ముంబయి మురిసింది

Apr 7,2024 23:11 #Sports

ముంబయి ఇండియన్స్‌కు తొలి గెలుపు
ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం
షెఫర్డ్‌, బుమ్రా, డెవిడ్‌ మెరుపుల్‌
ముంబయి 234/5, ఢిల్లీ 205/8
ముంబయి మురిసింది. ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్‌ ఓ విజయం సాధించింది. ఐపీఎల్‌ 17సీజన్‌లో వరుసగా మూడు పరాజయాలు చవిచూసిన ముంబయి ఇండియన్స్‌ ఆదివారం వాంఖడెలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో పంత్‌సేనపై 29 పరుగుల తేడాతో పాండ్యసేన గెలుపొందింది. రొమారియో షెఫర్డ్‌, టిమ్‌ డెవిడ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా మెరుపు ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్‌ పాయింట్ల ఖాతా తెరిచింది.
ముంబయి: పరుగుల వరద పారిన వాంఖడెలో ముంబయి ఇండియన్స్‌ పైచేయి సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్‌ 17 సీజన్లో తొలి విజయం నమోదు చేసింది. 235 పరుగుల రికార్డు ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాడినా ఓటమి తప్పలేదు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (71 నాటౌట్‌, 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), పృథ్వీ షా (66, 40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిషేక్‌ పోరెల్‌ (41, 31 బంతుల్లో 5 ఫోర్లు) కదం తొక్కినా క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (49, 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (42, 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహా టిమ్‌ డెవిడ్‌ (45 నాటౌట్‌, 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోమారియో షెఫర్డ్‌ (39 నాటౌట్‌, 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న రొమారియో షెఫర్డ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. నాలుగు మ్యాచుల్లో ముంబయి ఇండియన్స్‌కు ఇది తొలి విజయం కాగా.. ఐదు మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది నాల్గో పరాజయం. ఇక ముంబయి ఇండియన్స్‌ ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది. ఇన్నింగ్స్‌లో ఒక్క అర్థ సెంచరీ సైతం నమోదు కాకుండా ఓ టీ20 మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.
స్టబ్స్‌ పోరాటం వృథా : లక్ష్యం 235 పరుగులు. ధనాధన్‌ మెరుపులకు పిచ్‌ అనుకూలం. దీంతో ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ దూకుడుగా ఆడింది. పృథ్వీ షా (66), అభిషేక్‌ పోరెల్‌ (41) దంచికొట్టారు. పృథ్వీ షా పవర్‌ప్లేలో అదరగొట్టాడు. మూడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (71 నాటౌట్‌) విధ్వంసక విన్యాసం వృథా అయ్యింది. 25 బంతుల్లోనే 71 పరుగులు పిండుకున్న స్టబ్స్‌ ముంబయి ఇండియన్స్‌కు భయపెట్టాడు. ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లతో సునామీ సృష్టించిన స్టబ్స్‌కు మరో ఎండ్‌కు సహకారం లభించలేదు. రిషబ్‌ పంత్‌ (1), అక్షర్‌ పటేల్‌ (8), లలిత్‌ యాదవ్‌ (3), కుమార్‌ కుశాగ్ర (0)లు చేతులెత్తేశారు. డెవిడ్‌ వార్నర్‌ (10) నిరాశపరిచాడు. పృథ్వీ షా, అభిషేక్‌ పోరెల్‌, స్టబ్స్‌ మెరుపులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లలో జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/22) క్యాపిటల్స్‌ విజయావకాశాలను ప్రభావితం చేశాడు. గెరాల్డ్‌ కోయేట్జి (4/34) టెయిలెండర్ల వికెట్లతో ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లాడు.
కలిసికట్టుగా కొట్టారు : టాస్‌ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఆరంభంలో పిచ్‌ నుంచి అదనపు పేస్‌ ఆశించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశే ఎదురైంది. ముంబయి ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ పవర్‌ప్లేలో ఎదురుదాడి చేశారు. దీంతో తొలి ఆరు ఓవర్లలోనే ముంబయి ఇండియన్స్‌ 75 పరుగులు పిండుకుంది. రోహిత్‌ శర్మ మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లు కొట్టగా.. ఇషాన్‌ కిషన్‌ సైతం రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో చెలరేగాడు. తొలి వికెట్‌కు ఓపెనర్లు ఏడు ఓవర్లలోనే 80 పరుగులు జోడించగా ముంబయి ఇండియన్స్‌ భారీ స్కోరు దిశగా సాగింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (0) పునరాగమనంలో సున్నా పరుగులకే నిష్క్రమించగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (39, 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (6) మిడిల్‌ ఓవర్లలో నెమ్మదిగా ఆడారు. కానీ డెత్‌ ఓవర్లలో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్లు అరాచకం అంటే ఎంటో చూపించారు. టిమ్‌ డెవిడ్‌ (45 నాటౌట్‌), రొమారియో షెఫర్డ్‌ (39 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగారు. నోకియా వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో రొమారియో ఏకంగా నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. ఆఖరు ఓవర్లో 32 పరుగులు పిండుకున్న షెఫర్డ్‌ ముంబయి ఇండియన్స్‌ గతినే మార్చివేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు వరుసగా రెండో మ్యాచ్‌లో ఊచకోతకు గురయ్యారు. అక్షర్‌ పటేల్‌, ఎన్రిచ్‌ నోకియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లలిత్‌ యాదవ్‌, రిచర్డ్‌సన్‌, నోకియా, ఇషాంత్‌ శర్మ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

