తొలి టెస్ట్‌కు సర్వం సిద్ధం

Jan 23,2024 08:06 #Cricket, #First Test, #Sports
  •  ఇంగ్లండ్‌ ఆటగాళ్ల రాక
  •  ఇప్పటికే ప్రాక్టీస్‌లో నిమగమైన టీమిండియా

హైదరాబాద్‌: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌కు భారత్‌ సిద్ధమౌతోంది. ఇప్పటికే హైదరాబాద్‌ చేరిన టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగం కాగా.. సోమవారం ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఉప్పల్‌కు చేరుకున్నారు. జనవరి 25నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (2023-25)లో భారత్‌కిది కీలక సిరీస్‌. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌, ఇంగ్లాండ్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే దాదాపు ఇరుజట్ల ఆటగాళ్లు హైదరాబాద్‌ చేరుకుని ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించని పక్షంలో బౌలర్లను తెలివిగా రొటేట్‌ చేసుకోవాలని మాజీ క్రికెటర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు సూచన చేశారు. ఈ పిచ్‌పై కెప్టెన్‌ బౌలర్లను తెలివిగా ఉపయోగించుకోవాలి. సాధారణంగా ఉప్పల్‌ పిచ్‌పై తగినంత టర్న్‌ లభించదు. కాబట్టి వికెట్ల సాధనకు బౌలర్లు చెమటోడ్చాల్సి రావొచ్చు. గత పర్యటనలో ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన టెస్టులో రోహిత్‌ అద్భుతమైన సెంచరీ సాధించాడు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై ఎలా బ్యాటింగ్‌ చేయాలో చూపించాడు. అతడు అదేవిధంగా బ్యాటింగ్‌ చేస్తే భారత్‌కు మంచి ఆరంభం లభిస్తుంది” అని గావస్కర్‌ పేర్కొన్నాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో టీమిండియాకు గొప్ప రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆడిన ఐదు టెస్టుల్లో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

➡️