ధనాధన్‌ మోత

Nov 27,2023 10:39 #Sports
  • రెండో టీ20లో భారత్‌ గెలుపు
  • యశస్వి, గైక్వాడ్‌, కిషన్‌ అర్ధ సెంచరీలు
  • భారత్‌ స్కోరు 235/4
  • చేథనలో చతికిలపడ్డ ఆసీస్‌

తిరువనంతపురం : భారత్‌ అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో టీ20లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్‌ఇండియా 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో ఆసీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసింది. టాప్‌ ఆర్డర్‌లో స్టీవ్‌ స్మిత్‌ (19), మాథ్యూ షార్ట్‌ (19), జోష్‌ ఇంగ్లిస్‌ (2), మ్యాక్స్‌వెల్‌ (12) విఫలయ్యారు. తర్వాత వచ్చిన మార్కస్‌ స్టాయినిస్‌ (45 పరుగులు, 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (37 పరుగులు, 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. వీరిద్దరూ స్వల్పవ్యవధిలో ఔటయ్యారు. చివర్లో మాథ్యూ వేడ్‌(42 పరుగులు, 23 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) పోరాడినా అప్పటికే ఆసీస్‌ ఓటమి ఖరారైపోయింది. భారత బౌలర్లలో రవి బిష్ణోరు 3, ప్రసిద్ధ్‌ కష్ణ 3, అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌లో ఈ టీ20 సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టీ20 ఈ నెల 28న గౌహతిలో జరగనుంది. ఆదివారం మ్యాచ్‌లో ఇరు జట్లు మొత్తంగా 426 పరుగులు చేశాయి. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ20ల్లో ఇరు జట్లు కలిపి చేసిన స్కోరులో ఇదే అత్యధికం. అలాగే ఆదివారం మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో పదో వికెట్‌కు మాధ్యు వేడ్‌- టి సంఘ జోడీ 36 పరుగులు జోడించింది. ఆస్టేలియా తరపున టీ 20ల్లో పదో వికెట్‌కు ఇదే అత్యుత్తుమ భాగస్వామ్యం. ఆదివారం మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ బ్యాటర్లు చెలరేగారు. స్వింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్‌ ఇండియా.. పరుగుల వరద పారించింది. టాప్‌-3 బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌ (53, 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (58, 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (52, 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరవటంతో భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రింకూ సింగ్‌ (31 నాటౌట్‌, 9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదిరే ముగింపు అందించాడు.పరుగుల వరద : తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (53) అదిరే ఆరంభం అందించాడు. స్వింగ్‌ లభించిన పిచ్‌పై ఆరంభంలో వికెట్లు ఆశించిన ఆసీస్‌కు జైస్వాల్‌ భంగపాటే మిగిల్చాడు. సీన్‌ అబాట్‌ ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో విశ్వరూపం చూపించిన జైస్వాల్‌.. 24 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. జైస్వాల్‌ జోరుతో భారత్‌ 3.5 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ దాటింది. జైస్వాల్‌ నిష్క్రమించినా.. మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (58) జతగా ఇషాన్‌ కిషన్‌ (52) రెచ్చిపోయాడు. గైక్వాడ్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేయగా.. కిషన్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. కిషన్‌ 29 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా, గైక్వాడ్‌ 39 బంతుల్లో కొట్టాడు. సూర్య కుమార్‌ (19) తొలి బంతినే సిక్సర్‌గా మలిచి జోరు కొనసాగించగా.. ఇన్నింగ్స్‌కు రింకూ సింగ్‌ (31 నాటౌట్‌) అదిరే ముగింపు అందించాడు. అబాట్‌ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. చివర్లో తెలుగు తేజం తిలక్‌ వర్మ (7 నాటౌట్‌) సైతం ఓ సిక్సర్‌తో మెరిశాడు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఎలిస్‌ (3/45) మూడు వికెట్లు పడగొట్టాడు.

➡️