ఐపిఎల్‌ సంగ్రామం నేటినుంచే..

Mar 22,2024 07:58 #Sports
  • తొలుత ప్రారంభోత్సవ వేడుకలు
  • అనంతరం చెన్నైాబెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌

చెన్నై: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌ా17కు రంగం సిద్ధమైంది. 10 జట్ల కెప్టెన్లు, ఐపిఎల్‌ ట్రోఫీతో ఉన్న ఫొటోలను బిసిసిఐ ట్విట్టర్‌(ఎక్స్‌)లో గురువారం విడుదల చేసింది. ఒక ఫొటోలో తొమ్మిది జట్ల కెప్టెన్లు, ఓ వైస్‌ కెప్టెన్‌ ఉండగా.. మరో ఫొటోలో ధోనీ, భువనేశ్వర్‌ కుమార్‌, డేవిడ్‌ వార్నర్‌, శిఖర్‌ ధావన్‌ తదితరులు ఉన్నారు. చెన్నై జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ నాయకత్వం వహిస్తాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఈ రెండు ఫొటోలనూ కనిపించలేదు. ఐపిఎల్‌ టోర్నీ చరిత్రలో రోహిత్‌, కోహ్లి లేకపోవడం ఇదే తొలిసారి. సాయంత్రం 5.30గం.ల నుంచి ఎంఎ. చిదంబరం(చెపాక్‌) స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. అనంతరం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్‌ ఐపిఎల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(సిఎస్‌కే)కు బాధ్యతలు వహించేది ధోనీ కాదని ఆ ఫ్రాంచైజీ తాజాగా ప్రకటించింది. అలాగే బెంగళూరు, ముంబయి, సన్‌రైజర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ ఫ్రాంచైజీలు నూతన సారథులను ఎంపిక చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ కీలక మార్పు చేసింది. ఐదుసార్లు టైటిళ్లు అందించిన ఎంఎస్‌ ధోనీని కెపెన్సీ బాధ్యతల నుంచి తప్పించి రుతురాజ్‌ గైక్వాడ్‌ పగ్గాలు అప్పగించింది. ఈ సీజన్‌ తర్వాత ధోనీ ఐపిఎల్‌ నుంచి వైదొలుగుతాడని, ఈ క్రమంలోనే యువ క్రికెటర్లకు పగ్గాలు అప్పగించేందుకు స్వచ్ఛందంగా సారథ్య బాధ్యతలనుంచి తప్పుకున్నాడని సమాచారం. 2013 స్పాట్‌ ఫిక్సింగ్‌ నేపథ్యంలో ఫ్రాంచైజీని సస్పెండ్‌ చేసిన మినహా మిగతా మిగతా అన్ని సీజన్లకు కెప్టెన్‌ సేవలందించాడు. 2022 సీజన్‌ ప్రారంభంలో రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించగా.. ఎనిమిది మ్యాచ్‌ల అనంతరం ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. ఐపిఎల్‌ చెన్నైకు 212 మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా.. 128 మ్యాచ్‌లు గెలిచి.. 82 మ్యాచుల్లో ఓటమిపాలైంది. గత ఏడాది అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో ధోనీ నేతృత్వంలోని చైన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఐదోసారి టైటిల్‌ను సాధించింది. 2020 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోనీ ఐపిఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు.

షమీ ఔట్‌.. సందీప్‌కు ఛాన్స్‌..
2022 ఛాంపియన్‌, 2023 రన్నరప్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడు ఈ సీజన్‌ ఐపిఎల్‌ మొత్తానికి దూరమైనట్లు ఆ ఫ్రాంచైజీ గురువారం వెల్లడించింది. వన్డే వరల్డ్‌కప్‌ సందర్భంగా గాయపడ్డ షమీ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టనున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. ఇక అతడి స్థానంలో యువ మీడియం పేసర్‌ సందీప్‌ వారియర్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కేరళకు చెందిన సందీప్‌ కనీస ధర రూ.50 లక్షలకు గుజరాత్‌ తరఫున ఆడనున్నాడు.
కెప్టెన్‌ మారినా.. సన్‌రైజర్స్‌ రాత మారేనా..!గత రెండు సీజన్‌ల నుంచి నిరాశపరుస్తున్నట్లు సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌ మార్పు ఏమాత్రం కలిసిరానుందో తేలిపోనుంది. రెండు సీజన్లలోనూ సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో చివరి స్థానాలకే పరిమితమవుతూ అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలో రూ.20కోట్ల భారీ మొత్తం వెచ్చించి మరీ కొత్త కెప్టెన్‌ను తీసుకుంది. తమ జట్టు భవితవ్యం మారిపోతుందన్న ఆశలతో ఎడిషన్‌లో పోటీకి సిద్ధమైంది. జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన ఆస్ట్రేలియా స్టార్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులకు భరోసా ఇచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం నుంచే ఐపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో కమిన్స్‌ మాట్లాడిన వీడియోను ఎస్‌ఆర్‌హెచ్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. తొలి ప్రత్యర్థి కెకెఆర్‌ నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తామని అందులో తెలిపాడు.

➡️