ఆంధ్రకు ఆధిక్యత- ఉత్తరప్రదేశ్‌తో రంజీట్రోఫీ మ్యాచ్‌

Feb 10,2024 22:30 #Sports

విశాఖపట్నం: ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 4వికెట్ల నష్టానికి 235పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర జట్టు 261పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఉత్తరప్రదేశ్‌ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 198పరుగులకే ఆలౌట్‌ చేసింది. శశికాంత్‌కు ఐదు, నితీశ్‌ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. దీంతో ఆంధ్రజట్టుకు 70పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్ర జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 19పరుగులు చేసింది. దీంతో ఆంధ్రజట్టుకు ఇప్పటికే 82పరుగుల ఆధిక్యత లభించింది. ప్లేట్‌ గ్రూప్‌లో హైదరాబాద్‌ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్‌ 8వికెట్ల నష్టానికి 462పరుగుల ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసిన హైదరాబాద్‌.. నాగాలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 206పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో హైదరాబాద్‌ జట్టుకు 262పరుగుల ఆధిక్యత లభించగా.. నాగాలాండ్‌కు ఫాలో ఆన్‌ ఆడనుంది. పృథ్వీ షా రికార్డు..లంచ్‌లోపే రంజీల్లో సెంచరీటీమిండియా ఓపెనర్‌, ముంబయి బ్యాటర్‌ పృథ్వీ షా రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. రారుపూర్‌ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో పృథ్వీ షా చెలరేగాడు. 107బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 185 బంతులు ఎదుర్కొన్న పఅథ్వీ షా.. 18 ఫోర్లు, 3సిక్స్‌లతో 159 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పృథ్వీ షా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తొలి రోజు లంచ్‌కు ముందే కెరీర్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో అస్సాంపై 379బంతుల్లో 383పరుగులు చేసిన పృథ్వీ షా.. రంజీ ట్రోఫీలోనే రెండో అత్యధిక స్కోరు సాధించాడు. అప్పుడు కూడా మొదటి రోజు లంచ్‌కు ముందే సెంచరీని నమోదు చేశాడు. దీంతో ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 351 పరుగులకు ఆలౌటైంది. భూపేన్‌ లల్వాణీ(102) పరుగులతో రాణించాడు. ఛత్తీస్‌గఢ్‌ బౌలర్లలో ఆశిష్‌ చౌహాన్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రవి కిరణ్‌ మూడు, మాలిక్‌ ఒక్క వికెట్‌ సాధించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఛత్తీస్‌గడ్‌ జట్టు రెండోరోజు ఆట నిలిచే సమయానికి 4వికెట్లు కోల్పోయి 180పరుగులు చేసింది.

➡️