54బంతుల్లో 147పరుగులు..రోహిత్‌ సెంచరీ, రింకు అర్ధసెంచరీ

Jan 17,2024 22:30 #Sports

భారత్‌ 212/4ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో టి20

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన చివరి టి20లో టీమిండియా భారీస్కోర్‌ను నమోదు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీకి తోడు, రింకూ సింగ్‌ అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 212పరుగులు చేసింది. తొలుత టాపార్డర్‌ విఫలమైనా రోహిత్‌ శర్మ (121నాటౌట్‌; 69బంతుల్లో 11ఫోర్లు, 8సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన హిట్‌ మ్యాన్‌.. ఆఖరి ఓవర్లలో తన మార్కు ఆట ఆడి శతకం బాదాడు. 64 బంతుల్లోనే సెంచరీ చేసిన రోహిత్‌కు ఇది టి20లలో ఐదో శతకం. రోహిత్‌కు తోడుగా నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌ (69నాటౌట్‌, 39బంతుల్లో, 2ఫోర్లు, 6సిక్సర్లు) తోడైంది. అఫ్ఘన్‌ పేసర్‌ ఫరీద్‌ అహ్మద్‌.. ఆరంభ ఓవర్లలోనే భారత్‌కు భారీ షాకులిచ్చాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు 20 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఓమర్‌జరు రాణించాడు.టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఫరీద్‌ అహ్మద్‌ మూడో ఓవర్లోనే షాక్‌ ఇచ్చాడు. మూడో బంతికి యశస్వి జైస్వాల్‌(4) భారీ షాట్‌ ఆడబోయి నబీ చేతికి చిక్కాడు. ఆ మరుసటి బంతికే కోహ్లీ మిడాఫ్‌లో ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయ్యాడు. అజ్మతుల్లా వేసిన నాలుగో ఓవర్లో భారత్‌కు మరో షాక్‌ తాకింది. ఆ ఓవర్‌ చివరి బంతికి.. శివమ్‌ దూబే(1) వికెట్‌ కీపర్‌ గుర్బాజ్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు. సంజూ శాంసన్‌(0) కూడా మరోసారి నిరాశపరిచాడు. ఫరీద్‌ వేసిన ఐదో ఓవర్లో శాంసన్‌.. నబీకి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో భారత్‌ ఐదు ఓవర్లలో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో భారత జట్టును కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రింకూ సింగ్‌ ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 90బంతుల్లో 195పరుగులు జోడించారు. ఆరంభంలో తడబడ్డ రోహిత్‌.. భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడాడు. ఖాయిస్‌ అహ్మద్‌ వేసిన 9వ ఓవర్లో ఎల్బీ నుంచి రింకూ బయటపడ్డాడు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 4 వికెట్లు కోల్పోయి 65 పరుగులే చేసింది. సలీం వేసిన 16వ ఓవర్లో రోహిత్‌.. 4, 6 బాదగా రింకూ కూడా ఓ బౌండరీ రాబట్టాడు. కరీమ్‌ జనత్‌ వేసిన 17వ ఓవర్లోనూ రోహిత్‌ 4, 6 తో స్కోరు వేగాన్ని పెంచాడు. అజ్మతుల్లా వేసిన 19వ ఓవర్లో సిక్సర్‌ బాది 90లలోకి వచ్చిన రోహిత్‌.. వరుసగా రెండు బౌండరీలు బాది పొట్టి ఫార్మాట్‌లో ఐదో శతకాన్ని పూర్తిచేశాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టిన రింకూ.. 36 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆఖరి ఓవర్లో రోహిత్‌.. 4, 6, 4 తో పాటు రింకూ కూడా హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదడంతో భారత్‌ 200 పరుగుల మైలురాయిని దాటింది. ఇన్నింగ్స్‌ చివరి 12బంతుల్లో రోహిత్‌-రింకూ సింగ్‌ కలిసి 58పరుగులు రాబట్టారు. అదే క్రమంలో వీరిద్దరూ కలిసి టి20ల్లో ఓ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం(190పరుగులు) రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఇది సంజు-హుడా(176పరుగులు) పేరిట ఉండగా.. తాజాగా వీరిద్దరూ ఆ రికార్డును బ్రేక్‌ చేశారు.

స్కోర్‌బోర్డు..

ఇండియా ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)నబి (బి)ఫరీద్‌ అహ్మద్‌ 4, రోహిత్‌ శర్మ (నాటౌట్‌) 121, కోహ్లి (సి)ఇబ్రహీం (బి)ఫరీద్‌ 0, దూబే (సి)గుర్బాజ్‌ (బి)అజ్మతుల్లా 1, సంజు శాంసన్‌ (సి)నబి (బి)ఫరీద్‌ అహ్మద్‌ 0, రింకు సింగ్‌ (నాటౌట్‌) 69, అదనం 17. (20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 212పరుగులు.

వికెట్ల పతనం: 1/18, 2/18, 3/21, 4/22

బౌలింగ్‌: ఫరీద్‌ అహ్మద్‌ 4-0-20-3, అజ్మతుల్లా 4-0-33-1, ఖ్విస్‌ అహ్మద్‌ 4-0-28-0, మహ్మద్‌ సలీమ్‌ 3-0-43-0, షరాఫుద్దీన్‌ 2-0-25-0, కరీమ్‌ జనత్‌ 3-0-54-0

➡️