ్య సముదాయానికి తరలించారు. అయితే అంతదూరం వచ్చి పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పైగా దుకాణాల లీజుకు లక్షల్లో రేటు నిర్ణయించారు. దీంతో కొందరు వ్యాపారాలు మూసేసుకోవాల్సి వచ్చింది.

రోడ్ల విస్తరణ, భారీ విగ్రహాలు, సుందరీకరణ…ఇవేవీ స్థానికులు కోరుకుంటున్నవి కావు. ఈ పనులన్నీ పర్యాటకులు, సందర్శకుల ప్రయోజనాల కోసం చేస్తున్నవే. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. నగరంలోని కొన్ని ప్రాంతాలకు నెలల తరబడి మంచినీటి సరఫరా జరగడం లేదు. నగరంలో నిపుణులైన వైద్యుల కొరత అధికంగా ఉంది. బైపాస్‌ వంటి శస్త్రచికిత్సల కోసం రాజధాని లక్నోకు వెళ్లాల్సి వస్తోంది.

భయం గుప్పెట్లో మైనారిటీలు

అయోధ్యలో నివసిస్తున్న ముస్లింలు క్షణమొక యుగంగా ప్రాణాలు అరచేత పట్టుకొని జీవిస్తున్నారు. వారిలో మసీదు కూల్చివేత మిగిల్చిన గాయాలు ఇప్పటికీ మానలేదు. 1992 నాటి భయానక ఘటనలు పునరావృతమవుతాయేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజులలో హిందువులు లక్షలాదిగా అయోధ్యకు తరలివస్తారు. వారిలో ఎవరైనా మతోన్మాదులు ఉంటే పరిస్థితి ఏమిటి? ఊహించుకోవడానికే భయమేస్తోందని మైనారిటీలు తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం జరిగిన విధ్వంసకాండలో అనేక మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. మైనారిటీల నివాస గృహాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఎలాగో కోలుకొని ఇండ్లను తిరిగి నిర్మించుకున్నామని, జీవితాలు గాడిలో పడ్డాయని అనుకుంటుంటే ఇప్పుడు మరోసారి నగర సుందరీకరణ పేరిట తమ ఆస్తులను ధ్వంసం చేశారని మైనారిటీలు వాపోయారు. పైగా అయోధ్యలో మైనారిటీల దుకాణాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. వారి వ్యాపారాలు కూడా అంతంత మాత్రమే. ఉద్రిక్తతలను నివారిండానికి అనేక మంది ముస్లింలు హిందూ సమూహంతో రాజీ పడి జీవిస్తున్నారు. అయితే కొందరు హిందూ ఛాందసవాదులు మాత్రం మైనారిటీలే లక్ష్యంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ల్యాండ్‌ మాఫియా ఆగడాలు మితిమీరాయి. మైనారిటీల ఆస్తులను సొంతం చేసుకునేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది.

ఒకప్పుడు అయోధ్య అందరిదీ

చారిత్రకంగా చూస్తే అయోధ్య కేవలం హిందువులకే కాదు…ఇస్లాం, జైన, బౌద్ధ, సిక్కు మతాల ప్రాభవానికి కూడా అది కేంద్రంగా ఉంది. అక్కడ హిందూ దేవాలయాలతో పాటు మసీదులు, జైన దేవాలయాలు, గురుద్వారాలు, బౌద్ధ ప్రదేశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అయోధ్య బహుళ సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోయింది. ఈ నగరం బహుళ జాతి సంస్థలకు డబ్బు సంపాదించడానికి, పార్టీలకు ఓట్లు రాల్చడానికి కేంద్రంగా మారింది.

ఇక ఈ నెల 22న అట్టహాసంగా జరుగుతున్న ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగస్వాములయ్యే అవకాశం స్థానికులకు మాత్రం లేదు. వారెవ్వరికీ ఆహ్వానాలు లేవు. ‘నగరంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. కానీ రాముడిపై స్థానికులకు ఉన్న హక్కును నిరాకరిస్తున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నగర వాసులు హాజరు కావడం వారికి ఇష్టం లేదు. మమ్మల్ని ఇండ్లలోనే ఉండమని చెబుతున్నారు’ అని స్థానికులు వాపోతున్నారు.

➡️