అటు ఇడి దాడులు… ఇటు బిజెపికి డబ్బు మూటలు

Feb 24,2024 10:03 #BJP, #bundles of money, #ED attacks
  • న్యూస్‌ పోర్టళ్ల పరిశోధనలో వెల్లడి

న్యూఢిల్లీ : ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరచడం ద్వారా వివిధ కంపెనీల నుండి పెద్ద మొత్తంలో బిజెపికి విరాళాలు అందిన విషయాన్ని న్యూస్‌పోర్టళ్ల పరిశోధనలో తేలింది. 2018-19 నుండి 2022-23 మధ్య ఇడి, ఐటి దాడులు ఎదుర్కొన్న 30 కంపెనీల నుంచి అధికార బిజెపికి బిజెపికి రూ.335కోట్ల మొత్తాల విరాళాల రూపంలో ముట్టాయని న్యూస్‌ లాండ్రీ, న్యూస్‌ మినిట్‌ వంటి న్యూస్‌ పోర్టళ్ళు వెల్లడించాయి. వీటిలో, 23 కంపెనీలు 2014 నుండి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు గురయ్యేవరకు బిజెపికి ఒక్క రూపాయి కూడా విరాళంగా ఇవ్వలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కంపెనీలపై దాడులు చేసిన నాలుగు నెలల వ్యవధిలోనే ఆ కంపెనీలు రూ.9.05 కోట్లకు పైగా మొత్తాన్ని బిజెపికి అందజేశాయి. గతంలో పార్టీకి విరాళమిచ్చిన ఆరు కంపెనీలు ఈ దాడులు మొదలైన తర్వాత మరింత అధిక మొత్తాలను అందచేశాయి. గతంలో బిజెపికి విరాళాలు ఇచ్చినా కూడా ఒక ఏడాది పాటు ఇవ్వని ఆరు కంపెనీలపై దాడులు జరిగాయి. విరాళాలు ఇచ్చిన 30 కంపెనీల్లో మూడు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులు ఇచ్చిందనే ఫిర్యాదులు కూడా వున్నాయి. ఐదేళ్ళపాటు కంపెనీల ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్‌లను, ఎన్నికల కమిషన్‌ పత్రాలను పరిశీలించిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థల బెదిరింపులతో వసూలు చేసిన విరాళాల వివరాలతో న్యూస్‌ మినిట్‌, న్యూస్‌లాండ్రీల బృందం ఒక నివేదికను రూపొందించింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోని కంపెనీలు బిజెపికి విరాళమిచ్చాయి. కోటి రూపాయిలకు పైగా విరాళమిచ్చిన కంపెనీల సమాచారాన్ని మీడియా బృందం చెక్‌ చేసింది. దాడుల సందర్భంగా కొన్ని సంస్థలు విరాళమిస్తే, ఇతర కంపెనీలపై దాడులు చేస్తుండగానే విరాళం అందచేసిన కంపెనీలు ఇంకొన్ని వున్నాయి. విరాళాలు అందిన తర్వాత కొన్ని కంపెనీలపై చర్యలు విరమించుకోవడం కూడా జరిగింది. మరికొన్ని కంపెనీలపై ఇంకా దాడులు కొనసాగుతునే వున్నాయి. 2022-23లో ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపి రూ.1300కోట్లు వసూలు చేసింది. 2018-2022 మధ్యలో బిజెపి అందుకున్న మొత్తం విరాళాల్లో 57శాతం ఎన్నికల బాండ్ల ద్వారానే వచ్చాయి. గత పదేళ్ళలో ఎన్నికల ట్రస్టుల ద్వారా కూడా పెద్ద మొత్తాలనే సేకరించింది. వివిధ ట్రస్టుల ద్వారా రూ.1893 కోట్లు బిజెపి వసూలు చేసింది. కొద్ది రోజుల క్రితమే రాజ్యాంగ విరుద్ధమంటూ ఎన్నికల బాండ్లను సుప్రీం కోర్టు రద్దు చేసింది.

బిజెపి బ్లాక్‌మెయిలింగ్‌: ఏచూరి

న్యూస్‌ పోర్టళ్ళ నివేదిక నేపథ్యంలో సిపిఎం నేత సీతారాం ఏచూరి దీనిపై స్పందిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడానికి ఇడి, సిబిలను ఉపయోగించడమే కాకుండా బ్లాక్‌మెయిలింగ్‌ కళలో కూడా మోడీ ప్రభుత్వం సిద్ధహస్తురాలని తాజా వివరాలతో రుజువైందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

వసూలీ భాయిలా ప్రధాని మోడీ: రాహుల్‌ గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీ వసూలీ భాయిలా వ్యవహరిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరచి డొనేషన్ల బిజినెస్‌ను పెంచుకుంటు న్నారు. ఇదీ మోడీగారి ‘బెల్‌ అండ్‌ బిజినెస్‌ స్కీమ్‌’

➡️