రుణాల రీషెడ్యూల్‌కు చెల్లుచీటీ

Jan 5,2024 09:45 #Loans, #rescheduling, #Validity
  • విపత్తు రైతులవెసులుబాటుకు రాం రాం
  • ఇంట్రస్ట్‌ పెట్టుకొనేందుకు కేంద్రం, రాష్ట్రం నిరాకరణ
  • సున్నావడ్డీ సాకు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : విపత్తుల రైతులకు తక్షణం కాస్తంత తాత్కాలిక ఉపశమనం కలిగించే బ్యాంక్‌ రుణాల రీషెడ్యూల్‌ పథకానికి ప్రభుత్వాలు, బ్యాంక్‌లు చెల్లుచీటీ ఇచ్చేశాయి. సున్నావడ్డీ, పావలా వడ్డీలు వచ్చాక రుణాల వాయిదాను పట్టించుకోవట్లేదు. టిడిపి హయాంలోనే అన్నదాతల అప్పుల రీషెడ్యూల్‌కు నిరాదరణ ఎదురుకాగా ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా వదిలేసింది. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో కరువు, తుపాన్‌ వచ్చి భారీగా పంటలను దెబ్బతీశాయి. రైతులను ఆర్థికంగా కుదేలు చేశాయి. కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. కానీ రుణాల వాయిదాపై కేంద్రానికి, రిజర్వ్‌బ్యాంక్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలేమీ పంప లేదని తెలుస్తోంది. బ్యాంకులు సైతం నిర్లిప్తత పాటిస్తున్నాయి. పంటలు నష్టపోయిన రైతులు తిరిగి పంటలేసుకోడానికి, వ్యవసాయం సాగించడానికి పెట్టుబడులు అవసర మవుతాయి. తీసుకున్న రుణాల చెల్లింపులను వాయిదా వేసి, కొత్త అప్పులిప్పించాల్సిన తరుణంలో రీషెడ్యూల్‌ను మర్చిపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది.

రూ.40 వేల కోట్లు !

ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావంతో లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయలేదు. వేసిన లక్షల ఎకరాల్లో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. రైతుల ఆందోళనలను వినిపించుకోకుండా ప్రభుత్వం ఏడు జిల్లాల్లోని 103 మండలాల్లోనే కరువును ప్రకటించి ంది. ఆ ప్రాంతాల్లోనైనా రైతుల ఖరీఫ్‌ రుణాలను రీషెడ్యూల్‌ చేయాల్సి ఉండగా ఆ వైపు సర్కారు ఆలోచించట్లేదు. మిచౌంగ్‌ తుపాన్‌ కోస్తాలోని పలు జిల్లాల్లో పంటలను కబళించింది. రాయలసీమలోనూ అక్కడక్కడ పంటలపై ప్రభావం చూపించింది. తుపాన్‌ మండలాలను గుర్తించి రైతు రుణాలు రీషెడ్యూల్‌ చేయాలని కేంద్రానికి, ఆర్‌బిఐకి వినతులు పంపలేదు. ఖరీఫ్‌లో రాష్ట్రంలోని అన్ని బ్యాంకులూ కలుపుకొని రూ.87 వేల కోట్ల పంట రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. రూ.80 వేల కోట్ల వరకు పంపిణీ జరిగిందని చెబుతున్నారు. ఇచ్చిన రుణాల్లో రూ.40 వేల కోట్ల వరకు కరువు, తుపాన్‌ ప్రాంతాల్లోని రైతులవని, వాటన్నింటినీ వాయిదా వేయాల్సి ఉంటుంది.

భారంగా భావించే…

బ్యాంకులు రైతులకు ఏడు శాతం వడ్డీపై పంట రుణాలిస్తున్నాయి. సకాలంలో తిరిగి చెల్లిస్తే మరో మూడు శాతం రిబేటు ప్రకటించాయి. గడువులోపు చెల్లిస్తే తతిమ్మా నాలుగు శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటామంది. ఉత్తరోత్తర సున్నా వడ్డీ అంటోంది. రైతులు సకాలంలో తిరిగి కట్టలేకపోవ డం, ఆధార్‌, ఇ-క్రాప్‌ వంటి ఆంక్షల కారణంగా రైతులకు సున్నావడ్డీ అమలు కావట్లేదు. కేంద్రం ఇస్తామన్న 3 శాతం, రాష్ట్రం ఇస్తామన్న 4 శాతం వడ్డీ రాయితీలు రాక పూర్తిగా ఏడు శాతం వడ్డీ కడుతున్నారు. రుణాల రీషెడ్యూల్‌ విషయానికొస్తే విపత్తుల సమయంలో రైతుల అప్పులపై ఒక ఏడాది మారటోరియం విధిస్తారు. అంటే మొదటి సంవత్స రం అప్పు కట్టకుండా వెసులుబాటు దొరుకుతుంది. రెండో ఏడాది నుంచి మూడేళ్ల్లలో సంవత్సరానికి ఇంత అని మూడు సమాన వాయిదాల్లో వడ్డీతో సహా చెల్లించాలి. రీషెడ్యూల్‌ రుణాలపై వడ్డీ 10-12 శాతం పడుతుంది. సున్నా వడ్డీ అంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తులతో రీషెడ్యూల్‌ చేసిన రుణాలపై బ్యాంకులు వేసే వడ్డీని భరించడానికి నిరాకరిస్తున్నాయి. ఈ వాస్తవం నుంచి రైతులను దృష్టి మళ్లించేందుకు సున్నావడ్డీని ముందుకు తెచ్చి గడువులోపు కట్టుకుంటే వడ్డీ భారం ఉండదని ఉచిత సలహా ఇస్తున్నాయి. బ్యాంకులు కూడా రీషెడ్యూల్‌ను పక్కనపెట్టి రుణాల పునరుద్ధరణ (రెన్యువల్‌)కు పాల్పడుతున్నాయి. కొత్తగా రుణాలిచ్చినట్లు పుస్తకాల్లో రాసుకుంటున్నాయి. విపత్తు రైతులకు కొత్తగా రూపాయి కూడా ఇవ్వట్లేదు.

➡️