స్కోరు వివరాలు :
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (బి) అక్షర్‌ 49, ఇషాన్‌ కిషన్‌ (సి,బి) అక్షర్‌ 42, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) ఫ్రాసెర్‌ (బి) నోకియా 0, హార్దిక్‌ పాండ్య (సి) ఫ్రాసెర్‌ (బి) నోకియా 39, తిలక్‌ వర్మ (సి) అక్షర్‌ (బి) ఖలీల్‌ 6, టిమ్‌ డెవిడ్‌ నాటౌట్‌ 45, రోమారియో షెఫర్డ్‌ నాటౌట్‌ 39, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 234.
వికెట్ల పతనం : 1-80, 2-81, 3-111, 4-121, 5-181.
బౌలింగ్‌ : ఖలీల్‌ అహ్మద్‌ 4-0-39-1, ఇషాంత్‌ శర్మ 3-0-40-0, జై రిచర్డ్‌సన్‌ 4-0-40-0, అక్షర్‌ పటేల్‌ 4-0-35-2, లలిత్‌ యాదవ్‌ 1-0-5-0, ఎన్రిచ్‌ నోకియా 4-0-65-2.
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ : పృథ్వీ షా (బి) బుమ్రా 66, డెవిడ్‌ వార్నర్‌ (సి) హార్దిక్‌ (బి) షెఫర్డ్‌ 0, అభిషేక్‌ పోరెల్‌ (సి) డెవిడ్‌ (బి) బుమ్రా 41, ట్రిస్టిన్‌ స్ట్రబ్స్‌ నాటౌట్‌ 71, రిషబ్‌ పంత్‌ (సి) హార్దిక్‌ (బి) కోయేట్జి 1, అక్షర్‌ పటేల్‌ (రనౌట్‌) 8, లలిత్‌ యాదవ్‌ (సి) కిషన్‌ (బి) కోయేట్జి 3, కుమార్‌ కుశాగ్ర (సి) తిలక్‌ (బి) కోయేట్జి 0, జై రిచర్డ్‌సన్‌ (సి) ఇషాంత్‌ (బి) కోయేట్జి 2, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 205.
వికెట్ల పతనం : గెరాల్డ్‌ కోయేట్జి 4-0-34-4, జశ్‌ప్రీత్‌ బుమ్రా 4-0-22-2, ఆకాశ్‌ మద్వాల్‌ 4-0-45-0, రోమారియో షెఫర్డ్‌ 4-0-54-1, మహ్మద్‌ నబి 2-0-7-0, పియూశ్‌ చావ్లా 2-0-32-0.

➡️