తుషార హ్యాట్రిక్‌

Mar 9,2024 22:07 #Sports

మూడో టి20లో బంగ్లాపై 28పరుగుల తేడాతో లంక గెలుపు

సిరీస్‌ 2-1తో కైవసం

సైహేత్‌(బంగ్లాదేశ్‌): నువాన్‌ తుషార టి20ల్లో హ్యాట్రిక్‌తో చెలరేగడంతో మూడో, చివరి టి20లో బంగ్లాదేశ్‌పై శ్రీలంకజట్టు ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 174పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్‌ జట్టు 146పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు టి20ల సిరీస్‌ను శ్రీలంక జట్టు 2-1తో చేజిక్కించుకుంది. తొలుత వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండీస్‌(86) అర్ధసెంచరీకి తోడు శనక(19) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 174పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లు తస్కిన్‌ అహ్మద్‌, రిషాద్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో బంగ్లాదేశ్‌ను లంక పేసర్‌ నువాన్‌ తుషార కట్టడి చేశాడు. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి టి20ల్లో హ్యాట్రిక్‌ తీసిన ఐదో లంక బౌలర్‌గా నిలిచాడు. నాలుగో ఓవర్లో రెండో బంతికి నజ్ముల్‌ షాంటో(1)ను, ఆ తర్వాత బంతికి తౌహిద్‌ హృదరు(0)లను బౌల్డ్‌ చేసిన తుషార్‌.. చివరి బంతికి మహ్మదుల్లా(0)ను ఎల్బీగా ఔట్‌ చేశాడు. దాంతో, టీ20ల్లో హ్యాట్రిక్‌ తీసిన ఐదో లంక బౌలర్‌గా తుషార రికార్డుపుటల్లోకెక్కాడు. లంక తరఫున లసిత్‌ మలింగ, తిషార పెరీరా, అకిలా ధనంజయ, వనిందు హసరంగలు అతడి కంటే ముందు హ్యాట్రిక్‌ వికెట్లు తీశారు. తొలి రెండు టి20ల్లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలుపొందగా.. నిర్ణయాత్మక మూడో టి20లో శ్రీలంక గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ తుషారకు, సిరీస్‌ కుశాల్‌ మెండీస్‌కు లభించాయి. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

➡️