పట్టణాల్లో నిరుద్యోగిత 6.5% – మహిళల నిరుద్యోగిత రేటు 8.6 శాతం

Feb 13,2024 09:08

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు మూడో త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు 2023) 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు 6.5 శాతంగా నమోదైంది. మహిళల నిరుద్యోగిత రేటు 8.6 శాతం నమోదైంది. ఈ మేరకు కేంద్ర గణాంకాల, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో శ్రామికశక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పిఆర్‌) 2022 మూడో త్రైమాసికంలో 48.2 శాతం నుండి 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తుల కోసం 2023 మూడో త్రైమాసికంలో 49.9 శాతానికి పెరుగుతున్న ధోరణిని చూపించిందని మంత్రిత్వశాఖ తెలిపింది. అదే కాలంలో, మహిళా శ్రామికశక్తి భాగస్వామ్య రేటు 22.3 శాతం నుంచి 25 శాతానికి పెరిగింది. ఇది ఎల్‌ఎఫ్‌పిఆర్‌లో మొత్తం పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తుందని తెలిపింది. వర్కర్‌-పాపులేషన్‌ రేషియో (డబ్ల్యుపిఆర్‌)లో పెరుగుతున్న ట్రెండ్‌ గుర్తించింది. పట్టణ ప్రాంతాల్లో ఎల్‌ఎఫ్‌పిఆర్‌ అక్టోబర్‌ – డిసెంబర్‌ 2022లో 44.7 శాతం నుండి అక్టోబర్‌ – డిసెంబర్‌ 2023 నాటికి 46.6 శాతానికి పెరిగింది. పురుషుల్లో ఈ కాలంలో ఇది 68.6 శాతం నుండి 69.8 శాతానికి పెరిగింది. మహిళల్లో ఇది 20.2 శాతం నుండి 22.9 శాతానికి పెరిగింది. ఏప్రిల్‌-జూన్‌ 2023లో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు ఏడాది క్రితం 7.6 శాతం నుండి 6.6 శాతానికి తగ్గింది. ప్రధానంగా దేశంలో కోవిడ్‌-సంబంధిత పరిమితుల అస్థిరమైన ప్రభావం కారణంగా ఏప్రిల్‌-జూన్‌ 2022లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది.

➡️