రేపటి నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదో టెస్ట్‌

Mar 6,2024 10:49 #Sports

ధర్మశాల : భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదో, చివరి టెస్ట్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్‌ ఓడిన టీమిండియా.. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టుల్లో ఘన విజయం సాధించి సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ చివరి సెషన్‌ బౌలర్లకు సహకరించనుంది. ప్ర ఇక్కడి వాతావరణం -4డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోతుంది. అలాగే సాయంత్రంపూట చిరుజల్లులు కురిసే ఛాన్స్‌ ఉంది. ఇక్కడి వాతావరణం చల్లగా ఉండడంతో బౌలర్ల ఆధిపత్యం చెలాయించొచ్చు. మ్యాచ్‌ జరిగే ఐదురోజుల్లో రెండురోజుల తప్పనిసరిగా చిరుజల్లులు కురిసే అవకాశముందని ఇక్కడి వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. పూర్తి మ్యాచ్‌ సూర్యకిరణాల వెలుగుతో జరగడం కష్టం. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ పేసర్లపై భారం వేయగా.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ టెస్ట్‌కు బుమ్రాకు విశ్రాంతి నిచ్చాడు. రోహిత్‌ కూడా పేసర్లనే నమ్ముకుంటే సిరాజ్‌, ముఖేష్‌, ఆకాశ్‌ దీప్‌లలో ఇద్దరికి చోటు దక్కడం ఖాయం. 2017లో చివరిసారిగా ఈ మైదానంలో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ 8వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసింది. రవీంద్ర జడేజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించగా.. అతడు నాలుగు వికెట్లు తీయడంతోపాటు 63పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

➡️