ముగించేదెవరు?

Feb 5,2024 07:48 #Sports

భారత్‌కు 9 వికెట్లు, ఇంగ్లాండ్‌కు 332 పరుగులు

రసవత్తరంగా విశాఖ టెస్టు మ్యాచ్‌

శుభ్‌మన్‌ గిల్‌ శతక జోరు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 255/10

ఛేదనలో ఇంగ్లాండ్‌ 67/1

విశాఖ టెస్టు మూడో రోజు విశాఖ టెస్టు సమరం రసవత్తరంగా మారింది. భారత్‌ ఇద్దరు బ్యాటర్లు శతక మోత మోగించినా, ఓ పేసర్‌ ఆరు వికెట్లతో విజృంభించినా ఇంగ్లాండ్‌ ఇంకా మ్యాచ్‌ రేసులోనే నిలిచింది. 399 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనలో రెండోసారి బ్యాట్‌ పట్టిన స్టోక్స్‌సేన.. ప్రస్తుతం 67/1తో ఆడుతుంది. రెండో టెస్టులో విజయానికి ఆతిథ్య భారత్‌కు 9 వికెట్లు అవసరం కాగా, ఇంగ్లాండ్‌కు 332 పరుగులు అవసరం. బజ్‌బాల్‌, స్పిన్‌బాల్‌ నేపథ్యంలో విశాఖ టెస్టులో నేడే ఫలితం తేలనుంది!. యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (104) ఎట్టకేలకు ఫామ్‌ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సహచరులు నిరాశపరిచిన వేళ సెంచరీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. అక్షర్‌ పటేల్‌ (45) సైతం రాణించటంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 255 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు గొప్ప బంతులేమీ వేయకపోయినా క్రమశిక్షణ లోపించిన బ్యాటింగ్‌తో టీమ్‌ ఇండియా వికెట్లు చేజార్చుకుంది.

విశాఖపట్నం : శుభ్‌మన్‌ గిల్‌ (104, 147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసిన శుభ్‌మన్‌ గిల్‌ దూకుడుగా పరుగులు పిండుకున్నాడు. 11 ఫోర్లు, 2 సిక్సర్లతో శతక విన్యాసం చేశాడు. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (45, 84 బంతుల్లో 6 ఫోర్లు) సైతం ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 255 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హర్ట్‌లీ (4/77) నాలుగు వికెట్ల మాయజాలం ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌ 143 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్‌.. ఇంగ్లాండ్‌కు 399 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఛేదనలో ఇంగ్లాండ్‌ 67/1తో ఆడుతోంది. ఓపెనర్లు జాక్‌ క్రావ్లీ (29 బ్యాటింగ్‌, 50 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెన్‌ డకెట్‌ (28, 27 బంతుల్లో 6 ఫోర్లు) అదిరే ఆరంభాన్ని అందించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జాక్‌ క్రావ్లీతో పాటు నైట్‌వాచ్‌మన్‌ రెహాన్‌ అహ్మద్‌ (9 బ్యాటింగ్‌) అజేయంగా నిలిచాడు. రెండో టెస్టులో విజయానికి టీమ్‌ ఇండియా 9 వికెట్ల దూరంలో నిలువగా, ఇంగ్లాండ్‌కు మరో 332 పరుగులు అవసరం. శతక శుభ్‌మన్‌ : ఇటీవల వరుస మ్యాచుల్లో నిరాశపరుస్తున్న యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (104) ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. విశాఖ పిచ్‌పై ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఆకట్టుకునే సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (209) ద్వి శకతంతో టీమ్‌ ఇండియా భారీ స్కోరు సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను శుభ్‌మన్‌ గిల్‌ ఆదుకున్నాడు. ఇక ఓవర్‌నైట్‌ స్కోరు 28/0తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (13) ఒక్క పరుగూ జోడించకుండానే అండర్సన్‌ ఓవర్లో వికెట్‌ కోల్పోయాడు. యశస్వి జైస్వాల్‌ (17) సైతం అండర్సన్‌ ఓవర్లోనే నిష్క్రమించాడు. ఒక్క పరుగు వ్యవధిలో ఓపెనర్లను చేజార్చుకున్న భారత్‌ 30/2తో ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (29) ఇన్నింగ్స్‌కు నిలబెట్టారు. ఈ జోడి మూడో వికెట్‌కు 112 బంతుల్లో 80 పరుగులు జోడించింది. 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిసిన శుభ్‌మన్‌ గిల్‌ 60 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. అయ్యర్‌, గిల్‌ జోరుతో 25.3 ఓవర్లలో భారత్‌ 100 పరుగుల మార్క్‌ చేరుకుంది. క్రీజులో కుదరుకున్నట్టే కనిపించిన శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి నిరాశపరిచాడు. హర్ట్‌లీ మాయలో పడి వికెట్‌ కోల్పోయాడు. అరంగ్రేట ఆటగాడు రజత్‌ పటీదార్‌ (9)ను రెహాన్‌ అహ్మద్‌ వెనక్కి పంపించాడు. 122/4తో టీమ్‌ ఇండియా కష్టాల్లో కూరుకుంది. ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (45) ఈసారి గిల్‌కు అండగా నిలిచాడు. ఆరు ఫోర్లతో మెరిసిన అక్షర్‌ పటేల్‌.. గిల్‌ తోడుగా ఐదో వికెట్‌కు 151 బంతుల్లో 89 పరుగుల విలువైన భాగస్వామం నిర్మించాడు. 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 132 బంతుల్లో కెరీర్‌ మూడో సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్‌ సైతం.. బషీర్‌ ఓవర్లో నిష్క్రమించాడు. అర్థ సెంచరీ ముంగిట అక్షర్‌ పటేల్‌ నిష్క్రమించటంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. టెయిలెండర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ (29, 61 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఎవరూ నిలువలేదు. శ్రీకర్‌ భరత్‌ (6), కుల్దీప్‌ యాదవ్‌ (0), జశ్‌ప్రీత్‌ బుమ్రా (0) తేలిపోయారు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హర్ట్‌లీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రెహాన్‌ అహ్మద్‌ (3/88), జేమ్స్‌ అండర్సన్‌ (2/29) రాణించారు.

