ఇంగ్లండ్‌ను కూల్చిన బుమ్రా

Feb 4,2024 09:08 #Sports

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 143పరుగుల ఆధిక్యత

విశాఖపట్నం: రెండోటెస్ట్‌లోనూ టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 143 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. అనంతరం, నేడు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా… రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 28పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ 15, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 13 పరుగులతో ఉన్నారు. టీమిండియాకు ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యత లభించింది. శనివారం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జస్ప్రీత్‌ బుమ్రా దెబ్బకు కకావికలమైంది. జో రూట్‌(5), ఓల్లీ పోప్‌(23), బెయిర్‌ స్టో(25), కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌(47), టామ్‌ హార్ట్‌ లీ(21), జేమ్స్‌ ఆండర్సన్‌(6) వికెట్లు బుమ్రా ఖాతాలోకి చేరాయి. ముఖ్యంగా, తొలి టెస్టు సెంచరీ హీరో ఓల్లీ పోప్‌ను బుమ్రా అవుట్‌ చేసిన యార్కర్‌ అద్భుతం. ఆ బంతి ఓల్లీ పోప్‌ మిడిల్‌, లెగ్‌ స్టంప్‌లను గిరాటేసింది. ఇక, చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కూడా మూడు వికెట్లతో సత్తా చాటాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనంలో తన వంతు పాత్ర పోషించాడు. అక్షర్‌ పటేల్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 6వికెట్ల నష్టానికి 336పరుగులతో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా 396పరుగులకు పరిమితమైంది. యువకెరటం యశస్వి జైస్వాల్‌(209) డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు ఆండర్సన్‌, షోయబ్‌ బషీర్‌, రెహన్‌ అహ్మద్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. యశస్వీ డబుల్‌ సెంచరీటీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌(209) కెరీర్‌ అత్యధిక స్కోర్‌ డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. 6వ టెస్ట్‌ ఆడుతున్న యశస్వి ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 179 పరుగులతో రెండో రోజు ఆటను కొనసాగించాడు. వ్యక్తిగత స్కోర్‌ 191 పరుగుల వద్ద షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన యశస్వీ.. ఆ మరుసటి బంతికే స్క్వేర్‌ లెగ్‌లో బౌండరీ కొట్టి డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో జైస్వాల్‌ టెస్టుల్లో డబుల్‌ సెంచరీ కొట్టిన భారత నాలుగో ఎడమచేతి వాటం బ్యాటర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. అతడి కంటే ముందు సౌరభ్‌ గంగూలీ(239), వినోద్‌ కాంబ్లీ(227), గౌతం గంభీర్‌(206)లు ఈ ఫీట్‌ సాధించారు.మూడో అతి పిన్న వయస్కుడిగా జైశ్వాల్‌ రికార్డుఅలాగే టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరపున డబుల్‌ సెంచరీ బాదిన మూడో అతి పిన్న వయస్కుడిగా జైశ్వాల్‌ రికార్డులకెక్కాడు. జైశ్వాల్‌ 22ఏళ్ల 37రోజుల వయస్సులో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ(21ఏళ్ల 35రోజులు) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాతి స్ధానంలో సునీల్‌ గవాస్కర్‌(21ఏళ్ల 283రోజులు) జైస్వాల్‌కంటే ముందున్నారు.

స్కోర్‌బోర్డు…

ఇండియా తొలి ఇన్నింగ్స్‌: 396పరుగులు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలే (సి)శ్రేయస్‌ (బి)అక్షర్‌ 76, డకెట్‌ (సి)రజత్‌ పటీధర్‌ (బి)కుల్దీప్‌ 21, పోప్‌ (బి)బుమ్రా 23, రూట్‌ (సి)శుభ్‌మన్‌ (బి)బుమ్రా 5, బెయిర్‌స్టో (సి)శుభ్‌మన్‌ (బి)బుమ్రా 25, స్టోక్స్‌ (బి)బుమ్రా 47, ఫోక్స్‌ (బి)కుల్దీప్‌ 6, రెహాన్‌ అహ్మద్‌ (సి)శుభ్‌మన్‌ (బి)కుల్దీప్‌ 6, హార్ట్‌లీ (సి)శుభ్‌మన్‌ (బి)బుమ్రా 21, ఆండర్సన్‌ (ఎల్‌బి)బుమ్రా 6, షోయబ్‌ బషీర్‌ (నాటౌట్‌) 8, అదనం 9. (55.5ఓవర్లలో ఆలౌట్‌) 253పరుగులు.

వికెట్ల పతనం: 1/59, 2/114, 3/123, 4/136, 5/159, 6/172, 7/182, 8/229, 9/234, 10/253

బౌలింగ్‌: బుమ్రా 15.5-5-45-6, ముఖేశ్‌ కుమార్‌ 7-1-44-0, కుల్దీప్‌ 17-1-71-3, అశ్విన్‌ 12-0-61-0, అక్షర్‌ 4-0-24-1.

ఇండియా రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బ్యాటింగ్‌) 15, రోహిత్‌ (బ్యాటింగ్‌) 13, (5ఓవర్లలో) 28పరుగులు.

బౌలింగ్‌: ఆండర్సన్‌ 2-0-6-0, షోయబ్‌ బషీర్‌ 2-0-17-0, రెహాన్‌ అహ్మద్‌ 1-0-5-0

➡️