ఇక ఆంధ్రకు ఆడను: హనుమ విహారి సంచలన ప్రకటన

Feb 26,2024 17:54 #Cricket, #Sports

భవిష్యత్‌లో ఆంధ్ర క్రికెట్‌ జట్టుకు ఆడబోనని హనుమ విహారి వెల్లడించాడు. తాను కెప్టెన్సీ వదులుకోవడానికి దారితీసిన పరిస్థితులను హనుమ విహారి ఓ ప్రకటనలో వివరించాడు. క్రికెట్‌లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని తెలిపాడు. కాగా విహారి ఇన్‌స్టా పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

”కొన్ని వాస్తవాలను అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నా. ఈ రంజీ సీజన్‌ లో ఆంధ్రా జట్టు బెంగాల్‌ టీమ్‌ తో ఆడినప్పుడు నేను కెప్టెన్‌ గా ఉన్నాను. ఆ సమయంలో ఆంధ్రా రంజీ టీమ్‌ లోని 17వ ఆటగాడిపై కోపంతో అరిచాను. దాంతో ఆ ఆటగాడు తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. ఆ క్రికెటర్‌ తండ్రి ఒక రాజకీయనేత. నాపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన క్రికెట్‌ సంఘంపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆ మ్యాచ్‌ లో బెంగాల్‌ పై 410 పరుగులు ఛేదించి నెగ్గాం. బెంగాల్‌ జట్టు చిన్నాచితకా జట్టేమీ కాదు… గతేడాది రంజీ ఫైనలిస్టు. అటువంటి జట్టుపై నెగ్గినప్పటికీ, కెప్టెన్‌గా నన్ను రాజీనామా చేయాలని చెప్పారు. నా తప్పేమీ లేకపోయినా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్నారు. ఆ ఆటగాడి గురించి నేను వ్యక్తిగతంగా మాట్లాడింది కూడా ఏమీ లేదు. కానీ నాకంటే ఆ ఆటగాడే ముఖ్యమని క్రికెట్‌ అసోషియేషన్‌ భావించింది. గతేడాది తన శరీరానికి తగిలిన దెబ్బను కూడా లెక్కచేయకుండా ఒక్కచేత్తో బ్యాటింగ్‌ చేసిన ఆటగాడి కంటే, గత ఏడేళ్లలో ఆంధ్రా జట్టును ఐదు సార్లు నాకౌట్‌కు చేర్చిన ఆటగాడి కంటే క్రికెట్‌ సంఘానికి ఆ ఆటగాడే ముఖ్యం అయ్యాడు. నాకు ఈ పరిణామం ఎంతో వేదన కలిగించింది. అయినప్పటికీ ఈ సీజన్‌లో ఆడుతున్నానంటే అందుకు కారణం… క్రికెట్‌పై నాకున్న గౌరవం, నా జట్టుపై నాకున్న గౌరవం. తాము ఏం చెబితే క్రికెటర్లు అది వినాలని, తమ వల్లే క్రికెటర్లు జట్టుకు ఎంపికై ఆడుతున్నారని క్రికెట్‌ అసోసియేషన్‌ భావిస్తుండడం విచారకరం. ఈ ఘటనపై నాలో నేనే బాధపడ్డాను కానీ ఇప్పటిదాకా బయటికి చెప్పుకోలేదు. అందుకే… ఇక ఎప్పటికీ ఆంధ్రా టీమ్‌కు ఆడరాదని నిర్ణయించుకున్నాను. నాకు గౌరవం లేని చోట నేను ఉండలేను. ఆ జట్టు అంటే నాకు ఇష్టమే… ప్రతి సీజన్‌కు మేం ఎంతో మెరుగవుతూ వస్తున్నాం… కానీ మేం ఎదగడమే క్రికెట్‌ అసోసియేషన్‌ కు ఇష్టం లేనట్టుంది” అంటూ హనుమ విహారి తన ప్రకటనలో వివరించాడు.

➡️