ఛేదనలో దూకుడు : 399 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ దూకుడుతో మొదలెట్టింది. మూడో రోజు ఆట చివరి సెషన్లో 14 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 4.78 రన్‌రేట్‌తో ఏకంగా 67 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్‌ క్రావ్లీ (29 నాటౌట్‌), బెన్‌ డకెట్‌ (28) దంచికొట్టారు. డకెట్‌ ఆరు బౌండరీలతో విరుచుకుపడగా, క్రావ్లీ సైతం మూడు ఫోర్లు ఓ సిక్సర్‌తో చెలరేగాడు. దీంతో 10.5 ఓవర్లలోనే ఆ జట్టు తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించింది. ఆఖర్లో అశ్విన్‌ మాయకు బెన్‌ డకెట్‌ పెవిలియన్‌కు చేరినా.. నైట్‌ వాచ్‌మన్‌ రెహాన్‌ అహ్మద్‌ (9 నాటౌట్‌) తోడుగా క్రావ్లీ సాధించాల్సిన లక్ష్యాన్ని కాసింత కుదించాడు. 14 ఓవర్ల ధనాధన్‌తో ఇంగ్లాండ్‌ 67 పరుగులు పిండుకుని, మరో లక్ష్యానికి 332 పరుగుల దూరంలో నిలిచింది.

స్కోరు వివరాలు :

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 396/10

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 253/10

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (సి) రూట్‌ (బి) జైస్వాల్‌ 17, రోహిత్‌ శర్మ (బి) అండర్సన్‌ 13, శుభ్‌మన్‌ గిల్‌ (సి) ఫోక్స్‌ (బి) బషీర్‌ 104, శ్రేయస్‌ అయ్యర్‌ (సి) స్టోక్స్‌ (బి) హర్ట్‌లీ 29, రజత్‌ పటీదార్‌ (సి) ఫోక్స్‌ (బి) రెహాన్‌ అహ్మద్‌ 9, అక్షర్‌ పటేల్‌ (ఎల్బీ) హర్ట్‌లీ 45, శ్రీకర్‌ భరత్‌ (సి) స్టోక్స్‌ (బి) రెహాన్‌ అహ్మద్‌ 6, కుల్దీప్‌ యాదవ్‌ (సి) డకెట్‌ (బి) హర్ట్‌లీ 0, జశ్‌ప్రీత్‌ బుమ్రా (సి) బెయిర్‌స్టో (బి) హర్ట్‌లీ 0, ముకేశ్‌ కుమార్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం : (78.3 ఓవర్లలో ఆలౌట్‌) 255.

వికెట్ల పతనం : 1-29, 2-30, 3-111, 4-122, 5-211, 6-220, 7-228, 8-229, 9-255, 10-255.

బౌలింగ్‌ : జేమ్స్‌ అండర్సన్‌ 10-1-29-2, షోయబ్‌ బషీర్‌ 15-0-58-1, రెహాన్‌ అహ్మద్‌ 24.3-5-88-3, జో రూట్‌ 2-1-1-0, టామ్‌ హర్ట్‌లీ 27-3-77-4.

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : జాక్‌ క్రావ్లీ నాటౌట్‌ 29, బెన్‌ డకెట్‌ (సి) భరత్‌ (బి) అశ్విన్‌ 28, రెహన్‌ అహ్మద్‌ నాటౌట్‌ 9, ఎక్స్‌ట్రాలు : 1, మొత్తం : (14 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 67.వికెట్ల పతనం : 1-50.

బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 5-1-9-0, ముకేశ్‌ కుమార్‌ 2-0-19-0, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-21-0, రవిచంద్రన్‌ అశ్విన్‌ 2-0-8-1, అక్షర్‌ పటేల్‌ 1-0-10-0.

 

➡️