ఫ్రెంచ్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ విజేత సాత్విక్‌-చిరాగ్‌

Mar 11,2024 07:55 #Sports

పారిస్‌: భారత పురుషుల డబుల్స్‌ జోడీ మరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌750 ఫైనల్లో చైనీస్‌ తైపీ ధ్వయంను చిత్తుచేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో వీరు 21-11, 21-17తో లీ-ఝీ, యంగ్‌ పో-హువాన్‌లను చిత్తుచేసి ఈ ఏడాది తొలి టైటిల్‌ను చేజిక్కించుకున్నారు. తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన భారత బృందం.. రెండో గేమ్‌లో ఓ దశలో 9-11పాయింట్లతో వెనుకబడ్డా పుంజుకొని టైటిల్‌ను చేజిక్కించుకోవడం విశేషం. ఈ మ్యాచ్‌ కేవలం 37నిమిషాల్లోనే ముగిసింది. ఈ జంట 2022లోనూ తొలిసారి ఈ టైటిల్‌ను చేజిక్కించుకున్నారు. సెమీస్‌లో వీరు 21-13, 21-16తో కొరియా జంటను చిత్తుచేసి ఫైనల్‌కు చేరారు.

➡️