‘స్టాప్‌ క్లాక్‌’ రూల్‌ పక్కాగా అమలు: ఐసిసి

Mar 15,2024 22:20 #Sports

దుబాయ్: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మ్యాచ్‌లను సమయానికి పూర్తిచేసేందుకు గాను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) నడుం బిగించింది. ఈ ఏడాది జూన్‌ నుంచి మొదలుకాబోయే ఐసిసి టి20 ప్రపంచకప్‌లో ‘స్టాప్‌ క్లాక్‌’ నిబంధనను పక్కాగా అమలు చేయనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దుబారులో శుక్రవారం జరిగిన ఐసిసి బోర్డు సమావేశంలో ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌తోపాటు, పరిమిత ఓవర్ల అంతర్జాతీయ మ్యాచుల్లో ఓవర్‌కు ఓవర్‌కు మధ్య సమయానికి సంబంధించి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వు డేలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ రూల్‌ గతేడాది డిసెంబర్‌ నుంచి ఐసిసి ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది.

వెస్టిండీస్‌-ఇంగ్లండ్‌ మధ్య ముగిసిన టి20 సిరీస్‌లో దీనిని అమలుచేశారు. ఏప్రిల్‌ నాటికి ఈ నిబంధనను పరిశీలించాల్సి ఉండగా ఇటీవలే దీనిపై రివ్యూ నిర్వహించిన ఐసిసి.. దీనిలో వస్తున్న ఫలితాలపై మాత్రం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి టి20లతో పాటు వన్డేలలో కూడా ఈ నిబంధనను పూర్తిగా వర్తింపజేయనునున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. స్టాప్‌ క్లాక్‌ రూల్‌ ప్రకారం.. బౌలింగ్‌ చేసే జట్టు ఒక ఓవర్‌ ముగిసిన తర్వాత 60 సెకన్లలోపు తిరిగి మరో ఓవర్‌ను ప్రారంభించాలి. ఇందుకు గాను థర్డ్‌ అంపైర్‌.. స్టాప్‌ క్లాక్‌ను ఉపయోగించి సమయాన్ని లెక్కిస్తారు. ఓవర్‌ తర్వాత ఫీల్డింగ్‌ టీమ్‌ కెప్టెన్‌ తర్వాత ఓవర్‌ను ఎవరితో వేయించాలి..? అని తీరిగ్గా ఆలోచించడం.. ఆటగాళ్లతో పిచ్చాపాటి ముచ్చట్లు పెడితే కుదరదన్నమాట. ఓవర్‌ పూర్తికాకముందే సదరు సారథి తర్వాత ఓవర్‌ ఎవరితో వేయించాలి..? అనేదానిపై పూర్తి స్పష్టతకు రావాల్సి ఉంటుంది. ఒక ఓవర్‌ పూర్తయి మరో ఓవర్‌ ప్రారంభానికి 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం గనక తీసుకుంటే రెండు సార్లు హెచ్చరికలతో వదిలేస్తారు. కానీ మూడోసారి కూడా ఇదే రిపీట్‌ అయితే బ్యాటింగ్‌ టీమ్‌కు ఐదు అదనపు పరుగులు ఇస్తారు. దీనివల్ల మ్యాచ్‌లు షెడ్యూల్‌ చేసిన టైమ్‌లో ముగుస్తాయనేది ఐసిసి వాదన. అయితే ఓవర్‌లో చివరి బంతికి డిఆర్‌ఎస్‌ తీసుకున్నా.. ఒక బ్యాటర్‌ ఔట్‌ అయినా, మరే ఇతర అత్యవసరాలు తప్ప మిగతా వాటికి మాత్రం మినహాయింపు ఉండదు.

➡️