అమాత్యుల అసత్యాలు, అర్ధ సత్యాలు

Dec 30,2023 09:19 #half-truths, #Untruths

             రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్వల్ప వేతనాలతో బతుకులీడుస్తున్న అంగన్‌వాడీ, మున్సిపల్‌, గ్రామ/ వార్డు సచివాలయ వాలంటీర్లు, సమగ్ర శిక్ష తదితర రంగాల్లోని చిరుద్యోగులు ఆందోళనబాట పట్టడంతో ఊపిరాడని సర్కారు అందులోంచి బయటపడడానికి అవాస్తవాలను ఆసరా చేసుకోవడం దారుణమైన విషయం. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రులే అందుకు పూనుకోవడం వారి వ్యక్తిగత ప్రతిష్టకేగాక సర్కారుకూ మాయని మచ్చ. పాత్రికేయులకు నిజానిజాలు తెలుసు కనుక మంత్రులు వల్లెవేసే అవాస్తవాలను తమ వార్తలు, కథనాల్లో ప్రచురించకపోవడంతో ప్రజా ధనం వెచ్చించి కొన్ని దినపత్రికల్లో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ పేరిట వాణిజ్య ప్రకటనల ద్వారా అసత్యాలు, అర్ధ సత్యాలను ప్రభుత్వమే వండి వార్చడం అభ్యంతరకరం. సర్కారువారి అధికార పత్రికలో మాత్రం వాస్తవాలను వక్రీకరించి ‘అంగన్‌వాడీలకు అడిగినవన్నీ…’ అంటూ అవాస్తవాలతో కూడిన కథనాలను పుంఖానుపుంఖాలుగా వదలడం ఆశ్చర్యకరం కాదు. (ఆ పత్రికను నడుపుతున్నదే అందుకు కనుక!) నిజానికి ఇప్పుడు ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లు నాటి ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వాగ్దానాలను అమలు చేయాలనేేే! అలాగే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం గ్రాట్యుటీ చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం వంటివాటిని ప్రభుత్వం అమలు చేయాలని నొక్కి చెప్పింది. కాబట్టి ఇవి ఎంతమాత్రమూ గొంతెమ్మ కోర్కెలు కావు. నూటికి నూరు పాళ్లూ న్యాయమైనవి.

పెంచింది వెయ్యి రూపాయలే !

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన నాటికి అంగన్‌వాడీల వేతనాలు వర్కర్‌కు రూ.10,500 మినీ వర్కర్‌కు, హెల్పర్‌కు రూ.6,000. ఈ ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయల చొప్పున మాత్రమే (జీవో 13 జూలై 2019) పెంచింది. వాస్తవం ఇదికాగా ఆ వాణిజ్య ప్రకటనలో వర్కర్‌ వేతనం రూ.7,000 నుండి అమాంతం రూ.11,500కు తమ సర్కారే పెంచినట్టు అర్థం వచ్చేలా అవాస్తవాలు పేర్కొంది. అక్కడితో ఆగకుండా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలకు నగదు బదిలీ చేసినట్టు మరో కొండంత అబద్ధం చెప్పింది. అంగన్‌వాడీ వర్కర్‌ నెలకు రూ.11,500 చొప్పున ఎడాదికి రూ.1,38,000 సంపాదిస్తున్నారనీ, సంక్షేమ పథకాలకు ప్రాతిపదికయైన తెల్ల రేషన్‌ కార్డు (బిపిఎల్‌) వార్షికాదాయ పరిమితి రూ.1,20,000 కంటె ఇది ఎక్కువ కనుక ఆ కుటుంబానికి తెల్ల కార్డు కట్‌, సంక్షేమ పథకాలూ 2020లోనే నిర్దాక్షిణ్యంగా నిలిపివేశారు. ఈ నెల 21న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ సైతం ఆయా పథకాలకు ఉన్న నిబంధనల ప్రకారం అమలు చేస్తారంటూ వివరణ కూడా ఇచ్చివున్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ వర్కర్లకు నవరత్నాలు లేదా ఇతర నగదు బదిలీ పథకాలు అందడంలేదన్నది పచ్చి నిజం. డిసెంబర్‌ 12 నుండి సమ్మె జరుగుతుంటే అంగన్‌వాడీల డిమాండ్లు ముఖ్యమంత్రికి తెలియవని 26న జరిగిన చర్చల్లో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ చెప్పిన మాట నిజమని ఎవరైనా అనుకోగలరా?

పోలీసు సాయంతో పోటీ కార్మికులెందుకు ?

