ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌…నెట్స్‌లో చెమటోడ్చుతున్న టీమిండియా

Jan 21,2024 22:30 #Sports

25న హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో తొలిటెస్ట్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 25నుంచి భారత్‌ాఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సత్తా చాటాలనుకుంటున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో బుమ్రా రాణించాడు. ”మీకు తెలుసా నాకు ఇష్టమైన ఫార్మాట్‌ టెస్టు క్రికెట్‌. ఎందుకంటే ఆ ఫార్మాట్‌ అంటే నాకిష్టం. టెస్ట్‌ క్రికెట్‌ ఆడటం నా కల. అది నెరవేరింది. టెస్టుల్లో నాకు కొన్ని ప్రత్యేక జ్ఞాపకాలున్నాయి. ఈ ఫార్మాట్‌లో నా మొదటి వికెట్‌ ఏబీ డివిలియర్స్‌ది. ఇదే నాకెంతో ప్రత్యేకమైనది” అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక హైదరాబాద్‌ చేరకున్న టీమిండియా ఆటగాళ్లు ఆదివారం నెట్‌ ప్రాక్టీస్‌లో చెమటోడ్చారు. హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌, బుమ్రా బ్యాటర్లకు బంతులను విసిరారు. ఇంగ్లండ్‌ క్రికెటర్లు నేడు హైదరాబాద్‌ చేరుకుంటారని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావు వెల్లడించాడు. బ్రూక్‌ తిరుగు పయనం ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ హారీ బ్రూక్‌ భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు జట్టు సభ్యులతో కలిసి భారత్‌ వచ్చిన బ్రూక్‌ వ్యక్తిగత కారణాలరీత్యా ఇంగ్లండ్‌కు తిరుగు పయనమయ్యాడు. ఈమేరకు ఇంగ్లండ్‌ క్రికెట్‌బోర్డు(ఇసిబి) ఆదివారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో 24ఏళ్ల బ్రూక్‌ స్థానంలో డాన్‌ లారెన్స్‌ను ఇసిబి ఎంపిక చేసింది. సర్రేకు చెందిన లారెన్స్‌ సోమవారం ఇంగ్లండ్‌ జట్టుతో కలవనున్నాడు. బెన్‌ స్టోక్స్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు 25నుంచి భారత్‌తో హైదరాబాద్‌ వేదికగా జరిగే తొలిటెస్ట్‌లో తలపడనుంది.

➡️