చంద్రబాబు కోరుకునే రాష్ట్ర ప్రయోజనాల్లో స్టీల్‌ప్లాంట్‌ స్థానం ఎక్కడ ?

  • ఉక్కు ఫ్యాక్టరీ వైపు కన్నెత్తి చూడలేదెందుకు !
  • నామమాత్రంగానే రాష్ట్ర ప్రభుత్వ స్పందన
  • విశాఖ కార్మికులు, ప్రజల్లో నడుస్తోన్న చర్చ

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు, ప్రజల భవిష్యత్తు కోసమే బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందని ప్రకటించిన చంద్రబాబుకు మూడేళ్లుగా స్టీల్‌ప్లాంట్‌ గుర్తుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు తర్వాత వెంటనే వినపడేది వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ అన్నది ఆ పార్టీ నాయకులు సైతం చటుక్కున చెబుతారు. కేంద్రంలోని మోడీ సర్కారు మూడేళ్ల క్రితం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వంద శాతం వ్యూహాత్మక అమ్మకం చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకించలేదు. ఇటీవల కేంద్రంలోని బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పుడు సైతం టిడిపి, జనసేన అధినేతలు స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఆపుతామని చెప్పకపోవడం ఏ ప్రయోజనాల కోసం వీరు బిజెపితో కలిశారు? అన్న ప్రశ్న రాష్ట్రంలోని కార్మికులే కాదు అన్ని తరగతుల నుంచీ వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, అధికార వైసిపి నామ్‌కేవాస్తేగా ఒక తీర్మానం చేసిందే తప్ప, ప్రయివే టీకరణకు వ్యతిరేకంగా కేంద్రాన్ని నిలేసింది లేదు. వారి తీరు అలా ఉంటే, వీరి తీరు ఇలా ఉంది.

కనీసం ఆ సభలోనైనా ప్రకటన వస్తుందని…
చిలకలూరిపేటలో ఇటీవల జరిగిన బిజెపి, టిడిపి, జనసేన (కూటమి) సభకు దేశ ప్రధానమంత్రి మోడీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ద్వారా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ‘స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ జరగదు’ అన్న ప్రకటన చేయిస్తారన్న ఆశతో కార్మికులు చూశారు. కానీ, సభ అంతా పూర్తయినా స్టీల్‌ప్లాంట్‌ ఊసే లేకపోవడం ప్రజలను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు కుట్రలు కొనసాగిస్తుండడంతో పాటు సొంత గనులు ఇవ్వకుండా ప్లాంట్‌ను ఎండగట్టేసింది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3లోకి జిందాల్‌ను తీసుకొచ్చేసింది. పలు విభాగాలను ముక్కలు ముక్కలు చేసి ప్రయివేట్‌ వారికి ఇచ్చేయాలన్న కుట్రలు బిజెపి చేస్తూనే ఉంది.

ఎందుకు పర్యటించడం లేదు ?
వైజాగ్‌ స్టీల్‌ను రక్షించుకోవడానికి 1144 రోజులు పోరాటం కొనసాగుతున్నా ఏనాడూ ప్లాంట్‌ పర్యటనకు చంద్రబాబు రాలేదు. కార్మికులను కలవడంగానీ, వారి పోరాటానికి మద్దతు ప్రకటించడంగానీ చేయలేదు. ఇది స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. కేంద్రం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరించాలని నిర్ణయిస్తే ఆ పార్టీతో మీరెలా పొత్తుపెట్టుకున్నారంటూ ఉక్కులో టిఎన్‌టియుసి నేతలను మిగతా కార్మికులు ప్రశ్నిస్తుండడంతో వారి నోట సమాధానం రావడం లేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వద్ద లేదా రాష్ట్రంలో ఎక్కడ సభ నిర్వహించినా వైసిపి కబంధ హస్తాల్లో రాష్ట్రం చిక్కుకుందంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అన్నారే తప్ప, స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ సరైంది కాదని ప్రకటించలేదు. టిడిపి నాయకుడు పల్లా శ్రీనివాసరావు (గాజువాక టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి) దీక్ష చేసినప్పుడు సైతం ఆయనను పరామర్శించడానికి రాలేదంటే బిజెపి నిర్ణయాన్ని వ్యతిరేకించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని స్పష్టమవుతోంది.

నాగర్‌నార్‌ ఉక్కు ఫ్యాక్టరీ ప్రతిపక్షాల ఆందోళనతో నిలవలేదా ?
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపై ప్రజలు, కార్మికులు చేస్తోన్న పోరాటాలు ఆయా రాష్ట్రాల్లోని అధికార పక్షం లేదా ప్రతిపక్షం కలిసి వస్తే విజయం అవుతాయి. దీనికి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నాగర్‌నార్‌ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాటం తాజా ఉదాహరణ. ఈ ఫ్యాక్టరీని బిజెపి ప్రయివేటీకరణకు పెట్టిన సందర్భంగా అక్కడి ప్రతిపక్షాలు పోరాడి నిలుపుదల చేశాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ విషయంలో మన రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు రెండూ బిజెపి నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించడం లేదు. 2024 ఎన్నికల్లో అధికారం కోసం ఆశిస్తోన్న టిడిపి, ఈ రాష్ట్ర జనహితం, భవిష్యత్తు కోసం దేనికైనా సిద్ధం అని చెప్పుకుంటున్న జనసేన కూడా బిజెపికి వంతపాడుతూ వస్తున్నాయి. బిజెపితో పొత్తు జనహితమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నప్పుడు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ జనహితం కాదా? అనేది చెప్పాలి.

➡️