మ్యాక్స్‌వెల్‌ మెరుపు శతకం

Nov 29,2023 10:36 #Sports
  • భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్‌
  • గైక్వాడ్‌ సెంచరీ వృథా
  • మూడో టి20లో ఐదు వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా

గౌహతి : ఆస్ట్రేలియా బ్యాటర్‌ మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌నుంచి మరోసారి పరుగుల వరద పారింది. ఆసీస్‌ జట్టు చివరి 12బంతుల్లో 45పరుగులు చేయాల్సిన దశలో మ్యాక్స్‌వెల్‌(104నాటౌట్‌; 48బంతుల్లో 8ఫోర్లు, 8సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి మ్యాచ్‌ను ముగించిన తీరు అత్యద్భుతం. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 222పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (123నాటౌట్‌; 57బంతుల్లో 13ఫోర్లు, 7సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. ఛేదనలో భాగంగా ఆసీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 225 పరుగులు చేసి గెలిచింది. చివరి ఓవర్లో గెలుపుకు 21పరుగు లు చేయాల్సిన దశలో మ్యాక్స్‌వెల్‌ ఫోర్లు, సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. అలాగే ఆసీస్‌ బౌలర్‌ మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో 30 పరుగులు సమర్పించుకొని ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ రికార్డు ఇంతకుముందు బ్రెట్‌ లీ(ఆస్ట్రేలియా) పేరిట 2009లో ఉంది. వెస్టిండీస్‌పై అతడు చివరి ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకోగా.. తాజాగా మ్యాక్స్‌వెల్‌ 30సమర్పించుకొన్నాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్‌ జైస్వాల్‌(6), ఇషాన్‌(0) నిరాశపరిచారు. దీంతో భారతజట్టు 24పరుగులకే 2వికెట్లు కోల్పో యి కష్టాల్లో పడింది. జైస్వాల్‌ (6).. బెరెన్‌డార్ఫ్‌ వేసిన రెండో ఓవర్లో వికెట్‌ కీపర్‌ వేడ్‌కు క్యాచ్‌ ఇవ్వగా.. ఆ మరుసటి ఓవర్లోనే ఇషాన్‌ కిషన్‌ (0)ను కేన్‌ రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో కవర్స్‌ దిశగా ఆడబోయి స్టోయినిస్‌ చేతికి చిక్కాడు. ఆ దశలో రుతురాజ్‌ గైక్వాడ్‌(123నాటౌట్‌; 57బంతుల్లో 13ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కెప్టె న్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(39), తిలక్‌ వర్మ(31 నా టౌట్‌) కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో టీమిండి యా నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 222 పరు గుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. రిచర్డుసన్‌, బెహ్రెన్‌డార్ఫ్‌, హార్డీకి ఒక్కో వికెట్‌ దక్కాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్‌ ఓపెనర్‌ హెడ్‌(35) రాణించినా.. హార్డీ(16), ఇంగ్ల్‌ి(10), స్టొయినీస్‌(17) నిరాశపరిచారు. ఆ తర్వాత టిమ్‌ డేవిడ్‌(0) కూడా డకౌట్‌ కావడంతో ఆ జట్టు 134 పరుగులకే 5వికెట్లు కోల్పోయి ఓటమికోరల్లో నిలిచిం ది. క్రమంలో కెప్టెన్‌ మాధ్యు వేడ్‌(28నాటౌట్‌; 16 బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్‌) సాయంతో మ్యాక్స్‌వెల్‌ (104) సెంచరీతో కదం తొక్కాడు. రవి బిష్ణోరుకు రెండు, ఆర్ష్‌దీప్‌, ఆవేశ్‌ఖాన్‌, అక్షర్‌ పటేల్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో ఐదు టి20ల సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యతలో ఉండగా.. నాల్గో టి20 రారుపూర్‌ వేదికగా డిసెంబర్‌ 1న జరగనుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మ్యాక్స్‌వెల్‌కు లభించింది.