మున్సిపల్‌ కార్మికులు తమ కష్టాలు వివరిస్తూ గత నాలుగేళ్లలో ప్రభుత్వానికి ఎన్నోమార్లు విన్నవించుకున్నా అవి పరిష్కారం కానందున తప్పనిసరియై డిసెంబర్‌ 26 నుండి నిరవధిక సమ్మెకు దిగారు. తీరికగా మూడవ రోజున చర్చలు జరిపిన మంత్రివర్యులు కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించడానికి బదులు అసత్యాల మూట విప్పి గురువారం రాత్రి మీడియాకు వినిపించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాల్టీల్లో 41 చోట్ల సమ్మె జరగడం లేదన్నారు. అంటే 82 పట్టణాల్లో సమ్మె జరుగుతోందని ఒప్పుకోవలసి వచ్చిందన్నమాట. వాస్తవానికి 105 పట్టణాల్లో సమ్మె విజయవంతంగా నడుస్తోంది. మొత్తం కార్మికుల్లో దాదాపు నాలుగింట మూడు వంతుల మందికి పైగా విధులకు వెళ్లడంలేదు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు పుట్టపర్తి, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు తదితర చోట్ల పోలీసుల సహాయంతో పోటీ కార్మికుల్ని పనిలోకి దింపడానికి సర్కారు చేసిన కుయత్నాల్ని సమ్మెకారులు శాంతియుతంగానే తిప్పికొట్టారు. సమ్మె అంతగా జరగకపోతే పోలీసులకు ఈ డ్యూటీలు ఎందుకు వేసినట్టో అమాత్యులే సెలవివ్వాలి!

నిజంగానే నిధులు లేవా…?

ప్రభుత్వానికి చిరుద్యోగుల పట్ల ఎంతో సానుభూతి ఉందనీ, వారి డిమాండ్లు కూడా న్యామైనవేనని అంటూనే ఇవ్వాలనివున్నా నిధులు లేవని ప్రభుత్వ పెద్దలు సుతిమెత్తగా చెబుతున్నారు. ఇది నిజమా..? అయితే ప్రజల మాడు పగులగొట్టేలా ఇప్పటికే ట్రూ అప్‌, ఎఫ్‌పిపిసిఎ తదితర పేర్లతో కరెంటు చార్జీలను పెంచిన సర్కారు తాజాగా 20 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు పెడతానంటోంది. ఆ నిధులెక్కడివి..? విద్యార్థులకిచ్చిన ట్యాబులు, వాటిలో నింపిన బైజూస్‌ కంటెంట్‌ కొనుగోలులో రూ.1,250 కోట్ల కుంభకోణం జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే అదానీ, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌, బైజూస్‌, ఏసర్‌ వంటి కార్పొరేట్లకు, కాంట్రాక్టర్లకూ సర్కారు బొక్కసాన్ని అప్పజెప్పడానికి ఎలాంటి ఆటంకాలూ లేవన్నమాట. పోలవరం, పులిచింతల తదితర ఇరిగేషన్‌ పనుల్లో జరుగుతున్న వ్యయం మీదా అనేక కథనాలు వస్తున్నాయి. తాజాగా గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోవడం. ఇలా నిధులు గంగ పాలవుతుండగా చిరుద్యోగుల్ని, అసంఘటిత కార్మికుల్ని వీధుల పాల్జేయడం సర్కారుకు తగునా? ఈ ప్రభుత్వం ఎవరి పక్షం వహిస్తున్నట్టు?

బుజ్జగింపులు… బెదిరింపులు

‘మీరంతా మావాళ్లు. మీకు వీలైనంత మంచి చేయాలన్నదే మా తపన…’ అని అంగన్‌వాడీలకు తేనెలొలికే మాటలు చెప్పిన గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ అదే పేరాలో ‘ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాల్సిన పరిస్థితిని తీసుకురావద్దని…’ హెచ్చరించడం కొస మెరుపు. సర్కారు ఒకవైపు బుజ్జగింపు మాటలు చెబుతూ బెదిరింపులకు పూనుకోవడం క్షంతవ్యం కాదు. నిజానికి ప్రత్యామ్నాయ చర్యలకు ప్రభుత్వం ఇప్పటికే తెగబడింది. ‘పులి తన పిల్లలను తానే తింటుందన్న’ సామెత మాదిరిగా ప్రభుత్వోద్యోగులతో పోలీసు పహరామధ్య ప్రభుత్వ ఆస్తి అయిన అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టించిన ‘ఘనత’ ఈ సర్కారుకే దక్కింది. అది కూడా కొన్ని చోట్ల అర్ధరాత్రి, అపరాత్రి వేళల్లో యత్నించడం సిగ్గుచేటు. అయినా అంగన్‌వాడీలు, వారికి మద్దతుగా లబ్ధిదార్లు, ఆయా నివాస ప్రాంతాల ప్రజలూ మద్దతుగా ఎదురుతిరగడంతో పాలకుల ఆటలు సాగలేదు. ఆందోళనకారులకు ఇంతలా ప్రజల మద్దతు లభించడం ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు. అందుకే సమ్మెకారులకు సానుభూతితో ఉన్న ప్రజలకు అవాస్తవాలు చెప్పి తనవైపు మళ్లించుకోవడానికి సర్కారు ఇటువంటి కుయత్నాలకు పాల్పడుతోంది. ఈ కుట్రను అందరూ అర్థం చేసుకొని సమర్థవంతంగా సమైక్యంగా తిప్పికొట్టాలి. అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, గ్రామ/ వార్డు సచివాలయ వలంటీర్లు, సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఆందోళన న్యాయసమ్మతమైనది. వారి సమస్యలను పరిష్కరించి సమ్మెలు విరమింపజేయడం ప్రభుత్వ కర్తవ్యం. ఇప్పటికైనా సర్కారు ఆ దిశగా అడుగులు వేయాలి.

➡️