డిసెంబర్‌ 21న ఎన్నికలురెజ్లింగ్‌ సమాఖ్యపై రిటర్నింగ్‌ ఆఫీసర్‌

Dec 9,2023 22:15 #Sports

న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికలు ఎట్టకేలకు జరుగనున్నాయి. గతంలో పంజాబ్‌, హర్యానా హైకోర్టు విధించిన స్టే ఆర్డర్‌ను సుప్రీంకోర్టు తొలగించటంతో.. ఎన్నికలకు మార్గం సుగమం అయ్యింది. డిసెంబర్‌ 21న ఎన్నికలు, కౌంటింగ్‌, ఫలితాల వెల్లడికి తాజాగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ నోటీఫికేషన్‌ విడుదల చేశారు. ఆగస్టు 12న ఎన్నికలకు రంగం సిద్ధం కాగా.. ఒక్క రోజు ముందు నిలుపుదల ఆదేశాలతో ప్రక్రియ అక్కడితో నిలిచిపోయింది. పర్యావసానంగా డబ్ల్యూఎఫ్‌ఐపై అంతర్జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య సస్పెన్షన్‌ వేటు సైతం వేసింది. డిసెంబర్‌ 21న ఎన్నికలు, ఫలితాలు.. పంజాబ్‌, హర్యానా హైకోర్టు ముందున్న రిట్‌ పిటిషను తీర్పుకు లోబడి ఉంటాయని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ విశ్రాంత న్యాయమూర్తి ఎం.ఎం కుమార్‌ తెలిపారు. ఆగస్టు 7 నాటికి ఓటర్ల జాబితా ఖరారు కావటంతో.. ఇప్పుడు ఆ తర్వాత ప్రక్రియ మాత్రమే ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా సైతం ఆగస్టు 7 నాటిదే అంతిమమని పేర్కొన్నారు. దీంతో ఇక నేరుగా ఓటింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. న్యూఢిల్లీలోని ఒలింపిక్‌ భవన్‌లో పోలింగ్‌ జరుగుతుందని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వెల్లడించారు. బిజెపి ఎంపీ, డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధించాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని భారత స్టార్‌ రెజ్లర్లు జంతర్‌ మంతర్‌ వద్ద సుమారు రెండు నెలల పాటు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.

➡️