స్కోర్‌బోర్డు…

ఇండియా ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)వేడ్‌ (బి)బెహ్రెన్‌డార్ఫ్‌ 6, గైక్వాడ్‌ (నాటౌట్‌) 123, ఇషాన్‌ కిషన్‌ (సి)స్టొయినీస్‌ (బి)రిచర్డుసన్‌ 0, సూర్యకుమార్‌ (సి)వేడ్‌ (బి)హార్డి 39, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 31, అదనం 23. (20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 222పరుగులు. వికెట్ల పతనం: 1/14, 2/24, 3/81 బౌలింగ్‌: రికార్డుసన్‌ 3-0-34-1, బెహ్రెన్‌డార్ఫ్‌ 4-1-12-1, ఎల్లిస్‌ 4-0-36-0, సాంఘా 4-0-42-0, హార్డి 4-0-64-1, మ్యాక్స్‌వెల్‌ 1-0-30-0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: రికార్డుసన్‌ (సి)బిష్ణోరు (బి)ఆవేశ్‌ ఖాన్‌ 35, హార్డి (సి)ఇషాన్‌ (బి)ఆవేశ్‌ ఖాన్‌ 16, ఇంగ్లిస్‌ (బి)రవి బిష్ణోరు 10, మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 104, స్టొయినీస్‌ (సి)సూర్యకుమార్‌ (బి)ఆక్షర్‌ పటేల్‌ 17, టిమ్‌ డేవిడ్‌ (సి)సూర్యకుమార్‌ (బి)రవి బిష్ణోరు 0, వేడ్‌ (నాటౌట్‌) 28, అదనం 15. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 225పరుగులు. వికెట్ల పతనం: 1/47, 2/66, 3/68, 4/128, 5/134 బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-44-1, ప్రసిధ్‌ కృష్ణ 4-0-68-0, రవి బిష్ణోరు 4-0-32-2, ఆవేశ్‌ ఖాన్‌ 4-0-37-1, అక్షర్‌ పటేల్‌ 4-0-37-1.

టి20ల్లో గైక్వాడ్‌ తొలి సెంచరీ..

టి20ల్లో రుతురాజ్‌ గైక్వాడ్‌ తొలి సెంచరీని కొట్టాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఔటయ్యాక తిలక్‌వర్మతో జతకట్టిన గైక్వాడ్‌ బ్యాట్‌ ఝుళిపించడం మొదలుపెట్టాడు. కేన్‌ రిచర్ద్‌సన్‌ వేసిన 12వ ఓవర్లో తిలక్‌ రెండు ఫోర్లు బాదగా.. గైక్వాడ్‌ ఓ బౌండరీ కొట్టాడు. హార్డీ వేసిన 14వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన గైక్వాడ్‌ 33 బంతుల్లో అర్థసెంచరీ పూర్తిచేశాడు. అర్థసెంచరీ తర్వాత రుతురాజ్‌ మరింత రెచ్చిపోయాడు. సంఘా వేసిన 15వ ఓవర్లో 4, 6 కొట్టిన గైక్వాడ్‌.. హార్డీ వేసిన 18వ ఓవర్లో 6, 6, 4, 6తో మొత్తం 25పరుగులు రాబట్టాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఆఖరి ఓవర్లో ఫస్ట్‌ బాల్‌కే సిక్సర్‌ కొట్టి శతకం పూర్తిచేశాడు. అంతర్జాతీయ టి20లలో అతడికి ఇదే తొలి శతకం. 33 బంతుల్లో అర్థసెంచరీ చేసిన అతడు తర్వాత 19 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేయడం గమనార్హం. దీంతో టి20 ఫార్మాట్‌లో సెంచరీ కొట్టిన భారత ఆటగాళ్లలో ఆరో బ్యాటర్‌గా నిలిచాడు.

➡️